రష్యా, ఉక్రెయిన్‌ వ్యవహారంలో ఒకే వైఖరితో భారత్‌, చైనా, పాక్‌ : నాగేశ్వర్‌

ABN , First Publish Date - 2022-03-06T17:29:13+05:30 IST

అంతర్జాతీయ వ్యవహార సూత్రాలను భారత్‌ సహా మిగతా దేశాలేవీ పాటించడంలేదని...

రష్యా, ఉక్రెయిన్‌ వ్యవహారంలో ఒకే వైఖరితో భారత్‌, చైనా, పాక్‌ : నాగేశ్వర్‌

హైదరాబాద్‌ సిటీ : అంతర్జాతీయ వ్యవహార సూత్రాలను భారత్‌ సహా మిగతా దేశాలేవీ పాటించడంలేదని మాజీ ఎమ్మెల్సీ, సామాజిక విశ్లేషకుడు ఆచార్య కె.నాగేశ్వర్‌ వ్యాఖ్యానించారు. బలప్రయోగం ద్వారా ఒక దేశ సరిహద్దును మార్చడమంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య ఘర్షణను అమెరికా అమితంగా కాంక్షిస్తుందని, ప్రస్తుత పరిస్థితి వల్ల అమెరికా వాణిజ్య, వ్యాపార వృద్ధి మరింత ముందుకు సాగనుందని వివరించారు. ‘‘ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో రష్యా తీరును ఐదు దేశాలు సమర్థిస్తే, 141 దేశాలు వ్యతిరేకించాయి. మరో 35దేశాలు తటస్థంగా ఉంటే, అందులో భారత్‌, చైనా, పాకిస్థాన్‌ ఒకే వైఖరి తీసుకోవడం విశేషమని’’ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో భారత్‌ డిప్లొమసీతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.


డా. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ‘సార్వత్రిక సామాజిక వేదిక’ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా ‘ఉక్రెయిన్‌ సంక్షోభం - పరిణామాలు, పర్యవసానాలు’ అంశంపై ఆచార్య నాగేశ్వర్‌తో కీలకోపన్యాసం నిర్వహించింది. అందులో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అరవై ఏళ్ల కిందట క్యూబా విషయంలో అమెరికాకు ఎదురైన పరిస్థితి ఇప్పుడు రష్యాకి తటస్థించిందని గుర్తుచేశారు. ‘‘నాటోలో చేరబోము అని ఉక్రెయిన్‌ రష్యాకి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని రష్యా గౌరవించాలి. ఉక్రెయిన్‌లో రష్యన్లు అధికంగా ఉన్న ప్రాంతాలకు ఆ దేశం స్వయంప్రతిపత్తి కల్పించాలి...అప్పుడే ఇరు దేశాల మధ్య సమస్య పరిష్కారానికి దారితీస్తుందని’’ నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు. బలప్రయోగం ద్వారా మరొక దేశాన్ని ఆక్రమించే సంస్కృతిని మాత్రం ఉపేక్షించకూడదన్నారు. కార్యక్రమంలో సార్వత్రిక సామాజిక వేదిక రూపకర్త ఆచార్య ఘంటా చక్రపాణి, టీ-శాట్‌ సీఈవో శైలేష్‌ రెడ్డి, ఓయూ విశ్రాంత ఆచార్యుడు చెన్నబసవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T17:29:13+05:30 IST