ముడుపులిస్తేనే పదోన్నతులు

ABN , First Publish Date - 2021-10-19T05:40:46+05:30 IST

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పైసలు ఇస్తేనే ఫైళ్ళు కదులుతున్నాయి. లేదంటే నెలల తరబడి మూలుగుతాయి. ఐటీడీఏలో కీలక స్థానంలో ఉన్న కొందరు ఉద్యోగులు... గిరిజన వసతి గృహాల వార్డెన్ల పదోన్నతులపై బేరసారాలు ఆడుతున్నారు. సంబంధిత ఫైల్‌ క్లియర్‌ చేయాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనని బాహాటంగా డిమాండ్‌ చేస్తున్నట్టు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ముడుపులిస్తేనే పదోన్నతులు

ఐటీడీఏలో అవినీతి లీలలు
సర్వీసుపరంగా హాస్టల్‌ వార్డెన్లకు తీవ్ర నష్టం
అధికారుల తీరుతో ఏళ్ళుగా పెండింగ్‌
సీనియారిటీ తుది జాబితా బుట్టదాఖలు
మళ్ళీ మొదటి నుంచి కసరత్తు


హనుమకొండ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) :
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పైసలు ఇస్తేనే ఫైళ్ళు కదులుతున్నాయి. లేదంటే నెలల తరబడి మూలుగుతాయి. ఐటీడీఏలో కీలక స్థానంలో ఉన్న కొందరు ఉద్యోగులు... గిరిజన వసతి గృహాల వార్డెన్ల  పదోన్నతులపై బేరసారాలు ఆడుతున్నారు. సంబంధిత ఫైల్‌ క్లియర్‌ చేయాలంటే ముడుపులు చెల్లించాల్సిందేనని బాహాటంగా డిమాండ్‌ చేస్తున్నట్టు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కలిసికట్టుగానా లేక విడివిడిగా స్వయంగా వచ్చి కలవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. లేకుంటే సంబంధిత ఫైల్‌  ముందుకు కదలదని చెబుతున్నారు.

జాప్యం
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐటీడీఏ పరిధిలో పని చేసే ఉద్యోగుల పదోన్నతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పదోన్నతులు వెంట వెంటనే ఇస్తుంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రం గత మూడేళ్ళుగా నానపెడుతున్నారు. దీంతో పలువురు ఉద్యోగులు పదోన్నతులు పొందకుండానే రిటైర్‌ అవుతున్నారు.  గిరిజన వసతి గృహాల గ్రేడ్‌ 2 సంక్షేమ అధికారులు (వార్డెన్లు) పదోన్నతే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గ్రేడ్‌ 2 వార్డెన్లకు గ్రేడ్‌ 1గా పదోన్నతులు ఇవ్వడానికి ఐటీడీఏ అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. పదోన్నతుల కోసం గ్రేడ్‌ 2 వార్డెన్లు గత మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. అధికారులు ఇదిగో   చేస్తాం.. అదిగో చేస్తామంటూ కాలాయాపన చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రేడ్‌ 1గా పదోన్నతి పొందేందుకు అర్హత కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వీరిలో కొందరు ఒకటీ, రెండు సంవత్సరాల్లో రిటైర్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ లోగా తమకు గ్రేడ్‌ 1గా పదోన్నతి వస్తే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలమని, ఆర్థికంగా ప్రయోజనం పొందగలమని వారు చెబుతున్నారు.

మూడేళ్ళుగా..

2018లోనే గ్రేడ్‌ 2 వార్డెన్ల పదోన్నతులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. సమగ్ర గరిజానాభివ్దృద్ధి సంస్థను విభజించలేదు కనుక వీరి సీనియారిటీ జాబితాను తయారు చేయడానికి హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారులతో (డీటీడీవో)లో ఒక కమిటీ వేశారు. వారు 2019లో గ్రేడ్‌ 2 హాస్టల్‌ వార్డెన్ల సర్వీస్‌ రికార్డులను పరిశీలించి అర్హులైన వారి సీనియారిటీ జాబితాను తయారు చేసి ఆమోదం కోసం ఐటీడీఏ కార్యాలయానికి పంపించారు. ఏడాది పాటు ఫైల్‌ కార్యాలయంలోనే మూలిగింది. వార్డెన్లు కార్యాలయం చుట్టూ ఎన్ని సార్లు ప్రదక్షిణ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మిగతా ఐటీడీఏ పరిధిలోని జిల్లాలో పదోన్నతులు ఇచ్చేశారు. ఈ విషయాన్ని సంబంధిత గిరిజన శాఖ మంత్రికి, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేల దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేకుండా పోయింది.

మళ్ళీ మొదటికి..
చివరికు ఆందోళనకు దిగగా దిగి వచ్చిన అధికారులు పదోన్నతుల ప్రక్రియపై దృష్టి సారించారు. అయితే సీనియారిటీ తుది జాబి తా ఇది వరకే సిద్ధమై ఉండగా అధికారులు దానిని కాదనీ ప్రక్రియను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టారు. గత ఆరు నెలల నుంచి ఈ కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సీనియారిటీ జాబితా హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని డీటీడబ్ల్యు వో కార్యాలయాల్లో తిరిగి తిరిగి ఏట్టకేలకు నెల రోజుల క్రితం ఐటీడీఏ  కార్యాలయానికి చేరింది. ఈ ఫైల్‌ను క్లియర్‌ చేయాల్సిన కొందరు ఉద్యోగులు కావాలని పెండింగ్‌లో పెడుతున్నారని బాధిత వార్డెన్లు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2021-10-19T05:40:46+05:30 IST