ఎడాపెడా.. బాదుడే బాదుడు!

ABN , First Publish Date - 2022-05-21T08:08:02+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అప్పుల వేట సాగిస్తున్న జగన్‌ సర్కారు... ఆదాయం కోసం కొత్తకొత్తగా జనాన్ని బాదుతోంది. ఇప్పటిదాకా పెంచిన పన్నులు, చార్జీలు సరిపోవడంలేదంటూ...

ఎడాపెడా.. బాదుడే బాదుడు!

రిజిస్ర్టేషన్లు, ఆస్తిపన్ను మరింత భారం

ఏప్రిల్‌లో భూముల విలువ బాదుడు

జూన్‌ 1 నుంచి నిర్మాణాల విలువ కూడా

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...

పెరగనున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు

ఆస్తి పన్నుదీ అదే దారి

తాటాకుల గుడిసె నుంచి ఫ్లాట్ల దాకా...

కోళ్ల ఫారం నుంచి సినిమా హాలు దాకా..

దేనినీ వదలకుండా పెంచిన సర్కారు


ఆస్తి పన్ను బాదుడు... భూముల విలువ బాదుడు... చెత్త పన్ను బాదుడు... విద్యుత్‌ చార్జీల బాదుడు... ఇవి చాలవని మళ్లీ కొత్తగా ఇంకో ‘బాదుడే బాదుడు’! కాసుల కోసం సర్కారు ఒక్క దెబ్బతో రెండు రకాలుగా బాదేసింది. భవనాలు, నిర్మాణాల విలువను పెంచేసింది. దీనివల్ల రెండురకాలుగా సర్కారుకు ఆదాయం. ఒకటి... భవనాల రిజిస్ట్రేషన్‌ విలువ పెరుగుతుంది. రెండు... భవనాల విలువ ఆధారంగా వసూలు చేసే ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. ఒక్క ఉత్తర్వుతో... 2 బాదుళ్లు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అప్పుల వేట సాగిస్తున్న జగన్‌ సర్కారు... ఆదాయం కోసం కొత్తకొత్తగా జనాన్ని బాదుతోంది. ఇప్పటిదాకా పెంచిన పన్నులు, చార్జీలు సరిపోవడంలేదంటూ... కొత్తగా భవనాలు, నిర్మాణాల విలువను భారీగా పెంచేసింది. దీంతో అపార్ట్‌మెంట్‌లు, నిర్మాణాల రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా పెరుగుతాయి. పల్లె నుంచి నగరం వరకు... గోడలు కూడా లేని తాటాకుల గుడిసె నుంచి విలాసవంతమైన భవంతుల వరకు... అన్నింటి ధరలనూ పెంచింది. సగటున పది శాతం వరకు ధరలు పెంచేసింది.  దీనివల్ల ఆయా నిర్మాణాల రిజిస్ట్రేషన్‌ చార్జీలు భారీగా పెరుగుతాయి. అంతేకాదు... ఆస్తి పన్ను కూడా పెరుగుతుంది. గతంలో అద్దె ఆధారంగా ఆస్తిపన్ను వసూలు చేసేవారు. దీనిని జగన్‌ సర్కారు మార్చేసింది. నిర్మాణ విలువ ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది. ఇప్పుడు నిర్మాణాల విలువ పెంపుతో... రిజిస్ట్రేషన్‌ చార్జీలతోపాటు ఏటా వసూలు చేసే ఆస్తిపన్ను కూడా పెరుగుతుంది. రివైజ్‌ చేసిన నిర్మాణాల రేట్లను జూన్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రమంతా అమలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. 


ఏదీ వదలకుండా...

భవన నిర్మాణాలు, అపార్ట్‌మెంట్‌లు, సినిమా హాళ్లు, మిల్లులు, ఫ్యాక్టరీలు, కోళ్ల ఫారాలు, నాపరాయి నిర్మాణాలు, మట్టి మిద్దెలు, పూరిళ్లు, గోడలు లేని తాటాకుల గుడిసెలు... ఇలా దేనినీ వదలకుండా నిర్మాణ ధరలను పెంచారు. పట్టణాల్లో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి, రెండో అంతస్తులకు చదరపు అడుగుకు రూ.1200, మేజర్‌ పంచాయతీల్లో రూ.1060,  చిన్న పంచాయతీల్లో రూ.770లు చొప్పున నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భూముల మార్కెట్‌ విలువ పెంచారు. ఇప్పుడు నిర్మాణాల విలువ కూడా పెంచేశారు.



Updated Date - 2022-05-21T08:08:02+05:30 IST