అనంతపురం: విద్యుత్ చార్జీలను పెంపుపై అనంతపురం జిల్లాలో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... శుక్రవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు వేర్వేరుగా నిరసన తెలిపాయి. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించాయి. అనంతపురం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. నగర ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేస్తూ నిరసన తెలిపాయి. జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.