పైసలిస్తే పదోన్నతి

ABN , First Publish Date - 2022-05-17T05:34:55+05:30 IST

అంగన్‌వాడీ టీచర్లకు గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పైసలిస్తే పదోన్నతి

- అంగట్లో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులు 

- ఎమ్మెల్యేల కార్యాలయాలు కేంద్రంగా పైరవీలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)


అంగన్‌వాడీ టీచర్లకు గ్రేడ్‌-2 సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని సూపర్‌వైజర్‌ పోస్టులను అంగట్లో పెట్టి అమ్మేందుకు సిద్ధమయ్యారనే విమర్శ విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచే అక్కడ పనిచేసే వారు అంగన్‌వాడీ టీచర్లకు ఫోన్‌ చేస్తూ తాము పదోన్నతి కల్పించేలా చూస్తామని, తమను వచ్చి కలువాలని సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతి కోసం అంగన్‌వాడీ టీచర్లు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు అదిగో.. ఇదిగో అనడమే తప్ప ఆ దిశగా అడుగులు పడలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 433 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందుకోసం జనవరి 2న రాత పరీక్ష కూడా నిర్వహించారు. జోనల్‌ కేడర్‌లో ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. 


 రాజన్న సిరిసిల్ల జోన్‌లో 76 పోస్టులు


రాష్ట్రంలో ఏడు జోన్లు ఉండగా కరీంనగర్‌ జిల్లా అంతర్భాగమై ఉన్న రాజన్నసిరిసిల్ల జోన్‌లో 76 గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్‌, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు ఈ జోన్‌లో ఉంటాయి.  ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి కాళేశ్వరం జోన్‌లో, జగిత్యాల బాసర జోన్‌లో ఉన్నాయి. ఈ సూపర్‌వైజర్‌ పోస్టులను జోన్ల వారిగా రోస్టర్‌ పద్దతిలో రిజర్వేషన్లు పాటిస్తూ భర్తీ చేయాల్సి ఉన్నది. జనవరిలో రాతపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఫలితాలను ప్రకటించింది. రాతపరీక్షలో తప్పుడు జవాబులకు మార్కులు తగ్గించే విధానాన్ని పాటించారు. దీంతో పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకు అత్యధికంగా 40 మార్కుల వరకే వచ్చాయని అప్పుడు అధికారవర్గాలు చెప్పాయి. 


 సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌లో నిబంధనలు పాటించలేదని విమర్శలు


ఏప్రిల్‌లో అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. 1:2 పద్ధతిన  ఒక పోస్టుకు ఇద్దరిని పిలిచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్లు చేయాల్సి ఉండగా ఆ పద్దతి పాటించలేదనే విమర్శలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ అభ్యర్థుల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీ అభ్యర్థులను కూడా సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌కు పిలిచారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అధిక మార్కులు సాధించిన బీసీ, ఎస్సీలను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవ లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇది పలు అనుమానాలుకు తావిస్తున్నది. 


 అంగన్‌వాడీ టీచర్లకు ఫోన్లు


పైరవీలు చేసుకున్నవారికే సూపర్‌వైజర్‌ పోస్టులు దక్కబోతున్నాయని, రాతపరీక్షల్లో వచ్చిన మార్కులు పట్టించుకునే వారు లేరనే అభిప్రాయాన్ని అంగన్‌వాడీ టీచర్లు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది మరికొందరు అధికారపార్టీకి చెందిన వారుగా చెప్పుకుంటున్నవారి నుంచి రాతపరీక్షలకు హాజరైన అంగన్‌వాడీ టీచర్లకు ఫోన్లు వస్తున్నాయని, సూపర్‌వైజర్‌ పోస్టుకు పదోన్నతి ఇప్పిస్తాం.. అందుకు అవసరమైన డబ్బు ఇచ్చేందుకు మాట్లాడటానికి రావాలని సూచిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ దళారులను నమ్మవచ్చో లేదో అనే అనుమానాలు కూడా కలుగుతూ అంగన్‌వాడీ టీచర్లు గందరగోళంలో పడిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చిన ఓసీలను సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు పిలవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు మల్టిజోన్‌-2లో పనిచేస్తున్న 157 మంది కాంట్రాక్టు సూపర్‌వైజర్లకు ప్రమోషన్‌ కల్పించేందుకు పెద్ద బేరసారాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ జరిగిన తీరును పరిశీలించి అర్హులైన వారికే ప్రమోషన్లు ఇవ్వాలని, పైరవీలకు తావులేకుండా చూడాలని అంగన్‌వాడీ టీచర్లు కోరుతున్నారు. అంతంత మాత్రాన జీతాలున్న తాము దళారీలకు వేలాది రూపాయలు చెల్లించలేమని, ఇప్పటికే ఎన్నో ఏళ్ళుగా ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్న తాము  అవకాశం వచ్చిన సమయంలో ముడుపులు ఇవ్వాల్సి రావడం బాధాకరంగా ఉందని వారు వాపోతున్నారు. 

Updated Date - 2022-05-17T05:34:55+05:30 IST