ఆసరా ఆశలు

ABN , First Publish Date - 2022-08-09T05:53:38+05:30 IST

ఆసరా పింఛన్ల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు చెప్పారు.

ఆసరా ఆశలు

- 15 నుంచి కొత్త పెన్షన్ల మంజూరు 

- మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వారిలో ఆనందం

- జిల్లాలో దరఖాస్తులను అప్‌డేట్‌ చేసిన అధికారులు 

- వెబ్‌సైట్‌ బంద్‌... కొత్తవారిలో అయోమయం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆసరా పింఛన్ల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. అగస్టు 15 నుంచి కొత్త ఫించన్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించడంతో దరఖాస్తు దారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు వస్తున్నాయని ఒకవైపు ఆనందంగా ఉన్నా వయస్సు సడలింపు, కొత్తగా అర్హతకు వచ్చిన వారు దరఖాస్తులు చేసకోవడానికి వెబ్‌సైట్‌ పనిచేయడం లేదని తెలుస్తోంది. దీంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై ప్రభుత్వం అనేక సార్లు ఆశలు కల్పించినా నిరీక్షణే మిగిల్చింది. రాజకీయ మార్పులు, సమీకరణలు, ఎన్నికలపై ఊహాగానాల నేపఽథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ముందుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పింఛన్‌ దరఖాస్తులు 30,473 వరకు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో జిల్లా అధికారులు వేగంగా ఆన్‌లైన్‌లోనే పరిశీలన కార్యక్రమాన్ని  చేపట్టారు. పింఛన్‌ కటాఫ్‌ తేదీ ఎప్పటివరకు ఉంటుందనే దానిపై చర్చ కొనసాగుతోంది. 

- వయస్సు కుదింపుతో పెరగనున్న అర్హులు..

2018లో ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లకు వయస్సు కుదింపునకు సంబంధించి ఆగస్టులో జీవో నంబర్‌ 17ను జారీ చేశారు. దీంతో ఎంతో ఆశగా జిల్లాలో 19,390 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గత సంవత్సరం ఓటరు జాబితా ప్రకారం 14,044 మంది అర్హులుగా గుర్తించారు. మూడేళ్లు దాటిపోయినా పింఛన్‌ ఆశలు మాత్రం నెరవేరడం లేదు. గత సంవత్సరం అక్టోబరు 30వ తేదీ వరకు మళ్లీ దరఖాస్తులు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో అనేక మంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఫించన్లు అందిస్తామని ప్రకటించడంతో కొత్తగా వయస్సు సడలింపుతో అర్హులు పెరిగారు. వారు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పిస్తారా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. గతేడాది అక్టోబరులో అవకాశం ఇవ్వడంతో  19,390 మంది దరఖాస్తులు చేసుకున్నారు.. ఇందులో బోయినపల్లి మండలంలో 1,452 మంది, చందుర్తిలో 1,234 మంది, గంభీరావుపేటలో 1,647 మంది, ఇల్లంతకుంటలో 1,889 మంది, కోనరావుపేటలో 1,620 మంది, ముస్తాబాద్‌లో 1,976 మంది, రుద్రంగిలో 486 మంది, సిరిసిల్లలో 2,486 మంది, తంగళ్లపల్లిలో 1,408 మంది, వీర్నపల్లిలో 481 మంది, వేములవాడలో 2,083 మంది, వేములవాడల రూరల్‌లో 918 మంది, ఎల్లారెడ్డిపేటలో 1,710 మంది ఉన్నారు. ప్రస్తుతం పింఛన్లు అందిస్తామని చెప్పడంతో పరిశీలన ప్రక్రియ చేపట్టారు.

- మంజూరుకు సిద్ధంగా 7680 పింఛన్‌లు 

జిల్లాలో కూడా 65 ఏళ్లు నిండిన వారు, వితంతువులు, పింఛన్‌ అర్హత కలిగిన 7,680 మంది దరఖాస్తులు పూర్తిగా పరిశీలన జరిపి సెర్ఫ్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో వృద్ధులు 1,917 మంది, వితంతువులు 3,403 మంది, దివ్యాంగులు 839 మంది, గీతకార్మికులు 375 మంది, చేనేత కార్మికులు 278 మంది, బీడీ కార్మికులు 525 మంది, ఒంటరి మహిళలు 105 మంది, బోదకాలు బాధితులు 238 మంది ఉన్నారు. 

- డయాలసిస్‌ బాధితులు 100 మంది

జిల్లా అసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రంలో వంద మంది బాధితులు నమోదై ఉన్నారు. డయాలసిస్‌ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. వీరితో పాటు జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేసుకునే వారు మరో 50 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. జిల్లాలో జరుగుతున్న హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్ట్‌ పూర్తయితే సమగ్రంగా లెక్క తేలనుంది. వీరికి కూడా ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేయనుంది. 

- పింఛన్‌దారులు 1,06,851 మంది..

జిల్లాలో 1,06,851 మందికి ఆసరా పింఛన్లు లబ్ధిదారులు ఉండగా వారికి ప్రతి నెలా  22కోట్ల 58లక్షల 59వేల 752 పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 23,803 వృద్ధాప్య పింఛన్లకు రూ 4.79 కోట్లు, దివ్యాంగుల పింఛన్లు 9,823 మందికి రూ 2.96 కోట్లు, వితంతువులు 21,705 మందికి రూ 4.37 కోట్లు, చేనేత కార్మికులు 3,590 మందికి రూ  72.37 లక్షలు గీత కార్మికులకు 2075 మందికి రూ 41.83 లక్షలు, బీడి కార్మికులకు 43,189 మందికి రూ 8.70 కోట్లు, ఒంటరి మహిళలు 1,,67 మందికి రూ 35.62 లక్షలు, బోదకాలు బాధితులకు 899 మందికి రూ 18.12 లక్షలు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. 


Updated Date - 2022-08-09T05:53:38+05:30 IST