రద్దుచేసే వరకూ ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2021-07-31T06:08:03+05:30 IST

జీవో 198ని రద్దు చేసే వరకు రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉద్యమిస్తామని పలువురు విపక్ష నేతలు ప్రకటించారు.

రద్దుచేసే వరకూ ఉద్యమిస్తాం
నిరసన దీక్షల్లో పాల్గొన్న టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు నెట్టెం రఘురామ్‌, దోనేపూడి శంకర్‌, సీహెచ్‌ బాబూరావు తదితరులు

జీవో 198పై నిరసన దీక్షల్లో విపక్ష నేతల ఆగ్రహం

విజయవాడ సిటీ, జూలై 30 : జీవో 198ని రద్దు చేసే వరకు రాజకీయాలకతీతంగా ఐక్యంగా ఉద్యమిస్తామని పలువురు విపక్ష నేతలు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో కష్టాల్లో ఉన్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాలు మోపడాన్ని నిరసిస్తూ ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో విపక్ష కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పౌరసంక్షేమ, ప్రజా సంఘాల నాయకులు విజయవాడ ధర్నాచౌక్‌లో శుక్రవారం దీక్ష  చేపట్టారు. ఆ సందర్భంగా విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా దెబ్బతీసే అత్యంత దుర్మార్గమైన జీవో 198ని రద్దు చేయాలన్నారు. అవినీతి, దోపిడి విధానంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్న  వైసీపీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయడమంటే ఇళ్లున్న వారిని శిక్షించడమేనన్నారు. కౌన్సిల్లో చర్చ, ఓటింగ్‌ లేకుండా జీవో 198ని ఏకపక్షంగా  ఆమోదించారని మండిపడ్డారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రశ్నిస్తే నిర్బంధిస్తున్నారన్నారు. సీపీఐ నేత దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో ఎన్నికైన మేయర్‌ వారిపై కోట్లాది రూపాయల భారాలు మోపడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో బార్‌కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌,  టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ నేత ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, కౌన్సిల్లో టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి,కేశినేని శ్వేత, బోయి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:08:03+05:30 IST