రచ్చబండలే దీక్షా శిబిరాలు

ABN , First Publish Date - 2020-03-24T09:47:18+05:30 IST

రోనా హెచ్చరికల నేపథ్యంలో అమరావతి ఉద్యమం రూపు మారింది. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ...

రచ్చబండలే దీక్షా శిబిరాలు

  • వంతుల వారీగా అమరావతి నిరసనలు
  • బాధ్యత మరవకుండా హోరెత్తించిన పోరు
  • ఎక్కడికక్కడ శిబిరాలు.. దీక్షల్లో 25 మందిలోపే
  • 97వ రోజు పోరు మరింత ఉధృతం చేసిన రాజధాని రైతులు

తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి క్రైం, గుంటూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కరోనా హెచ్చరికల నేపథ్యంలో అమరావతి ఉద్యమం రూపు మారింది. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆందోళనకారులు గుమికూడకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం అమరావతి ఆందోళనలు 97వ రోజూ కొనసాగాయి. ఎక్కడికక్కడ గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, రేడియో రూంలు, రచ్చబండలు, పాఠశాల ఆవరణలే వేదికలుగా దీక్ష శిబిరాలుగా వెలిశాయి. ఆయా శిబిరాల్లో కూడా వందల సంఖ్యలో కాకుండా విడతల వారీగా పది నుంచి 25 మంది వరకు మాత్రమే దీక్ష చేపడుతున్నారు. అదీ కూడా మీటరు దూరం పైన ఒకరికి ఒకరు దూరం పాటిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధాని 29 గ్రామాల రైతులు రైతు కూలీలు, మహిళలు ఇప్పటి దాక ఏదో ఒక శిబిరం వద్దకు వచ్చి వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేక పోవటంతో ఏ గ్రామంలో రైతులు ఆ గ్రామంలో ఉద్యమం చేస్తున్నారు. సోమవారం పెదపరిమి, తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మందడం, అబ్బురాజుపాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం, నవులూరు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు రచ్చబండలు, ఇళ్ల వద్ద, ప్రైవేటు స్థలాల్లో కొంతమంది మాత్రమే ఉండి మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.  తదితర గ్రామాల్లో ఎవరి బజారులో వారు మాస్కులు ధరించి, చేతులను శానిటేషన్‌ చేసుకుంటూ ధర్నాలను కొనసాగించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు, మహిళలు, కూలీలు ఉద్యమాన్ని హోరెత్తించారు. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటిస్తూనే అమరావతి ఉద్యమం సాగిస్తున్నట్లు రైతులు తెలిపారు. జై అమరావతి మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. మందడంలోని ఓ కల్యాణ మండపంలో రైతులు, మహిళలు నిరసన తెలిపారు.   ఊరు వాడా అన్న తేడా లేకుండా ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతికేరించారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పుతోనైనా కక్ష సాధింపు చర్యలు మానుకుని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కరోనా ప్రభావంతో 96 రోజులుగా కొనసాగించిన వంటవార్పును  సోమవారం నిలిపివేశారు. 


కొనసాగిన ‘అమరావతి వెలుగు’

రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ నిలిపి కొవ్వొత్తులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ పేరిట రాజధాని మహిళలు చేస్తున్న నిరసన ప్రదర్శన సోమవారం కూడా కొనసాగింది. రాత్రి 7.30 నుంచి 7.35 వరకు ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ సమయాన్ని మరింత పెంచుతామని మహిళలు చెప్పారు. అలానే తమ ఇంటి ముందు సేవ్‌ అమరావతి అంటూ చేపట్టిన ముగ్గుల నిరసన కొనసాగిస్తామని తెలిపారు.


Updated Date - 2020-03-24T09:47:18+05:30 IST