మామిడి పండులో లభించే పోషక విలువలేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-13T21:21:50+05:30 IST

వేసవి వస్తోందంటే ఆహ్లాదకరమైన రంగు, రుచితో పాటు, ఎన్నో పోషకవిలువలతో అలరించే మామిడిపండు కోసం ఎదురుచూడని వారు ఉండరు. రోగనిరోధక వ్యవస్థను

మామిడి పండులో లభించే పోషక విలువలేంటో తెలుసా?

ఆంధ్రజ్యోతి(13-05-2022)

ప్రశ్న: పళ్లలో రారాజు మామిడి. ఈ వేసవి పండులో ఉండే పోషకవిలువలు తెలియజేయండి. 


- సరోజ, అనంతపురం


డాక్టర్ సమాధానం: వేసవి వస్తోందంటే ఆహ్లాదకరమైన రంగు, రుచితో పాటు, ఎన్నో పోషకవిలువలతో అలరించే మామిడిపండు కోసం ఎదురుచూడని వారు ఉండరు. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చెయ్యడానికి, ఆహారంలోని ఇనుమును మన శరీరం శోషించుకోవడానికి, నోటిలోని దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం సంరక్షించడానికి, కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహకరించి చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసేందుకు అవసరమైన విటమిన్‌- సి మామిడి పండులో అధికం. ఎముకల పటుత్వం, కంటి చూపు కాపాడడం, రోగాలనెదుర్కొనే శక్తినివ్వడం లాంటి ముఖ్యమైన పనులను చేసే విటమిన్‌- ఎ, ఫోలేట్‌, విటమిన్‌ బి - 6 కూడా మామిడిపండులో పుష్కలంగా ఉంటాయి. మామిడిపండులో ఫైబర్‌ మన జీర్ణవ్యవస్థను కాపాడడమే కాక, బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలున్న మామిడిపండును, తాజాగా లభించే వేసవికాలంలో తీసుకోవడమే ఉత్తమం. పంచదార వేసి జామ్‌, జ్యూస్‌గా తీసుకున్నట్లయితే పోషకాలు తక్కువగా, క్యాలోరీలు ఎక్కువగా చేరి బరువు పెరిగే ప్రమాదం ఉంది. అన్ని వయసుల ఆరోగ్యవంతులు మామిడి పండును నిస్సంకోచంగా తినవచ్చు. మధుమేహం ఉన్న వారు మాత్రం రోజుకు ఓ పండును, అది కూడా భోజనం వెంటనే కాక చిన్న స్నాక్‌లాగా తీసుకుంటే మంచిది. బరువు పెరగకుండా ఉండాలంటే ఏ పరిమాణంలో మామిడి పండు తీసుకుంటారో దానికి తగినట్లుగా భోజనంలో అన్నం, రొట్టెలు తగ్గించుకుంటే చాలు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Read more