తిరోగమనంలో పురోగమనం!

ABN , First Publish Date - 2020-11-28T06:39:18+05:30 IST

గతించిన యుగాలలోని హిందూ పాలకులు ముఖ్యంగా మౌర్య చక్రవర్తులు, చోళరాజులు గొప్ప దార్శనికులు.

తిరోగమనంలో పురోగమనం!

గతించిన యుగాలలోని హిందూ పాలకులు ముఖ్యంగా మౌర్య చక్రవర్తులు, చోళరాజులు గొప్ప దార్శనికులు. తమ కాలపు భారత వాణిజ్యాన్ని వారు ప్రపంచవ్యాప్తం చేశారు. ప్రపంచ జీడీపీలో భారత్ వాటాను 25 శాతానికి పెంచారు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న పద్ధతులు మనలను మళ్ళీ తక్కువ వృద్ధి రేటు శకానికి మాత్రమే తీసుకువెళతాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు సగటున 4.5 శాతంగా మాత్రమే ఉండగలదని కొంతమంది ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.


మన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి రాజమార్గంలోకి ప్రవేశించిందా? ‘2020–-21 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ కరెంట్ ఖాతా మిగులును సంతరించుకోవచ్చని’ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–-జూన్)లో మన బొక్కసంలో 19.8 బిలియన్ డాలర్ల మిగులు నిధులు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ‘తదుపరి త్రైమాసికాలలో మన ఆర్థిక వ్యవస్థ పనితీరు మొదటి త్రైమాసికం స్థాయిలో లేకపోయినప్పటికీ కరెంట్ ఖాతాలో మిగులు ఉండే అవకాశం ఉందని’ కూడ ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని ‘అండర్ హీటింగ్’గా ఆయన అభివర్ణించారు. మరి మార్కెట్‌లో డిమాండ్ పడిపోయింది. ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీలు డిమాండ్‌ను పునరుద్ధరించడంలో విఫలమయ్యాయి- కనీసం ఇంతవరకు. ముఖ్య ఆర్థిక సలహాదారు ఆశాభావం ఎలా ఉన్నప్పటికీ కిరాణా వ్యాపార ద్రవ్యోల్బణం 7.61 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 11.07 శాతానికి పెరిగింది. ఈ ద్రవ్యోల్బణాలు పేద ప్రజలపై క్రూరమైన భారాన్ని మోపుతున్నాయని ప్రత్యేకంగా చెప్పాలా? 


ప్రతి నల్లమబ్బుకూ ఒక వెండిఅంచు తప్పక ఉంటుంది. నిస్పృహ కలిగిస్తున్న మన ఆర్థికవ్యవస్థలో ఉత్సాహానికి తావిచ్చిన ఏకైక రంగం వ్యవసాయం. ఈ ఏడాది రబీ సీజన్‌లో 148 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు దిగుబడి అయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో ఆహార ధాన్యాల దిగుబడులు 144 మిలియన్ టన్నులుగా ఉండగలవని అంచనా. ఈ ఏడాది ట్రాక్టర్ల అమ్మకాలు 9 శాతం పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉందని ఎఫ్‌ఎమ్‌సిజి కంపెనీల సమాచారం. అయినప్పటికీ గ్రామీణ వేతనాల పెరుగుదల ప్రోత్సాహకరంగా లేదు. 


ఈ వాస్తవాల దృష్ట్యా ఆర్థికవ్యవస్థ స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయని చెప్పక తప్పదు. సమస్యలు అధికం. పురోగతి నెమ్మదించింది. విధానాల రూపకల్పన అంతా అయోమయమే. ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ విషయమై పాలకులు చెబుతున్నవి అతిశయోక్తులే. ఒక ఆర్థికవ్యవస్థ పురోగమిస్తుందనడానికి నిజమైన ప్రమాణాలు ఏమిటి? ఉద్యోగాలు, వేతనాలు, ఆదాయాలు. 


ఈ నిర్దిష్టాంశాలలో మన పురోగతి ఎలా ఉంది? ప్రభుత్వ గణాంకాలు అందుబాటులో లేనందున సుప్రసిద్ధ ఆర్థిక పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ’ (సిఎమ్‌ఐఇ) నివేదికలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. దేశంలో ప్రస్తుత నిరోద్యోగిత రేటు 6.68 శాతం అని ఆ సంస్థ నిర్ధారించింది. వివిధ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలలో పాల్గొంటున్న కార్మికులు 41 శాతం మంది మాత్రమే. మహిళా కార్మికులలో 25 శాతం మంది మాత్రమే ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ప్రతి 100 మంది ఉద్యోగులలో మహిళలు 11 మంది మాత్రమే. అయితే కోల్పోయిన ప్రతి 11 ఉద్యోగాలలో 4 మహిళలవే. 2019 సెప్టెంబర్ -2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 11 నుంచి 12 మిలియన్ల ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. ఆర్థిక వ్యవస్థ ‘అండర్ హీటింగ్’ ఎంత శుభస్కరం కాదో, ‘ఓవర్ హీటింగ్’ సైతం అంతే శుభస్కరం కాదు. ‘ఓవర్ హీటింగ్’ సంభవించినప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వడ్డీరేట్లు పెరిగి డిమాండ్‌ను కుదేలుపరుస్తాయి. ఉత్పత్తిని పెంపొందించేలా కంపెనీలకు ప్రోత్సాహం లభిస్తుంది. సక్రమంగా పని చేసే మార్కెట్లు, దిద్దుబాటు చర్యలతో డిమాండ్, సరఫరాల మధ్య సమతౌల్యత పునరుద్ధరణకు దోహదం జరుగుతుంది.


మన ఆర్థిక వ్యవస్థ ‘అండర్ హీటింగ్’లో ఉందని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అంటున్నారు. ఇది మనకు ఒక కొత్త సవాల్. దీనిని ప్రస్తుత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోతోంది. కారణమేమిటి? పేదలకు సహాయపడడం కాకుండా, ఎంతసేపూ సంపన్నులను అందునా అపర కుబేరుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆరాటపడటమే కాదా? ప్రభుత్వ తీరుకు ఒక ఉదాహరణ: పన్నుల కోత రూపేణా కార్పొరేట్ కంపెనీలకు రూ. 1,45,000 కోట్ల మేర ప్రయోజనాన్ని సమకూర్చింది! మరి అంత మొత్తాన్ని పూర్తిగా కాకపోయినా సగమైనా పేదలకు ఆహార పంపిణీ, నగదు బదిలీ రూపేణా ఎందుకు అందివ్వలేదు? ఆయాచితంగా లభించిన ఆర్థిక సహాయంతో కార్పొరేట్ ఆసాములు మరింత లబ్ధి పొందారు. తమ నగదు నిల్వలను గణనీయంగా పెంచుకున్నారు కానీ, ఆ ధనాన్ని వారు మదుపు చేయనేలేదు. ఆ సొమ్మును పేదలకు ఇచ్చి ఉంటే ఆర్థికవ్యవస్థకు నిస్సందేహంగా ఎంతో మేలు జరిగి ఉండేది. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం వారిని ఆకలిదప్పుల నుంచి కాపాడి ఉండేది. కరోనా విలయంలో మన పేదలు మూడు నెలల పాటు ఆకలితో నకనకలాడిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఉంటే ఆహారం, పిల్లలకు పాలు, మందులు, ఇతర నిత్యావసర సరుకులు, సేవలను కొనుగోలు చేసుకునేవారు. తత్ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్ విశేషంగా పెరిగి ఉండేది. ఆర్థికవ్యవస్థ నిస్సందేహంగా లబ్ధి పొంది ఉండేది. 


సరే, కరెంట్ ఖాతాలో మిగులు నిధులు ఉండడానికి కారణమేమిటి? ఎగుమతులు దిగుమతులను మించిపోవడమే. అయితే ఈ ఎగుమతులు, దిగుమతులు రెండూ గతకాలపు ప్రమాణాలతో పోల్చితే తక్కువగా ఉన్నాయన్నది ఒక వాస్తవం. కరెంట్ ఖాతా మిగులు, రూపాయి విలువ పెరుగుదల స్వల్ప విదేశీ వాణిజ్యం ఆర్థికవ్యవస్థను కుదేలుపరిచేవే గానీ అభివృద్ధికి తోడ్పడేవి కావు. ఈ పరిస్థితికి తొలుత బలయ్యేవి ఉద్యోగాలే. అసలే అరుదుగా లభ్యమయ్యే నిధులను విదేశాలలో మదుపు చేయడం జరుగుతోంది. ఇది స్థూల ఆర్థిక వ్యవస్థపై కన్పించని ప్రభావాన్ని నెరపుతోంది. పెట్టుబడులు అపారంగా అవసరమయిన ఒక అభివృద్ధి చెందుతున్న దేశం తన నిధులను మదుపు చేసేందుకు విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ఊహించుకోండి. సరిగ్గా ఇదే ఇప్పుడు మన దేశం పరిస్థితి! మరి అమెరికా వ్యాపారవేత్తలు మహదానందంలో ఉన్నారంటే ఉండరా?


ఆత్మనిర్భర్‌ను ప్రతిపాదించిన వారు ఇటువంటి ఫలితాలను ఊహించి ఉండరని, ఆశించి ఉండరని నేను విశ్వసిస్తున్నాను. ఆత్మనిర్భర్ అంటే స్వావలంబన సాధించడమే కదా. ఈ సంకల్పాన్ని మనం స్వాగతించి తీరాలి. అయితే ఆత్మనిర్భర్ విధానంలోనూ, ఆచరణలోనూ దేశీయ పరిశ్రమలకు మరింత సంరక్షణ, స్వేచ్ఛా వాణిజ్య వ్యతిరేక పద్ధతులు, అధిక సుంకాలు, స్వయం సంపూర్ణత, లైసెన్స్‌లు, కంట్రోళ్ల పునరాగమనం, నిర్హేతుక నిబంధనలు అయితే అది తప్పకుండా మన ఆర్థికవ్యవస్థ సర్వ వినాశనానికే కచ్చితంగా దారితీస్తుంది. ట్రంప్ మహాశయుని విధానాలను ఆయనను మించిన స్థాయిలో మోదీ అమలుపరచరని నేను మనఃపూర్వకంగా ఆశిస్తున్నాను. 


మనం ఒక వింత ప్రపంచంలో నివశిస్తున్నాం. ఒక పక్క కమ్యూనిస్టు చైనా అధినేత స్వేచ్ఛా వాణిజ్యం, ప్రపంచీకరణ సుగుణాల గురించి మాట్లాడుతుండగా మరోపక్క పక్కా పెట్టుబడిదారీ దేశమైన అమెరికా అధ్యక్షుడు వాణిజ్య ఒప్పందాలను, ప్రపంచ వాణిజ్య సంస్థను, స్వేచ్ఛా వాణిజ్యాన్ని, వాతావరణ మార్పును, పారిస్ ఒడంబడికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పదే పదే దుయ్యబడుతున్నారు. మనం నిజంగా తలకిందులు అయిపోతున్న ప్రపంచంలో ఉన్నాం సుమా!


సుప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ పేర్కొన్న ‘హిందూ వృద్ధిరేటు’ను అధిగమించేందుకు మనకు మూడు దశాబ్దాల కాలం పట్టింది. అయితే గతించిన యుగాలలోని హిందూ పాలకులు ముఖ్యంగా మౌర్య చక్రవర్తులు, చోళరాజులు గొప్ప దార్శనికులు అని నేను విశ్వసిస్తున్నాను. తమ కాలపు భారత వాణిజ్యాన్ని వారు ప్రపంచవ్యాప్తం చేశారు. పొరుగున ఉన్న చైనాతోనే కాదు, కొంచెం ఆవల ఉన్న ఇండోనేసియాతోనూ, సుదూరాన ఉన్న రోమ్ సామ్రాజ్యంతోనూ వారు పటిష్ఠ, విస్తృత వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకున్నారు. వారే నిజమైన ప్రపంచీకరణ వాదులు (గ్లోబలిస్ట్ లు). ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో భారత్ వాటాను ఆ కాలంలోనే 25 శాతానికి పెంచారు (మనకు అప్పట్లో శిక్షణ పొందిన ఆర్థికవేత్తలు లేరు సుమండీ!). ఆ కాలంలోనే మన దేశం స్వేచ్ఛావాణిజ్యాన్ని ఆచరించి కొత్త మార్కెట్లను స్వాయత్తం చేసుకుంది. ఈ సువిశాల దేశంలోని అశేష ప్రజల సిరిసంపదలను ఇతోధికంగా పెంచింది. మరి మనం ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఆ సమున్నత వాణిజ్య సంప్రదాయాల పట్ల విముఖత చూపుతున్నాం. దాదాపుగా స్వస్తి పలుకుతున్నాం. మనం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న పద్ధతులు మనలను మళ్ళీ తక్కువ వృద్ధి రేటు యుగానికి, ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ మాటల్లో ‘హిందూ వృద్ధిరేటు’ శకానికి మాత్రమే తీసుకువెళతాయి. రాబోయే ఐదు సంవత్సరాలలో భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు సగటున 4.5 శాతంగా మాత్రమే ఉండగలదని ఆక్స్‌ఫర్డ్ ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికైనా మనం మేల్కొని తీరాలి.



పి. చిదంబరం(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)


Updated Date - 2020-11-28T06:39:18+05:30 IST