ప్రాజెక్టుల నిర్వహణ గాలికి!

ABN , First Publish Date - 2022-08-17T09:53:37+05:30 IST

ప్రాజెక్టుల నిర్వహణ(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) బాధ్యతలు తీసుకోవడానికి ప్రధాన కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు.

ప్రాజెక్టుల నిర్వహణ గాలికి!

ఆ  టెండర్లకు బడా కాంట్రాక్టర్లు దూరం 

నిర్వహణ పనులకు 2 చిన్న కంపెనీలే దిక్కు

పనులు అప్పగించడానికి ఇంజనీర్ల వెనుకంజ

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల నిర్వహణ(ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) బాధ్యతలు తీసుకోవడానికి ప్రధాన కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. పాత బిల్లులు చెల్లిస్తే చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచినపుడు పెద్ద కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రతీసారీ రెండే కంపెనీలు టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నాయి. నిజానికి ఆ రెండు కంపెనీల చేతుల్లో కీలక ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను పెట్టడానికి అధికారులు జంకుతున్నారు. ఇటీవలనాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ కోసం మూడు దఫాలుగా టెండర్లు పిలవగా రెండు సార్లు అర్హత లేని కంపెనీలు టెండర్‌ వేశాయి. మూడోసారి మాత్రం అర్హత ఉన్న చిన్న కంపెనీ ఆ పనులు దక్కించుకుంది. నిర్వహణ పనుల్లో మార్జిన్‌ తక్కువగా ఉంటుందని, బిల్లులు ఆలస్యమైతే గిట్టుబాటు కాదని, అందుకే ప్రధాన కాంట్రాక్టర్లు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. 


రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్నా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల నిర్మాణాలకు  రూ.1.50 లక్షల కోట్లకు పైగా నిధులు వెచ్చించింది. సకాలంలో చెల్లింపులు లేకపోవడం... కొందరికే చెల్లింపులు జరుగుతుండటంతో కొత్తగా ఏ పనులు తీసుకోవాలన్నా ప్రధాన కాంట్రాక్టర్లు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టుల పనులు దక్కించుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఒక సంస్థ కూడా నిర్వహణ పనులు ఒక్కటి కూడా తీసుకోలేదు. వివిధ ప్రాజెక్టుల పనులకు సంబంధించి దాదాపు రూ.8 వేల కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. లక్షల కోట్లు వెచ్చించి కొత్త ప్రాజెక్టులు కడుతున్న ప్రభుత్వం... పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడం విమర్శలకు తావిస్తోంది. నీటి పారుదల శాఖ స్వయంగా ముఖ్యమంత్రి చేతిలో ఉంది. కీలకమైన నాగార్జునసాగర్‌, కడెం, జూరాల, మూసీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.


ఆయన చొరవ తీసుకుంటేనే ప్రధాన కాంట్రాక్టర్లు పనులు చేపట్టడానికి ముందుకొస్తారని, వారిని ఒప్పించే బాధ్యతను సీఎం తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి. నిర్వహణ పనుల్లో మిగిలేది నామమాత్రం. టెండర్లు దక్కించుకొని, పనులు చేశాక నిధుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. పనుల్లో మానవ వనరులే కీలకం. ప్రతీనెలా వీరికి జీతాలివ్వాలంటే ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయాలి.


నిధుల విడుదల విడుదల డౌటే

రాష్ట్రంలో పదివేల ఎకరాల లోపు నీటిని అందించే లిఫ్టులు 637 దాకా ఉండగా... అందులో పనిచేస్తున్నవి 216 మాత్రమే. పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న వాటిని మరమ్మతు చేయడానికి రూ.400 కోట్లు అవసరం. అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు ఇవ్వలేదు. 2.22 లక్షల ఎకరాల ఆయకట్టును ఎండబెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్వహణకు రూ.660 కోట్ల దాకా కేటాయించినా మూడో వంతు కూడా విడుదలయ్యే అవకాశాల్లేవు. రూ.160 కోట్ల దాకా ఎత్తిపోతల పథకాల నిర్వహణకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని గేట్లు, జనరే టర్లు, రోప్‌ వైర్లు, మరమ్మతులు, లీకేజీలు, కలుపు మొక్కల తొలగింపు, పెయింటింగ్‌, గ్రీజింగ్‌, గ్యాంట్రిక్‌ క్రేన్లు, ఎలక్ట్రిషీయన్‌, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ మొత్తం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కిందకే వస్తుంది. నిధుల విడుదల కోసం వీటిని గ్రీన్‌ చానల్‌లో పెట్టాలని కోరినా ఆర్థిక శాఖ ఆమోదించలేదు. 

Updated Date - 2022-08-17T09:53:37+05:30 IST