కరోనా వైరస్‌ నుంచి రక్షణ రేఖ!

ABN , First Publish Date - 2021-05-15T08:07:27+05:30 IST

పట్టుదల, దీక్ష అంటే ఆ గ్రామాల ప్రజలదేనేమో! ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా కరోనా విలయతాండం చేస్తున్న పరిస్థితులో ఆ ఊర్లలో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసూ వెలుగుచూడలేదు.

కరోనా వైరస్‌ నుంచి రక్షణ రేఖ!

  • వైరస్‌ను దరిచేరనీయని గ్రామాలు.. 
  • ఉమ్మడి పాలమూరు జిల్లా పుర్సంపల్లి, కిష్టాపూర్‌.. 
  • వికారాబాద్‌లో 5 గ్రామాలు, మెదక్‌లో రెండు ఊర్లు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): పట్టుదల, దీక్ష అంటే ఆ గ్రామాల ప్రజలదేనేమో! ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా కరోనా విలయతాండం చేస్తున్న పరిస్థితులో ఆ ఊర్లలో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసూ వెలుగుచూడలేదు. వైరస్‌ రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ తమకు తామే కరోనా నుంచి రక్షణ రేఖ గీసుకున్నారు. ఏ ఒక్కరికీ అనారోగ్యమన్నదే లేకుండా అందరూ సాధారణ రోజుల్లో మాదిరిగానే చక్కగా జీవనం సాగిస్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా జాగ్రత్తలపై పంచాయతీ సిబ్బంది తగు సూచనలు చేయడం.. వాటిని ఎక్కడా రాజీ పడకుండా ప్రజలు పాటిస్తుండటంతోనే ఇది సాద్యమైందని అంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పుర్సంపల్లి, కిష్టాపూర్‌.. వికారాబాద్‌ జిల్లాలోని ఐదు గ్రామాలు.. మెదక్‌ జిల్లాలోని చెరువు ముందర తండా వాసులదీ ఆదర్శం. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం పుర్సంపల్లిలో 230 ఇళ్లు ఉన్నాయి. 800 జనాభా ఉంది. గ్రామంలో అంతా చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలే. 


కరోనా మొదటి వేవ్‌ మొదలైనప్పటి నుంచి గ్రామంలో కరోనా సోకకుండా అన్ని కుటుంబాల వారు ఎవరికివారు స్వీయనియంత్రణ, జాగ్రత్తలు పాటిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, ఒకచోట ఇద్దరు వ్యక్తులే ఉన్నా కనీసం ఆరడుగుల దూరం పాటించడం, బయటకు వెళ్లి వస్తే వెంటనే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను విధిగా పాటిస్తున్నారు. గ్రామంలోకి బయటి నుంచి ఎవరొచ్చినా మొహమాటం లేకుండా గేట్లవద్దే ఆపుతున్నామని, తప్పనిసరి అయితే వారితో భౌతికదూరం పాటిస్తూ వ్యవహరిస్తున్నామని తెలిపారు. మొదటి లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ నుంచి తిరిగొచ్చిన వారిని నిబంధనల ప్రకారం 15 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచామని, ఆ తర్వాత వారంతా గ్రామస్థులతో కలిసి మెలిసి పనిచేసుకుంటూ హాయిగా ఉంటున్నారని అక్కడి ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇక వనపర్తి జిల్లా పానగల్‌ మండలం కిష్టాపూర్‌ సహా గన్యానాయక్‌ తండా, మల్లాయిపల్లి తండా, దొండాయిపల్లి తండా, లక్ష్మీనాయక్‌ తండా, గురిగింజమిట్ట తండాల్లో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో వలస వెల్లిన గిరిజనులు.. 


తొలివిడత లాక్‌డౌన్‌ సమయంలోనే తిరిగొచ్చారు. రెండో వేవ్‌ ప్రభావం మొదలైనప్పటి నుంచి తండాల నుంచి ఎవరు కూడా వలసవెళ్లకుండా అవగాహన కల్పించారు. బయటి వ్యక్తులను తండాల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో గుర్రంగట్టు తండా, నర్సాపూర్‌ చిన్న తండా, రాంపూర్‌, అల్లాపూర్‌, కొడంగల్‌ మండలం గోప్యానాయక్‌ తండా, ఆశమ్మకుంట తండాలో ఇంత వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. జీవనాధారమైన వ్యవసాయ పనులు చేసుకుంటేనే, ఇతర ఉపాధి పనులకు హాజరవుతున్నారు. విందులు, వినోదాలకు దూరంగా ఉంటున్నారు.  మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం చెరువు ముందర తండా, రామాయంపేట మండలంలోని గంగ్యానాయక్‌ తండాలోనూ ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసూ నమోదవ్వలేదు. ’’


భౌతికదూరం పాటిస్తున్నాం

కరోనా బారిన పడకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తున్నాం. ఇంట్లో నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు పెట్టుకునేలా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాం. అందరూ ఒకేచోట గుమిగూడకుండా ఒకరికొకరు దూరంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాం. గ్రామంలో పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేపడుతున్నాం.  

సోనీబాయి, సర్పంచ్‌, గుర్రంగట్టు తండా, వికారాబాద్‌

 

ప్రయాణాలు మానుకున్నాం 

పట్నం నుంచి గ్రామానికి వచ్చిన వారు కూడా క్వారంటైన్‌ అయ్యాకే జనంలో కలుస్తున్నారు. ప్రయాణాలను సాధ్యమైనంతవరకు ఆపేసుకున్నాం. స్వచ్ఛందంగా అందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాం. దీంతో ఊర్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు. 

రాయికంటి వెంకటయ్య, సర్పంచ్‌ పుర్సంపల్లి 


వలస కార్మికులు రాకుండా చర్యలు

కదిరెపాడు పంచాయతీకి అనుబంధంగా గన్యానాయక్‌ తండా, లక్ష్మీనాయక్‌ తండా, గురిగింజమిట్ట తండాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వలస వెళ్లే వారు చాలా ఎక్కువ. అయితే కరోనా మొదటి వేవ్‌ తర్వాత తండాలకు వచ్చినవారిని మళ్లీ వలస వెళ్లకుండా అవగాహన కల్పించాం. అలాగే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని తండాలకు రాకుండా వారి సహకారం కోరాం. ఇతర జాగ్రత్తల పరంగా తండావాసులు స్వచ్ఛందంగా సహకరిస్తుండటంతో కరోనా దరిచేరడం లేదు. 

  విబూది లక్ష్మయ్య సర్పంచ్‌, కదిరెపాడు, వనపర్తి

Updated Date - 2021-05-15T08:07:27+05:30 IST