పురాతనమైన చర్చికి ట్రంప్.. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు

ABN , First Publish Date - 2020-06-03T02:22:57+05:30 IST

శ్వేత పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన తరువాత అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. గత కొద్ది రోజులుగా వేలాది

పురాతనమైన చర్చికి ట్రంప్.. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు

వాషింగ్టన్: శ్వేత పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన తరువాత అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. గత కొద్ది రోజులుగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళకారులు బిల్డింగ్‌లను, కార్లను ధ్వంసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 200 ఏళ్ల పురాతనమైన సెయింట్ జాన్స్ చర్చికి వెళ్లారు. శ్వేతసౌధానికి సమీపంలో ఉండే ఈ చర్చిని అమెరికా నాలుగో అధ్యక్షుడు జేమ్స్ మాడిసన్ నుంచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరు సందర్శించారు. చర్చిలో బైబిల్‌ పట్టుకుని ట్రంప్ ఫొటోకు ఫోజిచ్చారు. శ్వేతసౌధాన్ని నిరసనకారులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబాన్ని ముందు జాగ్రత్తగా అమెరికా సీక్రెట్ సర్వీస్ బంకర్‌కు కూడా తరలించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాక సందర్భంగా పోలీసులు చర్చి చుట్టుపక్కల ఉన్న నిరసనకారులను చెదరగొట్టారు. ట్రంప్ ముందుగా రోజ్ గార్డెన్‌‌లో ప్రసంగించి అనంతరం చర్చీలోకి ప్రవేశించారు. నిరసనకారులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికి ట్రంప్ వస్తుండటంతో పోలీసులు బలవంతంగా వారిని చెదిరిగొట్టినట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-06-03T02:22:57+05:30 IST