Abn logo
Sep 27 2021 @ 14:38PM

సింఘు సరిహద్దులో విషాదం.. గుండెపోటుతో రైతు మృతి

న్యూఢిల్లీ: ఏడాది క్రితం కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన 'భారత్ బంద్'లో విషాదం చోటుచేసుకుంది. సింఘు సరిహద్దు వద్ద సోమవారం ఉదయం నిరసనల్లో పాల్గొన్న 54 ఏళ్ల రైతు మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన మరణించినట్టు అనుమానిస్తున్నారు. పాస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు ఇవ్వగలమని పోలీసులు తెలిపారు. కాగా, గత ఏడాది ఇదే రోజు వివాదాస్పద సాగు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని, ఈ రోజు 'బ్లాక్‌డే'గా తామంతా భావిస్తున్నామని రైతు నేతలు తెలిపారు.

మరోవైపు, భారత్ బంద్ సందర్భంగా పరిస్థితిని హోం మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ప్రజావ్యవస్థను స్తంభింపజేసినట్లయితే నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎచ్ఏ ఆదేశాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, బంద్ సందర్భంగా పలు చోట్ల నిరసనకారులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే వారిని ఒప్పించి రైల్వే ట్రాక్‌ల నుంచి వెనక్కు మళ్లించేందుకు, రైళ్ల రాకపోకలు యథాప్రకారం జరిగేటట్టు అధికార యంత్రంగం ప్రయత్నిస్తోంది. టిక్రి సరిహద్దుకు దగ్గర్లోని పండిట్ శ్రీరామ్ మెట్రో స్టేషన్‌ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మూసేసింది. అయితే, మిగతా ప్రాంతాల్లో మెట్రో రైళ్ల రాకపోకల్లో ఎలాంటి జాప్యం జరగలేదు.