రాయితీ.. రాబడి..

ABN , First Publish Date - 2022-04-27T16:21:42+05:30 IST

ఆస్తి పన్ను ఆఫర్‌ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్ను ముందస్తుగా చెల్లిస్తే ఐదు శాతం

రాయితీ.. రాబడి..

ఎర్లీ బర్డ్‌లో రూ.477 కోట్లు వసూలు 

రూ.600 కోట్లు వస్తుందని అంచనా


హైదరాబాద్‌ సిటీ: ఆస్తి పన్ను ఆఫర్‌ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పన్ను ముందస్తుగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తూ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ను జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి మొదలైన రాయితీ 30తో ముగియనుంది. 25 వరకు 5.40 లక్షల మంది రూ.477 కోట్ల పన్ను చెల్లించారని సంస్థ ఆర్థిక విభాగం వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఎర్లీబర్డ్‌లో భాగంగా రూ.541 కోట్లు వసూలయ్యాయి. ఈ సంవత్సరం రూ.600 కోట్ల వరకు పన్ను వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. 

 సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన  పన్ను రెండు విడతలుగా (ఏప్రి ల్‌ - సెప్టెంబర్‌, అక్టోబర్‌ - మార్చి, ఆరు నెలలకో మారు) చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ వినియోగించుకోవాలనుకుంటే ఏడాది పన్ను మొత్తం ఒకే సారి చెల్లించాలి. 

అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు ఉంటే.. అవన్నీ పూర్తిగా చెల్లిస్తేనే.. ఎర్లీ బర్డ్‌ వర్తిస్తుంది. పౌరులు చెల్లించే పన్ను ముందు బకాయిల వడ్డీ, బకాయిల్లో జమవుతుంది. అదంతా క్లియర్‌ అయిన తర్వాతే ప్రస్తుత సంవత్సరం పన్ను చెల్లింపు జరుగుతుంది. సాఫ్ట్‌వేర్‌ను అలా రూపొందించినట్టు ఓ అధికారి చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, సంస్థ వెబ్‌సైట్‌ www.ghmc.gov.in, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, బిల్‌ కలెక్టర్‌ ద్వారా పన్ను చెల్లించవచ్చు.

Updated Date - 2022-04-27T16:21:42+05:30 IST