పదోన్నతి ప్రశ్నార్థకం..!

ABN , First Publish Date - 2022-08-04T06:06:11+05:30 IST

పదోన్నతి ప్రశ్నార్థకం..!

పదోన్నతి ప్రశ్నార్థకం..!

జలవనరుల శాఖ ఇంజనీర్లలో అయోమయం

తయారుకాని ప్యానల్‌ జాబితా

ఒక్కొక్కరి వద్ద రెండు, మూడు బాధ్యతలు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) :  జూనియర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాను. ఎన్నో ఏళ్లు ఆగితే కానీ, ఏఈ పదోన్నతి రాలేదు. ఇప్పుడు డీఈ పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే, అది వస్తుందో లేదోనన్న సందిగ్ధం ఉంది. ఇక ఏఈగానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందేమో. జలవనరుల శాఖలోని ఓ ఏఈ వ్యథ. 

పదోన్నతులు వచ్చేనా?

జలవనరుల శాఖలో ఇంజనీర్లు వేసుకున్న అంచనాలు తారుమారవు తున్నాయి. సర్వీసులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా పదోన్నతి ఫలాలను అనుభవించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన తప్పులకు సంబంధించిన కేసులు న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. వాటిపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఫలితంగా పదోన్నతి ఫలాలను అందుకోవడానికి దగ్గర్లో ఉన్నవారంతా నీరుగారిపోతున్నారు. 

ఎఫ్‌ఏసీలతో సరి..!

జిల్లాలో జేఈ మొదలు ఎస్‌ఈ వరకూ ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారంతా రెండు, మూడు పోస్టులకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా జలవనరుల శాఖలో పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ ప్యానల్‌ జాబితా సిద్ధం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం న్యాయస్థానాల్లో ఉన్న కేసుల చిక్కులే. ప్రస్తుతం డీఈ స్థాయి అధికారి హెడ్‌ క్వార్టర్‌ పోస్టుతో పాటు పైన ఉండే ఈఈ స్థాయి పోస్టుకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక ఏఈ స్థాయి అధికారి రెండు డీఈ పోస్టులకు ఎఫ్‌ఏసీగా ఉన్నారు. దీనిపై పదోన్నతులకు దగ్గరగా ఉన్న ఇంజనీర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్యానల్‌ జాబితా ఇప్పట్లో తయారయ్యే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఇంజనీరింగ్‌ సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాలను ఉన్నతాధికారులకు సూచించారు. పదోన్నతులు ఇచ్చే అవకాశం లేనప్పుడు వాటికి అర్హత ఉన్న ఇంజనీరింగ్‌ సిబ్బందిని ఆ హోదాకు తగిన స్థానాల్లో ఎఫ్‌ఏసీలుగా నియమించాలని కోరుతున్నారు. ఈ సూచనను పక్కనపెట్టి, తెరవెనుక కథ నడిపిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు జలవనరుల శాఖలో బలంగా వినిపిస్తున్నాయి. ఒకే అధికారితో రెండు, మూడు పోస్టులకు సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడం కంటే, అర్హత ఉన్న అఽధికారులను ఆయా స్థానాల్లో ఇన్‌చార్జిగా నియమించడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదని స్పష్టం చేస్తున్నారు. 

మంత్రికి వినతి

జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లకు త్వరితగతిన పదోన్నతులు కల్పించి పనిభారాన్ని తగ్గించాలని ఇంజనీర్ల అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. అసోసియేషన్‌ ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, రాంబాబు, మల్లికార్జునరెడ్డి తదితరులు విజయవాడలోని ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబును క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామనని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఈఎన్‌సీ నారాయణరెడ్డికి మరో వినతి అందజేశారు.

Updated Date - 2022-08-04T06:06:11+05:30 IST