ప్రధానికి నల్ల బెలూన్లతో నిరసన!

ABN , First Publish Date - 2022-07-05T08:01:23+05:30 IST

అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ

ప్రధానికి నల్ల బెలూన్లతో నిరసన!

హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ప్రత్యక్షం


విజయవాడ/మచిలీపట్నం/గన్నవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ తగిలింది. గన్నవరం విమానాశ్రయం నుంచి మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరిన కాసేపటికే నల్లబెలూన్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మోదీ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. 10.29 గంటలకు హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ, సీఎం జగన్‌, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ భీమవరం బయల్దేరారు. హెలికాప్టర్‌ ఎగిరిన కొద్దిసేపటికి ఒక్కసారిగా నల్లబెలూన్లు గాల్లోకి ఎగురుతూ విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చాయి. మోదీ పర్యటన ఖరారైనప్పటి నుంచి కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి.. మోదీ పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతామని ప్రకటించింది. నల్లరిబ్బన్లతో నిరసన ప్రదర్శన గానీ, నల్లబెలూన్లు ఎగురవేయడం గానీ చేస్తామని అన్ని పక్షాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు, బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ.. నల్ల బెలూన్లు గాల్లోకి ఎగిరాయి. దీంతో ప్రధాని పర్యటనలో నిఘా వైఫల్యం స్పష్టమైంది.


విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఉన్న అద్దంపూడి గ్రామంలోని వెంచర్‌లో నిర్మాణంలో ఓ ఇంటిపై నుంచి ఈ బెలూన్లు ఎగరవేసినట్టు తెలిసింది. ముగ్గురు బెలూన్లను కారులో తీసుకొచ్చి వాటిని గాల్లోకి వదిలారు. వారంతా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులని పోలీసులు గుర్తించారు. కాగా.. ప్రధాని మోదీ హెలికాప్టర్‌ గాల్లో ఉండగా నల్లబెలూన్లు రావడాన్ని కేంద్ర నిఘా వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. జిల్లా పోలీసులను ప్రధాని భద్రతా విభాగం సంజాయిషీ అడిగినట్టు తెలిసింది.  నిఘా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు చెబుతున్న సమాధానాలు భిన్నంగా ఉన్నాయి. గాల్లోకి మూడు బెలూన్లను మాత్రమే ఎగురవేశారని గన్నవరం డీఎస్పీ విజయ్‌పాల్‌ చెప్పారు. వాటని గన్నవరంలో ఎగురవేయలేదని విజయవాడలో ఎగురువేశారని అన్నారు. 


విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆందోళన

విశాఖపట్నం, జూలై 4:‘‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు... కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తాం. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భీమవరం వస్తున్న ప్రధాని మోదీ విశాఖ స్టీల్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని ప్రకటించాలి’’ అని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్‌లో పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు నల్ల జెండాలు ధరించి ‘మోదీ హఠావో-దేశ్‌ బచావో’, ‘మోదీ గో బ్యాక్‌’ నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు.

Updated Date - 2022-07-05T08:01:23+05:30 IST