ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-07-06T06:11:52+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. ఇది జరిగి వంద రోజులు దాటినా నేటికీ వారికి ఆర్డర్ కాపీ అందలేదు...

ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. ఇది జరిగి వంద రోజులు దాటినా నేటికీ వారికి ఆర్డర్ కాపీ అందలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి మూడు సంవత్సరాలు కావస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిందని సంతోషపడాలో ఆర్డర్ కాపీ రాలేదని బాధపడాలో అర్థం కాని అయోమయ స్థితిలో వారు ఉన్నారు.


ఉద్యోగం కోల్పోవడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో వలసలు నివారించేందుకు వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టంలో 14 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తించేవారు. వీరు క్షేత్రస్థాయిలో అనేక రాజకీయ వేధింపులతో పాటు, పని ఒత్తిడికి గురయ్యారు. ఉద్యోగ భద్రత, చాలీచాలని వేతనాలు, మరోపక్క తమ మనుగడకే ప్రమాదం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 47, 79 జీఓలను వ్యతిరేకిస్తూ 2020 మార్చి 12న ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. అయినా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించలేదు. ఈ సమయంలోనే కరోనా వైరస్ మొదలయింది, మరోపక్క సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో సమ్మె విరమించి, వీరు విధుల్లోకి చేరారు. కాని రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ 2020 మార్చి 18న ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. సమ్మె చేసి తప్పు చేశాం.. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి... భవిష్యత్తులో సమ్మె చేయం అని రాష్ట్ర ప్రభుత్వానికి సంజాయిషీ లేఖ ఇచ్చినా ప్రభుత్వం ఆ లేఖను తుంగలో తొక్కింది. దీనిపై ఫీల్డ్ అసిస్టెంట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం డిసెంబర్ 2న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం హైకోర్టు తీర్పును బుట్టదాఖలు చేసింది. 


గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల ప్రచా రంలో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కాళ్ల మీద పడ్డా ప్రభుత్వం కరుణించలేదు. నాగార్జునసాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. అయినా వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కలెక్టరేట్ల ముందు ధర్నాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, బిక్షాటనలు, రాస్తారోకోలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి వంటి పలు రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ‘చలో అసెంబ్లీ’ వంటి మిలిటెంట్ పోరాటాలు చేశారు. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి పెరగడంతో మార్చి 15న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను ఈ రోజు నుంచి విధుల్లోకి తీసుకుంటున్నామని ప్రకటించారు. అలా ప్రకటించి కూడా వంద రోజులు దాటింది. అయినా నేటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి అతీగతీ లేదు. ఇకనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటూ తక్షణమే ఆర్డర్ కాపీ ఇవ్వాలి.

మట్టిపెల్లి సైదులు 

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 

రాష్ట్ర ఉపాధ్యక్షులు

Updated Date - 2022-07-06T06:11:52+05:30 IST