క్యాన్బెర్రా: టీకా తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆందోళనకారులు, పోలీసులకు మద్య తీవ్ర వాతావరణం చోటు చేసుకుంది. మెల్బోర్న్లో కొనసాగుతున్న ఆందోళనపై పోలీసులు భాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లో కొవిడ్-19 పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులు కనీసం ఒక్క డోస్ టీకా అయినా తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. మెల్బోర్న్లో ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతోంది. తప్పనిసరి వ్యాక్సినేషన్, లాక్డౌన్లను వ్యతిరేకిస్తూ వందలాది మంది మెల్బోర్న్ నగర రోడ్లపై ర్యాలీ చేపట్టారు. సోమవారం నుంచి కొనసాగుతున్న ఈ ఆందోళన మంగళవారం నాటికి తీవ్ర రూపం దాల్చింది.
ఆందోళన తీవ్ర తరం కావడంతో మెల్బోర్న్లో నేటి నుంచి రెండు వారాల పాటు నిర్మాణరంగ సైట్లను అధికారులు మూసేశారు. కార్మికుల నిరంతర కదలికలతో కొవిడ్-19 వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని అధికారులు వివరణ ఇచ్చారు. మరోపక్క రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు అదుపు చేయడం సవాల్‌గా మారిందని స్థానిక పోలీసులు వాపోతున్నారు. ఆందోళనకారులు వీధుల్లో ర్యాలీలు చేపట్టడం, పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడటం వంటి దృశ్యాలు సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలైన సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 70 శాతానికి చేరుకున్న వ్యాక్సినేషన్, మరో 10 శాతం పెరిగితే ప్రస్తుతం ఉన్న ఆంక్షల నుంచి సడలింపులు ఉంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.