Abn logo
Oct 30 2020 @ 00:45AM

సర్వకాలాలకూ ఆదర్శప్రాయుడు


  •  నేడు మిలాద్‌- ఉన్‌- నబీ


అత్యుత్తమ నైతిక విలువలను ప్రవచించడమే కాకుండా వాటిని ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు దైవ ప్రవక్త మహమ్మద్‌. సర్వోత్తమ వ్యవస్థను స్థాపించి, దాన్ని పరిరక్షించి, భావి మానవాళికి మార్గనిర్దేశనం చేసిన ఆయన జన్మదినాన్ని ముస్లింలు ‘మిలాద్‌-ఉన్‌- నబీ’గా పాటిస్తారు. 


దైవ ప్రవక్త మహ్మద్‌ ప్రసిద్ధమైన ఖురైష్‌ వంశంలో జన్మించారు. పవిత్రమైన కాబా గృహం అర్చకులు ఆయన వంశం వారే. ఆయన క్రీస్తు శకం 571 ఏప్రిల్‌ 22న మక్కా నగరంలో జన్మించారు. ఆయన తండ్రి అబ్దుల్లా. తాత ముత్తలిబ్‌. ఆరేళ్ళ వయసులో మహమ్మద్‌ తల్లి బీబీ అమీన్‌ పరమపదించారు. వ్యాపారస్థుడైన బాబాయితో బాల్యంలోనే ఆయన సిరియాకు వెళ్ళారు. పాతికేళ్ళ వయసులోనే.... తనకన్నా పదిహేనేళ్ళు పెద్దైన హజ్రత్‌ ఖదీజాను వివాహం చేసుకొని, స్త్రీజనోద్ధరణకు శ్రీకారం చుట్టారు. 


ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, అపరిమితమైన సహనం మహమ్మద్‌ జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ కనిపిస్తుంది. ఆయన ఒకప్పుడు ఒక యూదు పండితుని దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. ఆ అప్పును అర్థంతరంగా తీర్చాలని ఆ వ్యక్తి గట్టిగా నిలదీశాడు. ‘ఇప్పుడే చెల్లించమంటే నా దగ్గర ఏమీ లేద’ని మహమ్మద్‌ బదులిచ్చారు. ‘నా బాకీ తీర్చేవరకూ నిన్ను కదలనిచ్చేది లేద’ని ఆ పండితుడు తీవ్రంగా హెచ్చరించాడు. ‘‘సరే! ఇక్కడే కూర్చుండిపోతాను’’ అన్నారు మహమ్మద్‌. ఆ రోజూ, మర్నాడూ నమాజ్‌లు అక్కడే చేసుకున్నారు. మదీనాలో ఇస్లామీయ ప్రభుత్వం నెలకొన్న రోజులవి. దైవ ప్రవక్త తలచుకుంటే ఆ వ్యక్తిమీద చర్య తీసుకోగలరు. కానీ అలాంటి ఆలోచన ఆయన చెయ్యలేదు. పొద్దెక్కే సమయం వరకూ ఇదంతా చూస్తున్న ఆ పండితుడు చలించిపోయాడు. అందరూ చెబుతున్నట్టు మహమ్మద్‌ దైవ ప్రవక్తేనని విశ్వసించాడు. ‘‘ప్రవక్తకు ఉండాల్సిన గుణాలు ‘తౌరాతు గ్రంథం’లో ప్రస్తావితమై ఉన్నాయి. అవి మీలో ఉన్నాయో లేవో చూసేందుకే నేను అలా ప్రవర్తించాను. ఇప్పుడు నేను సాక్ష్యం ఇస్తున్నాను... అల్లాహ్‌ తప్ప నిజమైన మరో ఆరాధ్య దైవం లేడు. మీరు అల్లాహ్‌ నియమించిన ప్రవక్త అని అంగీకరిస్తున్నాను. ఇదిగో నా దగ్గరున్న సొమ్ము. దీన్ని మీరు నచ్చిన విధంగా ఖర్చు చేసుకోవచ్చు’’ అంటూ నమస్కరించాడు.


సత్వసంధతకు మారుపేరు

దైవ ప్రవక్త మహమ్మద్‌ తన జీవితంలో ఆయన ఎన్నడూ అసత్యం చెప్పలేదు. దైవ ప్రవక్తగా ఆయనను అల్లాహ్‌ ఆశీర్వదించడానికి ముందే ప్రజలు ‘సాధిఖ్‌ అమీన్‌’ అనే బిరుదుతో సత్కరించారు. తాను దైవం నియమించిన ప్రవక్తనని మహమ్మద్‌ ప్రకటించుకున్నప్పుడు ‘ఆయన అసత్యవాది’  అనే మాట అనగలిగే ధైర్యాన్ని ఆయన బద్ధశత్రువులు కూడా చెయ్యలేకపోయారు. మహమ్మద్‌తో శత్రుత్వం వహించిన అబూజహల్‌ సైతం ‘‘ఓ మహమ్మద్‌! మేము మిమ్మల్ని సత్యవాది అనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పాడు. దైవప్రవక్త అత్యంత స్నేహశీలి. తన సహచరులనూ, మిత్రులనూ చాలా ప్రేమగా చూసుకొనేవారు. వారి యోగక్షేమాలను ఎల్లప్పుడూ తెలుసుకొనేవారు. మృదుస్వభావిగా, విశాల దృక్పథం, దయ కలిగిన వ్యక్తిగా మహమ్మద్‌ ఖ్యాతి పొందారు. అందుకే ‘‘ఓ ప్రవక్తా! అల్లాహ్‌ అనంత కరుణ వల్లనే నీవు వారి (ప్రజల) పట్ల మృదుస్వభావివి అయ్యావు. నీవే కనుక కర్కశుడివీ, కఠిన హృదయుడివీ అయితే వారందరూ నీ చుట్టుపక్కల నుంచి దూరంగా పారిపోయేవారు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ పేర్కొన్నారు. 

దైవప్రవక్తగా అల్లాహ్‌ ఎంపిక చేయడానికి ముందు మహమ్మద్‌ అంతర్జాతీయ వాణిజ్యం చేసేవారు. ఆయన భార్య కూడా వ్యాపారాలు నిర్వహించే సంపన్నురాలు. ఆ తరువాత తన సంపాదనంతటినీ ఇస్లాం ప్రచారం కోసం ఆమె ఖర్చుచేశారు. విరకకు తాయెఫ్‌ నగరానికి వెళ్ళే వాహనం లేక కాలినడకతోనే దైవ ప్రవక్త అక్కడికి చేరుకున్నారు. మదీనాకు వలస వెళ్ళే సమయంలో కూడా దారిఖర్చులను హజ్రత్‌ అబూ బక్ర్‌ అనే సన్నిహితుడు భరించారు. తనకు ఏ రూపంలోనైనా ధనం వస్తే, వచ్చినా, తన ఖర్చుల వరకూ తీసుకొని మిగిలినది దానం చేసేవారు. 


మహోన్నత సంస్కరణవాది

మహమ్మద్‌ చిన్నతనం నుంచీ దైవచింతన పరులు. ఆయన ఆ చింతనలోనే హిరా గృహంలో రేయింబవళ్ళు గడిపేవారు. నిరంతరం అల్లాహ్‌ స్మరణ చేస్తూ ఉండేవారు. దైవ ప్రన్నత కోసం అదనపు నమాజ్‌లు కూడా చేసేవారు. రాత్రిలో చాలా కాలం తహజ్జుద్‌ నమాజ్‌తోనూ, దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణతోనూ గడిపేవారు. ఆయన అతి నిరాడంబరుడు. పరిశుభ్రంగా ఉండేవారు. అలా ఉండాలని బోధించేవారు. దేనిలోనూ ఎన్నడూ లోపాలు వెతికేవారు కాదు. ధర్మసమ్మతమైన ఆహారమే తినేవారు. ఇతరులతో శాంతంగా, చిరునవ్వుతో ఆయన వ్యవహరించేవారు. ఎవరినీ నొప్పించకుండానే ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేవారు. ప్రగల్భాలు పలకడం, గొప్పలు చెప్పుకోవడం, తనను గౌరవించడంలో ప్రజలు అతిగా వ్యవహరించడం, బిరుదులతో పిలవడం దైవ ప్రవక్తకు ఇష్టం ఉండేది కాదు. 

‘సంతానాన్ని ప్రేమించడం, వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించడం, సజ్జనులుగా తీర్చిదిద్దడం తల్లితండ్రుల బాధ్యత’ అని దైవప్రవక్త బోధించేవారు. మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు ఉండాలని గట్టిగా చెప్పేవారు. తన కుమార్తె హజ్రత్‌ ఫాతిమాకు ఉన్నత విద్య అందించి, తన బాధ్యతలను నిర్వర్తించారు.

అతిథి సత్కారం, అనాథల హక్కులు, పొరుగువారి హక్కుల గురించి దైవప్రవక్త మహమ్మద్‌ ఇచ్చిన సందేశాలు సర్వకాలాలకూ మార్గదర్శకాలే! ఒక పాలకుడిగా కూడా ప్రజలందరి కనీస అవసరాలూ తీరడానికి చర్యలు తీసుకున్నారు. పౌర హక్కుల విషయంలో ముస్లిం అయినా, ముస్లిమేతరుడైనా, మహిళ అయినా, పురుషుడైనా... అందరూ సమానులేనని ప్రటించారు. వారి హక్కులు కాపాడడానికి అవిశ్రాంతం శ్రమించారు. జూదం, మద్యపానం, వ్యభిచారం లేని సమాజ నిర్మాణానికి ఆయన పాటుపడ్డారు. బావులు, రహదారులు, వైద్య శాలలు, పాఠశాలలు నిర్మించారు. జకాత్‌, ఫిత్రా, సదఖా లాంటి సంస్కరణల ద్వారా పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకున్నారు. 

ఆయన కిరీటం లేని చక్రవర్తిగా, సంపదలేని మహారాజుగా, రాజమహల్‌ ఎరుగని పాలకునిగా జీవితం గడిపారు. దైవప్రవక్త మరణించిన రోజున ఆయన ఇంట్లోని దీపంలో కనీసం నూనె కూడా లేదు. అందుకే గొప్ప వ్యక్తిత్వం కలిగిన, స్వార్థరహితుడైన సంక్షేమ రాజ్య స్థాపకుడిగా ఆయన నిలిచిపోయారు.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌
Advertisement
Advertisement
Advertisement