వాగుపై వంతెన నిర్మించాలని నిరసన

ABN , First Publish Date - 2022-08-16T04:58:33+05:30 IST

మండలపరిధిలోని మేడిగడ్డ-శంకర్‌కొండ రోడ్డులో వాగుపై

వాగుపై వంతెన నిర్మించాలని నిరసన
మేడిగడ్డ- శంకర్‌కొండ రోడ్డులో వాగు వద్ద నిరసన తెలుపుతున్న గిరిజనులు

  • మేడిగడ్డ-శంకర్‌కొండ రోడ్డులో వాగుపారి గిరిజనుల అవస్థలు
  • వాగు నీటిలో నిల్చొని వినూత్న నిరసన  
  • వంతెన నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం
  • సమస్యను డీఈ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీపీ అనితావిజయ్‌


ఆమనగల్లు, ఆగస్టు 15: మండలపరిధిలోని మేడిగడ్డ-శంకర్‌కొండ రోడ్డులో వాగుపై వంతెన నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరుతూ సోమవారం వాగు వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శంకర్‌కొండ సర్పంచ్‌ లచ్చి, ఉప సర్పంచ్‌ ప్రశాంత్‌నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తండా గిరిజనులు, యువకులు పాల్గొన్నారు. వాగులో పారుతున్న నీటిలో నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గిరిజనుల ఆందోళనకు వైసీపీ నాయకుడు చీమర్ల అర్జున్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. గతేడాది వంతెన నిర్మాణానికి రూ.3.50 కోట్లు మంజూరై టెండర్‌లు జరిగినా పనులు చేపట్టడం లేదని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని శంకర్‌కొండ తండా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు వాగుసాగి తరచూ రెండు తండాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. నీటి ప్రవాహంతో నేనావత్‌ పాండు, బాలు కుటుంబసభ్యులతో బైక్‌ పై వెళ్తూ ప్రమాదానికి లోనయ్యారని పేర్కొన్నారు. నిరసన విఫయాన్ని తెలుసుకున్న ఎంపీపీ అనితావిజయ్‌ వాగు వద్దకు చేరుకొని పీఆర్‌డీఈ తిరుపతిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వంతెన త్వరగా నిర్మించి సమస్య పరిష్కరించాలని సూచించారు. వాగును పరిశీలించి వంతెన నిర్మాణం త్వరగా జరిగేలా చూస్తానని డీఈ తెలిపినట్లు ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో నాయకులు పత్యా, రవీందర్‌, పాండు, చంద్రు, అంజి, విజయ్‌, లక్ష్మణ్‌, మల్లేష్‌, రమేష్‌, విజయ్‌రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T04:58:33+05:30 IST