ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారాయి

ABN , First Publish Date - 2022-07-03T06:04:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన నీటి ప్రాజెక్టులు అన్ని కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే ఆరోపించారు.

ప్రాజెక్టులు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారాయి
మాట్లాడుతున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే

- కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే

హుజూరాబాద్‌ రూరల్‌, జూలై 2: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన నీటి ప్రాజెక్టులు అన్ని కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే ఆరోపించారు. శనివారం హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిందా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో బాలికల సంరక్షణ కోసం సుకన్య సమృద్ధి యోజన, రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాలతో పాటు నిరుపేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంజరు భూములకు కూడా రైతుబంధు పథకం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటిలో టీఆర్‌ఎస్‌ లీడర్లే ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సామాన్య ప్రజలు కలిసే అవకాశం లేదని, దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, సామాన్య ప్రజలు నేరుగా సచివాలయంలో మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, పట్టణాధ్యక్షుడు గంగిశెట్టి రాజు, మాడ్గుల ప్రవీణ్‌, బింగి కరుణాకర్‌, దేవేందర్‌రావు పాల్గొన్నారు.

ఫ ఇల్లందకుంట ఆలయంలో పూజలు

ఇల్లందకుంట: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే అన్నారు. శనివారం సీతారామచంద్రస్వామి ఆలయంలో కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ మేరకు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు శేషం రామాచారార్యులు మంత్రికి ఆలయ ప్రాముఖ్యాన్ని వివరించారు. ఆలయ మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, శాలువాతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మహేంద్రనాథ్‌ పాండే మాట్లాడుతూ సీతారామచంద్రస్వామి ఈ ప్రాంతంలో ఉండడం ఇక్కడి ప్రజలు అదృష్టవంతులని అభివర్ణించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కంకణాల శ్రీలత సురేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆరెల్లి జ్యోత్స్న శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, నాయకులు మల్లేష్‌, రవి, సాయిరెడ్డి, తిరుపతిరెడ్డి, మహిపాల్‌యాదవ్‌, సత్యనారాయణరెడ్డి, షఫి, సాంబయ్య, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:04:19+05:30 IST