ఆర్టీవో తీరుపై వాహనదారులు, ఏజెంట్ల నిరసన

ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST

ఆర్టీవో తీరుపై వాహనదారులు, ఏజెంట్ల నిరసన

ఆర్టీవో తీరుపై వాహనదారులు, ఏజెంట్ల నిరసన
ఆర్టీవో తీరుపట్ల నిరసన వ్యక్తం చేస్తున్న వాహనదారులు, బాధితుడు తౌఫిక్‌

  • అన్నీ ఉన్నా.. ఏదో కారణంతో ఫైన్‌ 
  • బ్రోకర్‌ లేకుంటే కదలని ఫైలు
  • దుర్బాషలాడారంటూ ఆర్టీవో కార్యాలయం ఎదుట బాధితుడి నిరసన

వికారాబాద్‌, జూలై 2 : వికారాబాద్‌ ఆర్టీవో భద్రునాయక్‌ తీరుపై పలువురు వాహనదారులు, ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆర్టీవో కార్యాలయం ఎదుట శనివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీవో భద్రునాయక్‌ ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని, వాహనాలకు సంబంధించి అన్ని కాగితాలు(సర్టిఫికెట్లు) ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు కిందిస్థాయి వ్యక్తులతో లంచం అడిగిస్తున్నారని, ఒకవేళ లంచం ఇవ్వని పక్షంలో రూ.50వేల నుంచి రూ.80 వేల వరకు ఫైౖన్లు వేసి సామాన్యుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం రూ.500 సంపాదిద్దామని రోడ్డు మీదకు వచ్చిన ఆటో డ్రైవర్‌.. ఆర్టీవోకు దొరికితే రూ.5వేల నుంచి రూ.10వేల లంచం ఇవ్వాల్సి వస్తుందని, లేకపోతే వేలల్లో ఫైౖన్‌ వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. శనివారం పరిగికి చెందిన తౌఫిక్‌  అనే వ్యక్తి టాటా ఏస్‌ వాహనంలో పశువులను తీసుకొని వికారాబాద్‌ వెళుతుండగా.. మన్నెగూడ వద్ద ఆర్టీవో అధికారులు వాహనాన్ని ఆపారు. దీంతో అతడు పర్మిషన్లు, వాహనం పత్రాలు అన్నీ చూపించినప్పటికీ.. ఆర్టీవో అతడిని బూతులు తిడుతూ, సెల్‌ఫోన్‌ లాక్కొని బలవంతంగా వాహనాన్ని సీజ్‌ చేసినట్లు బాధితుడు తౌఫిక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతడితో పాటు అనేక మంది వాహనదారులు, ఏజెంట్లు సైతం ఆర్టీవో భద్రునాయక్‌ బలవంతంగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, అక్కడ బ్రోకర్‌ లేనిదే ఏ పనీ కాదని, ఆర్టీవో కార్యాలయంలో ఏదైనా పని అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST