ఆస్తుల బదలాయింపుపై సమాచారమేది?

ABN , First Publish Date - 2022-06-28T06:41:27+05:30 IST

మున్సిపల్‌ ఆస్తులు ఇతర శాఖలకు బదలాయించే విషయంలో ఏం జరుగుతుందో కౌన్సిలర్‌ సభ్యులకు తెలియడం లేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆస్తుల బదలాయింపుపై సమాచారమేది?
సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు

  • వీధి దీపాలు, డ్రైనేజీ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం
  • కొవ్వూరు కౌన్సిల్‌ సమావేశంలో కౌన్సిలర్ల ఆగ్రహం

కొవ్వూరు, జూన్‌ 27: మున్సిపల్‌ ఆస్తులు ఇతర శాఖలకు బదలాయించే విషయంలో ఏం జరుగుతుందో కౌన్సిలర్‌ సభ్యులకు తెలియడం లేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం కొవ్వూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ జూలై 15 నాటికి మున్సిపాల్టీలో మరమ్మతులకు గురైన రహదారుల్లో ఒక్కగుంత ఉండకూడని సీఎం అన్నారని, పట్టణంలో అన్ని రహదారులు మరమ్మతులకు గురయ్యాయని, అయినా ఒక్క ప్రతిపాదన ఎజెండాలోకి తీసుకురాకపోవడం ఏంటని ప్రశ్నించారు. అవుట్‌ఫాల్‌ డ్రైను పూడికతీత పనులు ఏప్రిల్‌, మే నెలల్లో చేపట్టాలని, సమ్మర్‌ యాక్షన్‌ పనులు వర్షాకాలంలో ఏవిధంగా చేస్తారని నిలదీశారు. కండెల్లి రామారావు మాట్లాడుతూ ఔరంగాబాద్‌లో తాగునీరు, డ్రైనేజి, వీధి దీపాల సమస్యలపై పలుమార్లు ఫిర్యాదుచేసినా మున్సిపల్‌ సిబ్బంది స్పందించడం లేదన్నారు. పతివాడ నాగమణి మాట్లాడుతూ వార్డులో తరచు త్రాగునీటి సమస్య తలెత్తుందన్నారు. ఏఈలు మాట్లాడుతూ బిల్లులు అందక పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. బొండాడ సత్యనారాయణ మాట్లాడుతూ 1వ వార్డులో మున్సిపల్‌ రోడ్డును త్రవ్వేస్తున్నారని సచివాలయ ఎమినిటి సెక్రటరీకి ఫిర్యాదుచేయగా, చర్యలు తీసుకోకపోగా కౌన్సిలర్‌ ఫిర్యాదుచేస్తున్నారని అవతలి వ్యక్తికి సమాచారం అందించారు. సెక్రటరీపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. చైర్‌పర్సన్‌ రత్నకుమారి మాట్లాడుతూ కౌన్సిలర్లకు మున్సిపల్‌ చట్టం, నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కోసం రెండురోజుల ట్రైనింగ్‌ అందించేందుకు ఏర్పాట్లుచేయాలన్నారు. 

డంపింగ్‌ యార్డు ఎక్కడా?.. పట్టణంలోని 23 వార్డుల్లో సేకరించిన చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డు ఎక్కడా అని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. సూరపనేని చిన్ని మాట్లాడుతూ తాత్కాలిక డంపింగ్‌ యార్డు స్థలాన్ని పట్టణ పోలీసుస్టేషన్‌, సబ్‌జైలు నిర్మాణానికి బదలాయించారన్నారని, రేపటి నుంచి ఇంటింటా సేకరించిన చెత్త ఎక్కడ వేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మున్సిపల్‌ వాటర్‌వర్క్స్‌ రిజర్వు స్థలాన్ని కేటాయించారని, కళాశాల పరిస్థితి ఏంటని మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ అన్నారు. డంపింగ్‌ యార్డు సమస్యపై కౌన్సిల్‌ సభ్యులంతా నిర్ణయాన్ని తెలపాలన్నారు. దీనిపై కౌన్సిల్‌ సభ్యులంతా ఆర్డీవోను కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుందామని చైర్‌పర్సన్‌ అన్నారు.

Updated Date - 2022-06-28T06:41:27+05:30 IST