NRI: అమెరికాలో తెలుగు తేజం ర‌త్త‌య్య జాస్తి క‌న్నుమూత‌!

ABN , First Publish Date - 2022-09-23T16:20:41+05:30 IST

అగ్ర‌రాజ్యం అమెరికాకు 68 ఏళ్ల క్రితం ఓడ‌ల్లో ప‌య‌నించి వెళ్లి మన తెలుగు ఉన్న‌తిని స‌మున్న‌త స్థాయికి చేర్చిన తెలుగు తేజం 'ర‌త్త‌య్య జాస్తి' ఇక‌లేరు.

NRI: అమెరికాలో తెలుగు తేజం ర‌త్త‌య్య జాస్తి క‌న్నుమూత‌!

సంతాపం ప్ర‌క‌టించిన జ‌య‌రాం కోమ‌టి!

సేవా దురంధ‌రులు ర‌త్త‌య్య జాస్తి ఇక‌లేరు!

రెండు రోజులుగా ఆరోగ్య స‌మ‌స్య‌లు

మ‌న వాళ్లంటే ప్రాణం పెట్టే తెలుగు తేజం

1954లోనే ఓడ‌లో అమెరికాకు ప‌యనం

ఉన్న‌త విద్య‌, స‌మున్న‌త ఉద్యోగం

అయినా, తెలుగు నేల‌ను మ‌ర‌వ‌ని నైజం

నివాళుల‌ర్పించిన బే ఏరియా నాయ‌కులు

ఎన్నారై డెస్క్: అగ్ర‌రాజ్యం అమెరికాకు 68 ఏళ్ల క్రితం ఓడ‌ల్లో ప‌య‌నించి వెళ్లి మన తెలుగు ఉన్న‌తిని స‌మున్న‌త స్థాయికి చేర్చిన తెలుగు తేజం 'ర‌త్త‌య్య జాస్తి' ఇక‌లేరు. 94 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న న్యుమోనియా స‌మ‌స్య‌తో అమెరికాలోని ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం అగ్ర‌రాజ్యంతో ఆయ‌న అనుబంధం ఏర్ప‌రుచుకున్నారు. తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా క‌లిసి మెలిసి ఉండాల‌ని స్వప్నించిన‌ ర‌త‌య్య జాస్తి స‌తీమ‌ణి 20 ఏళ్ల కింద‌టే క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఒంట‌రిగానే ఉంటున్నారు. రెండు రోజుల కింద‌ట అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన‌ ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి ప‌ర‌మ‌ప‌దించిన‌ట్టు కాలిఫోర్నియాలోని బే ఏరియా తెలుగు సంఘాల నాయ‌కులు తెలిపారు.


బోడ‌పాడు నుంచి బే ఏరియాకు!

ర‌త్త‌య్య జాస్తి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఉన్న బోడ‌పాడు గ్రామానికి చెందిన వారు. 1928లో జ‌న్మించిన ఆయ‌న అప్ప‌ట్లోనే ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. మ‌ద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌టెక్నాల‌జీలో ఇంజ‌నీరింగ్ చేసిన ఆయ‌న‌ బెంగ‌ళూరులోని ఐఐఎస్‌సీలో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పిహెచ్‌డీ కోసం అగ్ర‌రాజ్యం బాట‌ప‌ట్టారు. మిన్నెసోటా యూనివ‌ర్సిటీలో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంత‌రం కాలిఫోర్నియాలోని `లాక్‌హీడ్ మార్టిన్‌`లో ఇంజ‌నీరుగా ఉన్న‌త‌స్థాయిలో సుదీర్ఘ కాలం పాటు సేవ‌లు అందించారు. అయితే ఇక్క‌డ ఆస‌క్తికర విష‌యం ఏంటంటే 1954లో ఆయ‌న అమెరికాకు ఓడ‌లో ప్ర‌యాణించి వెళ్లారు. అలా ఓడ‌లో ప్ర‌యాణించిన వెళ్లిన తొలిత‌రం తెలుగువారు కూడా ఆయ‌నే. సుమారు 38 రోజుల పాటు ఇలా ప్ర‌యాణించాల్సి వ‌చ్చేది.


తెలుగంటే ప్రాణం!

తెలుగు వారంతా ఐక్యంగా ఉండాల‌ని ర‌త్త‌య్య జాస్తి త‌పించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రం ఉమ్మ‌డిగా ఉండాల‌ని, తెలుగు వారు క‌లిసి ఉండాల‌ని భావించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్‌తోనూ అవినాభావ సంబంధాలు ఏర్పాటు చేసుకుని తెలుగు జాతి ఐక్య‌త‌కోసం ఆయ‌న స్వ‌ప్నించారు. ఇటీవ‌ల భార‌త సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రిటైరైన‌ జ‌స్టిస్ ఎన్వీరమ‌ణ‌ విధుల్లో ఉన్న‌ప్పుడు అమెరికాలో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలో వ‌యోవృద్ధులు అయిన‌ప్ప‌టికీ కూడా ఓపిక చేసుకుని మ‌రీ వ‌చ్చి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ‌ను ప‌ల‌కరించారు. టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోకి 91 ఏళ్ల వయస్సులో  ప్రయాణించి, తన గ్రామానికి చెందిన నూతన దంపతులని ఆశీర్వదించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ర‌త్త‌య్య జాస్తికి తెలుగు వారిప‌ట్ల, వారి గ్రామ ప్రజల ఉన్న పట్ల ఉన్న ఆత్మీయ‌త‌ను ప్ర‌స్ఫుటీక‌రించేలా చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు.


గుప్త దానాలు!

వైద్య రంగానికి ఆయ‌న ఇతోధికంగా అనేక సాయాలు అందించారు. మూడో కంటికి తెలియ‌కుండా అనేక గుప్త‌దానాలు చేశారు. అప్ప‌ట్లోనే ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రికి దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఒక బ్లాక్‌ను సైతం నిర్మించి రోగుల‌కు సాయ‌ప‌డాల‌నే అత్యున్నత ఆశ‌యాన్ని నెర‌వేర్చుకున్నారు.


 అమెరికా కోల్పోయింది!

బే ఏరియా క‌మ్యూనిటీ నాయ‌కుడు జ‌య‌రాం కోమ‌టి ర‌త్త‌య్య జాస్తి మృతి ప‌ట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. 40 ఏళ్లుగా ఆయ‌న‌తో త‌న‌కు సుదీర్ఘ అనుబంధం ఉంద‌ని పేర్కొన్నారు. ర‌త్త‌య్య జాస్తి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భగవంతుడిని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ర‌త్త‌య్య జాస్తికి అత్యంత ఆప్తులు ప్రొఫెసర్ ఆంజనేయులు కొత్తపల్లి, డాక్టర్ హనిమిరెడ్డి లక్కిరెడ్డి కుటుంబం, డాక్టర్ పేరయ్య సుందనగుంట, భగత్ సింగ్ యలమంచిలి, జోషి అన్నే, భోగేశ్వర రావు దయనేని తదితరులు ఓ పెద్ద దిక్కుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ర‌త్త‌య్య జాస్తి మ‌ర‌ణం ప‌ట్ల‌ కాలిఫోర్నియాలోని బే ఏరియా క‌మ్యూనిటీ నాయ‌కులు, స్థానిక తెలుగు సంఘాలు, బాటా, తానా కార్య వర్గాలు ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేశారు. అమెరికా ఆయ‌న‌ను కోల్పోయింద‌ని ప‌లువురు పేర్కొన్నారు.   


Updated Date - 2022-09-23T16:20:41+05:30 IST