అసత్యాలతో వండివార్చిన ప్రగతి

ABN , First Publish Date - 2022-07-16T07:02:11+05:30 IST

ప్రభుత్వాలు ఉన్నదానికి కాస్తంత ఎక్కువచేసి చెప్పుకోవడం సహజమే. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేనిదానిని..

అసత్యాలతో వండివార్చిన ప్రగతి

ప్రభుత్వాలు ఉన్నదానికి కాస్తంత ఎక్కువచేసి చెప్పుకోవడం సహజమే. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం లేనిదానిని ఉన్నట్టుగా, జరగనిదానిని జరిగినట్టుగా చూపుతూ అందరినీ మించిపోయింది. నిజాన్ని ఒప్పుకోవడం, లోపాలను అంగీకరించకపోవడం వంటి లక్షణాలు అస్సలు కనిపించవు. ఇక, సరిదిద్దుకోవడమన్నది లేనేలేదు.


నిజంనిగ్గుతేల్చడం నిజానికి ఎంతో కష్టం. దానికి ఎటువంటి పక్షపాతాలూ లేని మెదడు కావాలి, విస్తృతమైన అధ్యయనం కావాలి, పరిశోధనాశక్తి ఉండాలి, అన్నిటికీ మించి విశ్వసనీయత కూడా ఉండాలి. నిజం విప్పడం అంటే అతిముఖ్యమైన అబద్ధాలను చూసీచూడనట్టుగా వదిలేసి, కొన్నిటిని మాత్రమే పట్టుకొని పేరుప్రతిష్ఠలు సంపాదించడం కూడా కాదు. ఒక పోలీసు అధికారి చేసే పనికీ, దీనికీ ఎంతో తేడా ఉంది. ఒక పెద్దరాళ్ళగుట్టలో నుంచి రత్నాన్ని వెతికిపట్టుకోవడమన్నంత కష్టమైన పని ఇది. నేనీ వ్యాసం రాస్తున్నప్పుడు నా ముందు ఎంతో అందంగా తీర్చిదిద్దిన చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రాలు ఉన్నాయి. వాటి మీద ఉన్న శీర్షికల సారాంశం ‘8 సంవత్సరాలు: సేవ, సమర్థపాలన, సంక్షేమం’. తమ ఎనిమిదేళ్ళ పాలన మీద నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాలు ఇవి. 2014నుంచి మే 2022 వరకూ మోదీ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తున్నాయి ఇవి. నా ఉద్దేశం ప్రకారం, ఒక రంగంలోనో, అంశంలోనో మనం విజయం సాధించామని ఎవరైనా అంటే, అది క్షేత్రస్థాయిలో వాస్తవం అయి ఉండాలి. ఎనిమిదేళ్ళ పాలనలో ఏమీ జరగలేదని ఎవరైనా వ్యాఖ్యానిస్తే, అటువంటి మాటలు సరికాదని చెబుతూంటాను నేను. ఏమీ జరగలేదు అన్నమాటే అర్థంలేనిది. ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు, అదీ చెప్పుకోదగినంతకాలం ప్రజలు పన్నులుగా చెల్లించిన కోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తూ ఏలినప్పుడు కచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. కనుక, దాని ఖాతాలో కొన్ని విజయాలు నమోదవడం సహజం. ఒక ప్రభుత్వం తనకు తానుగా, ఉద్దేశపూర్వకంగా చేటుచేయకుండా దేశాన్ని తన మానాన తనని నడవనిచ్చినా జీడీపీ అభివృద్ధి ఏటా 5 శాతం ఉంటుంది. ఎందుకంటే, ఈ దేశంలో వ్యవసాయం ప్రైవేటురంగంలో ఉంది, అత్యధిక సేవలు ప్రైవేటురంగంలో ఉన్నాయి, తయారీరంగంలోనూ ప్రైవేటు వాటాయే ఎక్కువ కనుక. అందువల్ల, ఒక పనిచేయని లేదా తక్కువ పనిచేసే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అది దేశానికి చేకూర్చగలిగే నష్టం పరిమాణం తక్కువే. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేటు చేయడం, అంటే నోట్లరద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్థికరంగం తీవ్రంగా దెబ్బతింటుంది.


మోదీ ప్రభుత్వం ఇలా చేజేతులా చేసిన పాపాల జాబితాలో ఇంకా అనేకం ఉన్నాయి. వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, లక్ష్యాల జోలికి నేను పోదల్చుకోలేదు. తప్పుడు విధానాలను ఆకాశానికి ఎత్తేయడం, వాటికి ఎంతో విలువనీ, గౌరవాన్ని ఆపాదించడం, వాటినే కొనసాగించడాన్ని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. పుట్టుకతోనే వైకల్యం ఉన్న మరో అంశం జీఎస్టీ. ఎన్నికల బాండ్లు మరింత దుర్మార్గమైనవి. పార్టీలకూ కార్పొరేట్ సంస్థలకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరిచాయి ఇవి. కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలను ప్రభావితం చేస్తాయి, ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తాయి. ఎన్నికలకు ముందు, తరువాత కూడా ఈ బాండ్ల బంధం దృఢంగా కొనసాగుతూనే ఉంటుంది. అగ్నిపథ్ మరో ప్రమాదకరమైన విధానం. అతిత్వరలోనే భారతీయ ఆర్మీ (నౌక, వైమానిక దళాలు కూడా) కాంట్రాక్టు సైన్యంగా మారిపోయి, పోరాటానికీ, దేశం కోసం ప్రాణాలొడ్డడానికీ సంకల్పం కరువైన శక్తిగా తయారవుతుంది. ఈ కరపత్రాల్లోనూ, చిరుపుస్తకాల్లోనూ ఉన్న అంశాల్లో నిజం ఏ మేరకు ఉంది? నిర్భయంగా నిస్సిగ్గుగా అసత్యాలతో, తప్పుడు వాదనలతో వాటిని నింపేశారనడానికి పెద్ద కష్టమేమీ పడనక్కరలేదు.


ఉదాహరణకు పీఎం ఆవాస్ (పట్టణ) యోజన పథకాన్నే తీసుకుందాం. ఈ ఏడాదికల్లా, అంటే 2022లోగా పట్టణ ప్రజలకు అందుబాటు ధరలో గృహవసతి కల్పించడం దాని ఉద్దేశం. ఆ శాఖ చెబుతున్న ప్రకారం, క్షేత్రస్థాయి అవసరాన్ని పూర్తిగా అంచనావేసిన తరువాత, కోటీపదిహేను లక్షల ఇళ్ళను మంజూరు చేయడం జరిగింది. వాటిలో 70లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తయితే 46 లక్షల ఇళ్ళను ఇప్పటికే లబ్ధిదారులకు అప్పగించారు. మరి నిజం ఏమిటి? పూర్తయిన ఇళ్ళు 58.59 లక్షలు మాత్రమే. ఈ పథకాన్ని మొన్న మార్చి తరువాత పొడిగించలేదు. అందువల్ల, పట్టణాలు, నగరాల్లోని నిరుపేద ప్రజలు ఆవాసానికి దూరంగా ఉండిపోవాల్సి వస్తున్నది. దేశంలో 99.99శాతం నివాసాలకు విద్యుదీకరణ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. నీతి ఆయోగ్‌తో కలసి స్మార్ట్ పవర్ ఇండియా చేసిన సర్వేలో నిజం వేరుగా ఉంది. దేశ జనాభాలో ఇంకా 13శాతం విద్యుత్ వినియోగానికి దూరంగానే ఉన్నారు. మ్యూనిచ్‌లో ప్రధానమంత్రి భారతదేశంలోని ప్రతీ గ్రామానికీ విద్యుత్ అందుబాటులోకి తెచ్చామని ప్రకటించిన నాడే మరో విచిత్రం జరిగింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ద్రౌపది ముర్ము స్వగ్రామానికి విద్యుత్ సమకూర్చేందుకు అధికారులు అప్పుడు తీగలు వేస్తున్నట్టు ఆ రోజే మీడియాలో వార్తలూ చిత్రాలూ వచ్చాయి. 2015–16 ఆర్థిక సంవత్సరం నాటికే దేశ జనాభాలో 88శాతం విద్యుత్ సౌకర్యం ఉన్న నివాసాల్లో ఉంటున్నట్టుగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తేల్చింది. మోదీ ప్రభుత్వం తన పదవీకాలంలో అదనంగా మరో 8.8శాతం పనిచేసింది. ఇప్పుడది 96.8శాతం మాత్రమే. దేశంలోని చాలా గ్రామాలకు, గూడేలకు విద్యుత్ ఇంకా చేరవలసి ఉందని చెప్పుకోవడంలోనూ ఒప్పుకోవడంలోనూ సిగ్గుపడాల్సిందేమీ లేదు.


బహిరంగ మలవిసర్జన నుంచి గ్రామీణభారతం పూర్తిగా విముక్తి చెందిందని ప్రభుత్వం చెబుతూంటుంది. 4371 నగరాలను ఈ విధంగా ప్రకటించినట్టు, పారిశుద్ధ్యం నూరుశాతం మెరుగుపడినట్టు, 11కోట్ల ఇళ్ళలో మరుగుదొడ్లు నిర్మించినట్టు ప్రభుత్వం లెక్కలు చెప్పింది. సౌత్ ఏషియన్ లేబర్ నెట్‌వర్క్ గత ఏడాది చేసిన సర్వే ప్రకారం భారత జనాభాలో 45 శాతం ఇంకా బహిరంగ విసర్జననే పాటిస్తున్నారు. మరో విషయం ఏమంటే, పన్నెండులక్షల మరుగుదొడ్లు ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇక, బహిరంగ మలవిసర్జనకు దూరమైన నగరాలంటూ ప్రభుత్వం ప్రకటించిన వాటిలో నిజానికి 1276 నగరాల్లోనే పూర్తిగా పనిచేస్తున్న, నీటిసదుపాయం ఉన్న మరుగుదొడ్లు ఉన్నాయి. పోషకాహారలోపం నుంచి 2022 కల్లా భారతదేశానికి విముక్తి అన్నది మరో చిరుపుస్తకం శీర్షిక. పోషకాహారాన్ని అందించడం లక్ష్యంగా మిషన్ ‘పోషణ్’ పనిచేస్తున్నది అన్నది వివరణ. పోషకాహారాన్ని సమకూర్చేందుకు ఒక లక్షా ఎనభై ఒక్కవేల కోట్లు కేటాయించారట. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మొత్తం 116 దేశాల్లో భారతదేశం 101వ స్థానంలో ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీమ్ మరో దుర్వార్త చెబుతోంది. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల్లో దాదాపు 57శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లల్లో 11శాతం మందికి మాత్రమే సమతుల్యమైన ఆహారం లభ్యమవుతోంది. తక్కువ బరువున్నవారు 32.1 శాతం, ఎదుగుదల ఆగిపోయినవారు 35.5శాతం అంటూ ఈ నివేదిక చాలా వివరాలు తెలియచేసింది.

ఈ చిరుపుస్తకాల్లో ప్రభుత్వం అతికొద్ది నిజాలు చెప్పింది, మరికొన్ని నిజానికి కాస్తంత దగ్గరగా, అతిశయోక్తికి వీలుగా ఉన్నాయి. కానీ, అత్యధికం గొప్పలే. ప్రభుత్వాలు ఉన్నదానికి కాస్తంత ఎక్కువచేసి చెప్పుకోవడం సహజమే. కానీ, ఈ ప్రభుత్వం లేనిదానిని కూడా ఉన్నట్టుగా, జరగనిదానిని జరిగినట్టుగా చూపుతూ అందరినీ మించిపోయింది. నిజాన్ని ఒప్పుకోవడం, లోపాలను అంగీకరించకపోవడం వంటి లక్షణాలు అస్సలు కనిపించవు. ఇక, సరిదిద్దుకోవడమన్నది లేనేలేదు.


(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-07-16T07:02:11+05:30 IST