తుఫాన్ల సమయంలో విద్యుత్‌ వ్యవస్థలకు రక్షణ

ABN , First Publish Date - 2022-05-16T08:55:36+05:30 IST

తుఫాన్ల సమయంలో తీరప్రాంతాల్లోని విద్యుత్‌ సరఫరా వ్యవస్థలకు జరిగే నష్టాన్ని తగ్గించేందుకు గాను గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు.

తుఫాన్ల సమయంలో విద్యుత్‌ వ్యవస్థలకు రక్షణ

గాంధీనగర్‌ ఐఐటీ పరిశోధకుల అభివృద్ధి

న్యూఢిల్లీ, మే 15: తుఫాన్ల సమయంలో తీరప్రాంతాల్లోని విద్యుత్‌ సరఫరా వ్యవస్థలకు జరిగే నష్టాన్ని తగ్గించేందుకు గాను గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. గతంలో ఒడిశాపై విరుచుకుపడిన ఫని తుఫానును నమూనాగా తీసుకుని, గాలి తీవ్రత అత్యంత అధికంగా ఉండే చోట్లలోని కొన్ని విద్యుత్‌ టవర్లను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. ఆయా టవర్ల పరిధిలో అత్యధిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తీరానికి సమీపంలో ఉన్న ఆ టవర్లను మరింతగా బలోపేతం చేయడం ద్వారా ఫలితం కనబడినట్లు వారు పేర్కొన్నారు. ఇటువంటి అధ్యయనం ఇదే తొలిసారని, తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాన్ని సాధించవచ్చని వివరించారు.


ఇతర తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్రలకు కూడా ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని వెల్లడించారు. ‘‘కంప్యూటర్‌లో సిములేషన్‌ ద్వారా సృష్టించిన తుఫానును పరిశీలిస్తే.. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టవర్లను కూడా తుఫాను ఒకేసారి నాశనం చేయగలదని గుర్తించాం. అందువలన చాలా భారీ స్థాయిలో సమగ్రంగా మా పరిశోధనను నిర్వహించాం. ఏ టవర్లను బలోపేతానికి ఎంచుకోవాలనే విషయాన్ని కూడా మేం రూపొందించిన వ్యవస్థ సూచిస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో పాలన యంత్రాంగానికి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వారి శ్రమను ఏయే వ్యవస్థలపై వెచ్చించాలన్న విషయంలో వారికి సహకారం అవసరం. తద్వారా విపత్తుల అనంతర వినాశనాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది’’ అని పరిశోధకులు వివరించారు. 

Updated Date - 2022-05-16T08:55:36+05:30 IST