Abn logo
Jun 25 2021 @ 00:22AM

ఆస్తి పన్నుపై దాగుడుమూతలు!

పెరుగుదలపై అంచనాలను ప్రజలకు వెల్లడించని జీవీఎంసీ

ఇంకా తయారుచేయలేదంటూ డీసీఆర్‌ సమాధానం

జిల్లాలోని నర్సీపట్నం మునిసిపాలిటీలో ఇప్పటికే అంచనాలు సిద్ధం

ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు

ఇక్కడ మాత్రం వింత పరిస్థితి

ముసాయిదాపై అభిప్రాయం తెలిపేందుకు మరో తొమ్మిది రోజులే గడువు

అసలు సమాచారం లేకుండా ఎలా స్పందిస్తామని ప్రశ్నిస్తున్న నగర వాసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఆస్తి పన్ను నగరంలో ఏ మేరకు పెరగనున్నదో చెప్పడానికి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు నిరాకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసిన అధికారులు...ఏఏ ప్రాంతంలో ఎంత పన్ను వుండవచ్చునన్న అంచనాలను వెల్లడించకపోవడంపై నగరవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ విభాగం డిప్యూటీ కమిషనర్‌ను సంప్రతిస్తే ఇంకా అంచనాలు తయారు చేయలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటున్నారు. 


ఆస్తిపన్నును ప్రస్తుతం విధిస్తున్న అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి మూల విలువ ఆధారంగా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నివాసాలకు ఆస్తి విలువలో 0.15 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతం, ఖాళీ స్థలాలకు 0.50 శాతం చొప్పున పన్ను విధించాలని చట్ట సవరణ చేసింది. దీనిని అమలు చేసేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను ఈ నెల మూడో తేదీన జీవీఎంసీ కమిషనర్‌ జారీ చేశారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు వచ్చే నెల మూడో తేదీ వరకూ అవకాశం ఇచ్చారు. అయితే నగరంలో భూమి విలువ ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా వుండడంతో పన్నుల పెరుగుదలలో వ్యత్యాసం ఉండవచ్చునంటున్నారు. ఇప్పుడు చెల్లిస్తున్న ఆస్తిపన్ను కంటే కొత్తగా విధించే పన్ను పెరుగుదల 15 శాతం లోపే వుంటుందని రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్నారు. కానీ విపక్షాలు మాత్రం పెరుగుదల నాలుగు నుంచి ఐదు రెట్లు వుంటుందని ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పన్ను పెరుగుదల ఏ స్థాయిలో వుంటుందనే దానిపై ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం కడుతున్న పన్ను ఎంత?, కొత్త విధానంలో ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అనే దానిపై అసెస్‌మెంట్ల వారీగా అంచనాలను తయారుచేసి ప్రజలకు అందుబాటులో వుంచాల్సి ఉన్నా, జీవీఎంసీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు


కొత్త విధానంలో ఆస్తిపన్ను పెరుగుదల వచ్చే ఐదేళ్లలో ఎలా ఉండబోతోందీ జిల్లాలోని నర్సీపట్నం మునిసిపాలిటీలో ఇప్పటికే అసెస్‌మెంట్ల వారీగా అంచనాలను తయారుచేశారు. కానీ జీవీఎంసీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ముసాయిదాపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు మరో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త విధానంలో తమ ఇంటి పన్ను ఏ స్థాయిలో పెరుగుతుందనేది తెలుసుకుని స్పందించాలని చాలామంది భావిస్తున్నారు. అందుకోసం జీవీఎంసీ రెవెన్యూ విభాగం సిబ్బందిని సంప్రతిస్తే డీసీఆర్‌ను కలవాలని చెబుతున్నారు. ఆయన్ను కలిస్తే ఇంకా అంచనాలను తయారుచేయలేదంటూ సమాధానం చెబుతున్నారు. ఇతర మునిసిపాలిటీల్లో అంచనాలను తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచారని ఎవరైనా ప్రస్తావిస్తే....తాను బిజీగా వున్నానని, అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఆస్తిపన్ను ఏ స్థాయిలో పెరుగుతుందో తెలియకుండా కొత్తచట్టం అమలుపై తమ అభిప్రాయం ఎలా తెలియజేస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం పన్ను చెల్లించాలంటూ సిబ్బంది ఎవరైనా నోటీసు పట్టుకుని ఇంటికి వస్తే...అప్పుడు తమ స్పందన చూపిస్తామంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


 పెరుగుదల భారీగా ఉందనే బయటకు చెప్పడం లేదా?


జీవీఎంసీలో కూడా పన్నులు పెరుగుదల ఏ స్థాయిలో వుండబోతుందనే దానిపై అంచనాలు తయారుచేసినట్టు సిబ్బంది పేర్కొంటున్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి నగరంలో ఏ ప్రాంతంలో భూమి విలువ ఎంత వుందనే వివరాలను చాలాకాలం కిందటే తెప్పించుకున్న అధికారులు...అసెస్‌మెంట్ల వారీగా అంచనాలు తయారుచేసినట్టు సమాచారం. అయితే కొత్త విధానంలో పన్ను పెరుగుదల భారీగా ఉందని, అందుకే బయటపెట్టడం లేదని కొందరంటున్నారు. అయితే దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కొత్త పన్నుల మొత్తాన్ని ఒకేసారి కాకుండా...నర్సీపట్నం మునిసిపాలిటీలో మాదిరిగా ఐదేళ్లపాటు ఏటా కొంత పెంచే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. నర్సీపట్నంలో ఒక ఇంటి యజమాని ప్రస్తుతం సంవత్సరానికి రూ.1,432 పన్ను చెల్లిస్తున్నారు. ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్‌ విలువ (స్థలం రూ.3,50,045, భవనం రూ.13,30,172) రూ.16,80,217. దీనిపై 0.15 శాతాన్ని పన్నుగా లెక్కిస్తే రూ.2,520 అయ్యింది. అంటే సుమారు 75 శాతం మేర పన్ను పెరిగింది. ఒకేసారి ఇంత భారీగా పన్ను పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో...పైన పేర్కొన్న యజమానికి ఏటా 15 శాతం చొప్పున ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు. జీవీఎంసీలోనూ అలా చేస్తారా? లేక ఒకేసారి భారం మోపుతారా?...చూడాలి.