ఆస్తి పన్ను పెంచేశారు

ABN , First Publish Date - 2022-01-21T05:58:56+05:30 IST

‘‘పెరిగిన ఆస్తి పన్నును మార్చి 31లోగా జీవీఎంసీకి చెల్లించండి. నగర అభివృద్ధికి సహకరించండి...’’ అంటూ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ ప్రత్యేక డిమాండ్‌ నోటీసులను అందజేస్తున్నారు. అలాగే మైక్‌ల ద్వారా పన్ను చెల్లింపుపై విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు.

ఆస్తి పన్ను పెంచేశారు

జీవీఎంసీ పరిధిలో మూల విలువ ప్రకారం విధింపు

ఇప్పటివరకూ 17 శాతం మంది యజమానులకు నోటీసులు జారీ

మరో 25 శాతం మందికి మెసేజ్‌లు

మిగిలిన 58 శాతం మందికి నెలాఖరు నాటికి పంపిణీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘‘పెరిగిన ఆస్తి పన్నును మార్చి 31లోగా జీవీఎంసీకి చెల్లించండి. నగర అభివృద్ధికి సహకరించండి...’’ అంటూ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ ప్రత్యేక డిమాండ్‌ నోటీసులను అందజేస్తున్నారు. అలాగే మైక్‌ల ద్వారా పన్ను చెల్లింపుపై విస్తృతంగా ప్రచారం ప్రారంభించారు.  

ఆస్తి మూల విలువ ఆధారంగా పన్ను వసూలుకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. కొత్తవిధానం ప్రకారం అన్ని అసెస్‌మెంట్లకు ఆస్తి పన్ను మదింపు పూర్తవ్వడంతో నోటీసులు జారీచేసే ప్రక్రియను ఈ నెలారంభం నుంచివేగవంతం చేసింది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 5,26,752 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వీటి నుంచి ఇప్పటివరకూ వార్షిక అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్ను వసూలు చేసేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మూల విలువ ప్రకారం పన్ను వసూలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం నివాసాల నుంచి ఆస్తి మొత్తం విలువలో 0.12 శాతం చొప్పున, వాణిజ్య భవనాలైతే 0.25 శాతం చొప్పున పన్నుగా వసూలు చేయాలని జీవీఎంసీ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. కొత్తవిధానంలో ఆస్తి పన్ను కొన్నిచోట్ల ప్రస్తుతం చెల్లిస్తున్నదానికంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కు కానుండడంతో ఆ మొత్తాన్ని మొదటి సంవత్సరమే కాకుండా ఏడాదికి 15 శాతానికి మించకుండా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ రెవెన్యూ విభాగం అధికారులు అసెస్‌మెంట్‌ వారీగా సర్వే నిర్వహించి, పాత విధానంలో చెల్లిస్తున్న పన్ను, కొత్త విధానంలో విధించాల్సిన పన్ను ఎంత అనేది లెక్కించారు. ఆ వివరాలను ఈఆర్‌పీ(ఆన్‌లైన్‌)లో  అప్‌లోడ్‌ చేశారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తిచేశారు.  

జనవరి ఆరంభం నుంచి కొత్త విధానంలో ఆస్తిపన్ను కట్టాలని కోరుతూ ప్రతి అసెస్‌మెంట్‌ యజమానికి ప్రత్యేక డిమాండ్‌ నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటివరకూ 17 శాతం (89,547) అసెస్‌మెంట్లకు సంబంధించి నోటీసు కాపీలను వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా అందజేశారు. మరో 25 శాతం (1,31,688) అసెస్‌మెంట్లకు సంబంధించి కట్టాల్సిన పన్ను వివరాలను వాటి యజమానుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌ రూపంలో పంపించారు. మిగిలిన 58 శాతం (3,05,516) అసెస్‌మెంట్లకు నోటీసులు/మెసేజ్‌లు పంపించాల్సి ఉంది. అందరికీ ఈ నెలాఖరులోగా నోటీసు కాపీలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రెవెన్యూ విభాగం సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2022-01-21T05:58:56+05:30 IST