ప్రధాని మోదీకి నల్ల జెండాలతో నిరసన

ABN , First Publish Date - 2022-07-03T05:30:00+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీకి నల్ల జెండాలతో నిరసన
కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించాలి

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ 

కూర్మన్నపాలెం, జూలై 3: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. కూర్మన్నపాలెంలోని రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 507వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేం దుకు సోమవారం భీమవరం వస్తున్న పీఎం మోదీకి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రజలంతా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని కోరారు. విశాఖ ‘ఉక్కు’ను ప్రభుత్వ రంగంలోనే వుంచుతామని ప్రకటించాకే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయాలన్నారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద ఉద్యోగులంతా నల్ల జెండాలతో నిరసన తెలపాలని, ప్రతీ ఉద్యోగి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. నాయకుడు జె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో విభజన హామీలు, రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టు, స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగింపు, తదితర సమస్యలను బీజేపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు మోదీ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నాయకులు గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాలు దేశానికి సైనికుల్లాంటివని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు వైటీ దాస్‌, జి.ఆనంద్‌, బోసుబాబు, గంగవరం గోపి, రామ్మోహన్‌ కుమార్‌, సత్యారావు, మహాలక్ష్మి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T05:30:00+05:30 IST