సంస్కరణల మహారథి మన్మోహన్

ABN , First Publish Date - 2020-11-21T05:51:58+05:30 IST

ప్రొఫెసర్ అరవింద్ పనాగరియ దృష్టిలో సంస్కరణల విజేతలు పీవీ నరసింహారావు, అటల్ బిహారి వాజపేయి మాత్రమే. నరేంద్ర మోదీ ఆ జెట్టీలకు సరిసమానుడని, డాక్టర్ మన్మోహన్ సింగ్ వారి కోవలోకి రారని అరవింద్ గట్టిగా వాదిస్తున్నారు....

సంస్కరణల మహారథి మన్మోహన్

ప్రొఫెసర్ అరవింద్ పనాగరియ దృష్టిలో సంస్కరణల విజేతలు పీవీ నరసింహారావు, అటల్ బిహారి వాజపేయి మాత్రమే. నరేంద్ర మోదీ ఆ జెట్టీలకు సరిసమానుడని, డాక్టర్ మన్మోహన్ సింగ్ వారి కోవలోకి రారని అరవింద్ గట్టిగా వాదిస్తున్నారు. అరవింద్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఆయన గురుతుల్యుడు ప్రొఫెసర్ జగదీష్ భగవతితో సహా ప్రపంచ ఆర్థికవేత్తలు అందరినీ దిగ్భ్రాంతి పరుస్తుందనడంలో సందేహం లేదు.


సంస్కరణలు, అభివృద్ధి అనే అంశంపై చర్చలో ప్రొఫెసర్ అరవింద్ పనాగరియ పాల్గొంటున్నందుకు నేను హర్షిస్తున్నాను. ఆయన వాదప్రతివాదాలు చేస్తున్న తీరు పట్ల మరింతగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాలమ్‌లో అక్టోబర్ 17న నేను రాసిన వ్యాసానికి సమాధానంగా ఆయన ‘డిఫెండింగ్ మోదీస్ రిఫార్మ్స్ రికార్డ్’అనే వ్యాసం రాశారు. ప్రొఫెసర్ అరవింద్ మేధో స్ఫూర్తితో, నాగరీకంగా చర్చను ముందుకు తీసుకువెళుతున్నారు. ఇందుకు నేను ఎంతగానో సంతసిస్తున్నాను.


నరేంద్ర మోదీ మద్దతుదారులు ఘనంగా చాటుకొంటున్న ఐదు సంస్కరణలను నేను నా వ్యాసంలో సునిశితంగా విశ్లేషించాను. ‘ఏ సంస్కరణ అయినా సరే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును అధికం చేసిందా లేదా, పెరుగుదలను వేగవంతం చేసిందా అన్నదే ఒక సంస్కరణకు అంతిమ పరీక్ష’ అన్న ముక్తాయింపుతో నా వ్యాసాన్ని ముగించాను. సంస్కరణలకు గీటురాయి ఏమిటనే విషయమై అదే నా నిశ్చితాభిప్రాయం. అరవింద్ అన్నట్టు నా వాదనలకు అనుగుణంగా చర్చ లక్ష్యాలు, ప్రమాణాలను నేను మార్చలేదు. 


సరే, ప్రొఫెసర్ అరవింద్ వాదనలోని ఒక ప్రధానాంశం– అత్యధిక సంస్కరణలను ఎవరు అమలుపరిచారు?– అన్నదానిపై దృష్టిని సారిద్దాం. ‘అత్యధిక’ అనే పరిమాణాత్మక విశేషణాన్ని గమనించండి. అరవింద్ దృష్టిలో సంస్కరణల విజేతలు పీవీ నరసింహారావు, అటల్ బిహారి వాజపేయి. నరేంద్ర మోదీ ఆ జెట్టీలకు సరిసమానుడని, డాక్టర్ మన్మోహన్ సింగ్ వారి కోవలోకి రారని అరవింద్ గట్టిగా వాదిస్తున్నారు! అరవింద్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ఆయన గురుతుల్యుడు ప్రొఫెసర్ జగదీష్ భగవతితో సహా ప్రపంచ ఆర్థికవేత్తలు అందరినీ దిగ్భ్రాంతి పరుస్తుందనడంలో సందేహం లేదు. 


ప్రొఫెసర్ అరవింద్ వాదన దృష్ట్యా ప్రతి ప్రధానమంత్రి హయాంలో అమలయిన సంస్కరణల జాబితాను మనం రూపొందించవలసి ఉంది. ఎవరు, ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టి, ఫలప్రదంగా అమలుపరిచారో కూడా మనం గణించితీరాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు సంస్కరణలను అమలుపరిచారని అరవింద్ స్వయంగా చెప్పారు కదా. వాటిని మరొకసారి మీకు గుర్తుచేస్తాను. దివాలా నియమావళి, వ్యవసాయ చట్టాలు, కార్మిక సంస్కరణలు, వైద్య విద్యా సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ. మోదీ అమలుపరిచిన సంస్కరణగా వస్తుసేవల పన్నును పేర్కొన్న ప్రొఫెసర్ అరవింద్ కారమణమేమటో గానీ డిమానిటైజేషన్ (నోట్లరద్దు)ను ప్రస్తావించలేదు. ఏమైనా జీఎస్టీ, నోట్లరద్దును కూడా మోదీ అమలుపరిచిన సంస్కరణల జాబితాతో చేర్చుదాం. ఇప్పుడు ఆ ‘సంస్కరణల’ సంఖ్య ఏడుకు పెరుగుతుంది.


‘నేషనల్ మెడికల్ కమిషన్’ ను ఏర్పాటు చేయడం అనేది వైద్యవిద్యలో సంస్కరణల కిందకు వస్తుందా అనే విషయమై నేను మళ్ళీ వాదప్రతివాదాలకు దిగదలచుకోలేదు. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ ఘనత పూర్తిగా నరేంద్రమోదీదేనా? ఆ సరళకరణను మోదీయే ప్రప్రథమంగా ప్రవేశపెట్టినట్టు మాట్లాడడం సబబేనా? గుర్తుంచుకోండి, సంస్కరణల సంఖ్యను మాత్రమే మనం ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నాం. వాటి నాణ్యత గురించి మనం మాట్లాడబోవడం లేదు. చెప్పవచ్చినదేమిటంటే మోదీ హయాంలో అమలయిన మొత్తం సంస్కరణల సంఖ్య అక్షరాలా ఏడు. 


ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాం (2004–-2014)లో అమలయిన సంస్కరణల గురించి సవివరంగా చూద్దాం. ముందుగా కొన్ని వాస్తవాలను స్పష్టం చేయదలిచాను. లక్ష్యం నెరవేరిన సంస్కరణల చర్యలను నేను పరిగణనలోకి తీసుకోబోవడం లేదు. ఇందుకొక ఉదాహరణ బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. బ్యాంకుల నుంచి పెద్దఎత్తున నగదు ఉపసంహరణ లేదా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ గురించి కచ్చితంగా తెలిపే చర్య ఇది. అలాగే ‘నేషనల్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్ నెస్ కౌన్సిల్’, ‘ఇన్వెస్ట్ మెంట్ కమిషన్’ ఏర్పాటు ను కూడా నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇవి ప్రధానంగా వ్యక్తి- కేంద్రిత సంస్థలు. యూపీఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు ఇప్పుడు వేరే పేర్లతో అమలవుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నాను. దీర్ఘాయుర్దాయం, మన్నిక పరీక్షల ప్రాతిపదికన వివిధ సంస్కరణలను పరిగణనలోకి తీసుకున్నాను. 


పీవీ నరసింహారావు హయాంలో 5.1 శాతం, వాజపేయి హయాంలో 5.9 శాతం, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో 7.7 శాతం, నరేంద్ర మోదీ హయాంలో 8.8 శాతం వృద్ధిరేటుతో మన ఆర్థికవ్యవస్థ పురోగమించిందని ప్రొఫెసర్ అరవింద్ పేర్కొన్నారు. ఈ జీడీపీ వృద్ధిరేట్లను నేను అంగీకరిస్తున్నాను. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే మొత్తం పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయిన తరువాత ఇంతవరకు అత్యధికకాలం ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరు మాత్రమే. మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించి తీరాలి. ఆ విషయాన్ని పేర్కొనకపోతే మన్మోహన్కు న్యాయం చేయనివారమవుతాం. ఎందుకంటే ప్రధానమంత్రి నరసింహారావు హయాంలో ప్రారంభించిన, అమలుపరిచిన కొన్ని ముఖ్య సంస్కరణలకు ప్రధాన కారకుడుగా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్‌నే చెప్పి తీరాలి. 


ఇదిగో, 2004–-14 సంవత్సరాల మధ్య అమలయిన ఆర్థిక సంస్కరణల జాబితా. ఇది పరిమిత జాబితానే సుమా. 26 సంస్కరణలను మాత్రమే పేర్కొంటున్నాను. అవి: వ్యాట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆధార్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డిబిటి), ‘నో ఫ్రిల్స్’ లేక ‘జీరో బ్యాలెన్స్’ బ్యాంక్ అకౌంట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ, విద్యాహక్కు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఆశా), నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్, నేషనల్ హార్టికల్చర్ మిషన్, వాతావరణ పరిస్థితుల ప్రాతిపదికన పంటల బీమా, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల సంస్కరణలపై నమూనా చట్టం; నేషనల్ స్కిల్ డెవలెప్ మెంట్ మిషన్ అండ్ కార్పొరేషన్, సకల వస్తు సేవలపై సెన్వాట్, సెక్యూరిటీలపై లాంగ్‌టర్మ్ కేపిటల్ గెయిన్స్ రద్దు; ఎస్‌టిటి, కిరాణా వ్యాపారరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, బొగ్గుగనుల తవ్వకాలలో ప్రైవేట్ కంపెనీలకు అనుమతి, పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీల రద్దు, జెండర్ బడ్జెట్, డిమ్యూటలైజేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్ఛేంజెస్, పిఎఫ్‌ఆర్‌డిఏ చట్టం, కంపెనీల చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, న్యాయబద్ధమైన నష్టపరిహార హక్కు చట్టం, అటవీహక్కుల చట్టం.


ప్రొఫెసర్ అరవింద్ గారూ, మీరు ఆరాధించే ప్రధానమంత్రి అమలుపరిచిన సంస్కరణలు స్వీయ రాజకీయ ప్రయోజనాలకే తోడ్పడ్డాయి. వాటి గురించి ఆత్మస్తుతి చేసుకుంటున్నారు. మా పార్టీ ప్రభుత్వాలు అమలుపరిచిన సంస్కరణలు ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చాయి. భావితరాల శ్రేయస్సుకు విశేషంగా దోహదం చేశాయి. ప్రజలే సత్య నిర్ణేతలు.




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-11-21T05:51:58+05:30 IST