నిరసన వెల్లువ

ABN , First Publish Date - 2021-07-27T05:20:42+05:30 IST

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. దీంతో కలెక్టరేట్‌ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది.

నిరసన వెల్లువ
కలెక్టరేట్‌ ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల ధర్నా

కలెక్టరేట్‌, జూలై 26:  తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. దీంతో కలెక్టరేట్‌ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. తమకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకులు డిమాండ్‌ చేశారు. అర్హులకు పదోన్నతి కల్పించాలన్నారు. జాబ్‌చార్ట్‌లో లేని పనులు తమకు అప్పగించడం సరికాదని ఆందోళన  వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని వీఎంఆర్‌డీఏ పరిధిలో నుంచి మిహాయించాలని  కొండకరకాం గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వీఆర్‌ఎండీఏ పరిధిలోకి తమ గ్రామం వెళ్తే  పంట భూములు కోల్పోయే పరిస్థితి ఉందన్నారు.  చాలామంది చిన్న,సన్న కారు రైతులు రోడ్డున పడతారని చెప్పారు.  దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని నినాదాలు చేశారు. గత ఖరీఫ్‌కు సంబంధించి రైతులకు  ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని జనసేన నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గత జనవరిలో చెల్లించాల్సిన డబ్బులు ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు.  దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారన్నారు. పెట్టుబడులు లేక ఈ ఖరీఫ్‌లో సాగు ఎలా చేపట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. మరోవైపు అధ్వానంగా మారిన జిల్లాలోని రహదారులపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటం చేస్తామన్నారు.   జనసేన నాయకులు ఆదాడ మోహనరావు, బాలు తదితరులు ఉన్నారు. 

వసతి గృహాలను వెంటనే తెరవాలి

పార్వతీపురం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ కళాశాల వసతి గృహాలను వెంటనే తెరవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు వసతి గృహాల విద్యా ర్థులు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఖాళీ కంచాలతో నిరసన కార్యక్రమం  చేపట్టారు.  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజ శేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ డిగ్రీ పరీక్షలను ఆగస్టులో నిర్వహిం చేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, ఈ నేపథ్యంలో వసతి గృహాలు తెరుచు కోకపోవడంతో విద్యార్థులు ఇళ్ల బాటపడుతున్నారన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌కు వినతి పత్రం అందించారు. వసతిగృహ విద్యార్థులు బిస్వంత్‌, పి.బాలకృష్ణ, పి.నరేష్‌, బి.సందీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టాలు మంజూరు చేయండి

 సాగు చేస్తున్న అటవీ భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా చేశారు. సాలూరు మండలం నార్లవలస పంచాయతీ జిల్లేడివలసకి చెందిన గిరిజనులు ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందించారు. వీఆర్‌వో కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ  సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ను పీవో ఆదేశించారు.  ఈ ధర్నాలో గిరిజన సంఘం నాయకులు వి.సుందరరావు, గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు.


  

Updated Date - 2021-07-27T05:20:42+05:30 IST