ఈఆర్సీ ఎదుట నిరసన గళాలు

ABN , First Publish Date - 2021-01-19T06:27:21+05:30 IST

డిస్కంల పనితీరుపై మాటలు తుటాల్లా పేలాయి. అధికారుల తీరుపై నిరసన గళాలు వినిపించాయి.

ఈఆర్సీ ఎదుట  నిరసన గళాలు
ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న పలు రంగాల ప్రముఖులు

డిస్కంల తీరుపై ఆగ్రహం

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత


విజయవాడ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : డిస్కంల పనితీరుపై మాటలు తుటాల్లా పేలాయి. అధికారుల తీరుపై నిరసన గళాలు వినిపించాయి. అదే సమయంలో సంక్షోభంలో కూరుకుపోతున్న విద్యుత్‌ రంగంపై ఆందోళన వ్యక్తమైంది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల ఆదాయం, అవసరమైన విద్యుత్‌ తదితర అంశాలకు సంబంధించి విజయవాడలోని సీపీడీసీఎల్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ఎదుట వివిధ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీల విషయంలో ఎలాంటి కొత్త ప్రతిపాదనలను కంపెనీలు ప్రతిపాదించలేదు. ప్రస్తుతం ప్రతినెలా విద్యుత్‌ బిల్లులో విధిస్తున్న కనీస చార్జీలను రద్దు చేసి, ఆ స్థానంలో కనెక్టెడ్‌ లోడ్‌ను బట్టి కిలో వాట్‌కు రూ.10 చొప్పున ఫిక్స్‌డ్‌ చార్జీలు విధించాలని కంపెనీలు ప్రతిపాదించాయి. దీన్ని వివిధ సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. అదేవిధంగా సోలార్‌ విద్యుత్‌ కొనుగోళ్లపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సోలార్‌ విద్యుత్‌ ఫ్రీక్వెన్సీ ఒక స్థాయిలో ఉండకపోవడం వల్ల గ్రిడ్‌లు కుప్పకూలిపోతున్నాయని చెప్పారు. 


డిస్కంలు కూలిపోతున్నాయి 

: పున్నయ్య, ఏపీఎస్‌ఈబీ మాజీ ఉద్యోగి

డిస్కంలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కంపెనీలన్నీ పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోకపోతే మున్ముందు చాలా కష్టం. ఇప్పటి వరకు డిస్కంలు రూ.31వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. విద్యుత్‌ శాఖకు ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు మరో రూ.30వేల కోట్ల బకాయిలు చెల్లించాలి. వాటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఊగిసలాడుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనే సౌర విద్యుత్‌ మంచి ఫలితాలను ఇవ్వలేకపోయింది. దీనివల్ల గ్రిడ్‌లు పాడైపోతున్నాయి. జర్మనీలో 27శాతం సౌర విద్యుత్‌ ఉపయోగిస్తున్నా, గ్రిడ్‌లు నాశనమవుతున్నాయని మెకన్సీ సంస్థ నివేదిక ఇచ్చింది. ట్రాన్స్‌కో ఇంజనీర్లు ఇదే విషయమై సీఎండీలకు, ప్రభుత్వానికి లేఖలు రాశారు. సౌర విద్యుత్‌ విషయంలో పునరాలోచన చేయాలి. రాష్ట్రంలో చేపల చెరువుల వద్ద విద్యుత్‌ చౌర్యం ఎక్కువగా జరుగుతోంది. విద్యుత్‌ శాఖలోని విజిలెన్స్‌ అధికారులు ఇక్కడకు వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నారు? లక్షలు చెల్లించాల్సిన చెరువుల యజమానులు వేలల్లో బిల్లులు చెల్లిస్తున్నారు. దీన్ని అరికట్టడానికి విజిలెన్స్‌ విభాగానికి ప్రత్యేకంగా ఒక ఐపీఎస్‌ అధికారిని నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. 


స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలి  : తులసీదాస్‌, సామాజిక విశ్లేషకుడు

 వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కార్పొరేట్‌ కంపెనీలు ఒక రంగంలోకి అడుగు పెడితే మిగిలిన రంగాల్లో అల్లుకుపోతాయి. ముందు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చి, ఆ చార్జీలను రైతుల నుంచి వసూలు చేస్తారు. తర్వాత గృహ వినియోగదారులపై ఆ ప్రయోగం చేస్తారు. ప్రతి ఇంటికి స్మార్ట్‌ మీటర్‌ను బిగించి చార్జీలను వసూలు చేస్తారు. దీనివల్ల సాధారణ వినియోగదారులపై భారం పడుతుంది. దీనిపై కంపెనీలు పునరాలోచన చేయాలి. ఫిక్స్‌డ్‌ చార్జీలతో ప్రజలపై భారం పడుతుంది. 

Updated Date - 2021-01-19T06:27:21+05:30 IST