నిరసన సెగలు

ABN , First Publish Date - 2022-01-20T06:55:40+05:30 IST

నిరసన సెగలు

నిరసన సెగలు

రెండో రోజూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఉద్యోగుల ఆందోళన

వివిధ రూపాల్లో ప్రభుత్వంపై నిరసన తెలిపిన వేతన జీవులు

జిల్లాల్లో పీఆర్సీ ప్రతుల దహనం


(ఆంధ్రజ్యోతి-న్యూస్‌ నెట్‌వర్క్‌): ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ.. వరుసగా రెండో రోజు బుధవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నిరసనలు కొనసాగాయి. పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. చీకటి జీవోలను రద్దు చేయాలని, అధికారుల కమిటీ నివేదిక ప్రకారం ఇచ్చిన పీఆర్సీని ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 62 ఏళ్లు ఉద్యోగ విరమణ వయసు పెంపు సరైన విధానం కాదని, ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు, పాలకోడేరు, ఆకివీడు, ఉండి, చింతలపూడి, కామవరపుకోట తదితర మండలాల్లో ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. దేవరపల్లిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ఆధ్వర్యంలో పీఆర్సీ జీవో కాపీలను దహనం చేశారు. అనంతపురం జిల్లాలో నల్లబ్యాడ్జీలు ధరించి, ఖాళీ ప్లేట్లు పట్టుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన తెలిపారు. కడప జిల్లా బద్వేలులో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు గోడకుర్చీ వేసి, వైసీపీకి అధికారం ఇచ్చి తప్పు చేశామంటూ లెంపలు వేసుకుని నిరసన తెలిపారు.గురువారం జరగనున్న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-01-20T06:55:40+05:30 IST