అనుమానాస్పద స్థితిలో ప్రముఖ లాయర్‌ మృతి

ABN , First Publish Date - 2021-03-03T04:53:04+05:30 IST

కడప నగరం రాజారెడ్డివీధికి చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ గవర్నమెంటు ప్లీడర్‌, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పుల్లగూర సుబ్రమణ్యం(52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

అనుమానాస్పద స్థితిలో ప్రముఖ లాయర్‌ మృతి
సంఘటన స్థలంలో న్యాయవాది సుబ్రమణ్యం మృతదేహం

కడప(క్రైం), మార్చి 2: కడప నగరం రాజారెడ్డివీధికి చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ గవర్నమెంటు ప్లీడర్‌, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పుల్లగూర సుబ్రమణ్యం(52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి తన పాత అపార్ట్‌మెంటు వద్ద చనిపోయి కనిపించారు. అయితే అపార్ట్‌మెంటు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా తోసారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. 

రాజారెడ్డివీధికి చెందిన పి.సుబ్రమణ్యం కడప నగరంలో ప్రముఖ న్యాయవాదిగా పేరున్న వ్యక్తి. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన తన ఆఫీసు కు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి నడచుకుంటూ తన పాత అపార్ట్‌మెంటుకు వెళ్లారు.  ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య విజయలక్ష్మి రాత్రి 8గంటల సమయంలో భర్తకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో అపార్ట్‌మెంటు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పై నుంచి పడ్డంతో ముఖంతో పాటు చర్మంపై గాయాలున్నాయని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో విచారచణ చేపడతామని సీఐ తెలిపారు. ఆపార్ట్‌మెంటులోని సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. అడ్వకేట్‌ అరవింద్‌ పిర్యాదు మేరకు పి.సుబ్రమణ్యం అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గతంలో సుబ్రమణ్యంపై దాడులు జరిగాయని ఆయన సన్నిహితులు పలువురు పేర్కొన్నారు. సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కూడా అంటున్నారు. అపార్ట్‌మెంటు పైనుంచి ఎవరైనా తోసారా లేక ఇంకేదైనానా అనే విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



Updated Date - 2021-03-03T04:53:04+05:30 IST