‘జీహెచ్‌ఎంసీ’వ్యూహంతోనే ముందుకు

ABN , First Publish Date - 2021-04-17T08:14:22+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ.. అప్పుడు అనుసరించిన వ్యూహాన్నే త్వరలో జరగనున్న కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అమలు చేస్తోంది.

‘జీహెచ్‌ఎంసీ’వ్యూహంతోనే ముందుకు

  • ‘జీహెచ్‌ఎంసీ’వ్యూహంతోనే ముందుకు
  • ఆ రెండు కార్పొరేషన్లలో బీజేపీ ఇన్‌చార్జీల నియామకం
  • మునిసిపాలిటీలకు సైతం ఇన్‌చార్జీలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ.. అప్పుడు అనుసరించిన వ్యూహాన్నే త్వరలో జరగనున్న కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అమలు చేస్తోంది. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, మరో 5 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా.. అఽభ్యర్థుల ఎంపిక, స్థానికంగా ప్రచార బాధ్యతలను కమిటీలు, ఇన్‌చార్జీలకు అప్పగించనుంది. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ)కు పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఖమ్మం కార్పొరేషన్‌కు మరో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిని ఇన్‌చార్జీలుగా నియమించింది. సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌ మునిసిపాలిటీలకు కూడా నేడో రేపో ఇన్‌చార్జీలను పార్టీ ప్రకటించనుంది. మరోవైపు కార్పొరేటర్లు, వార్డు సభ్యుల అభ్యర్థిత్వాల ఖరారుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తోంది. దీంతో పాటు వార్డులు, డివిజన్లలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు సంబంధించి పార్టీ అంతర్గత సర్వే నిర్వహించింది. సర్వే నివేదికలు, కమిటీల సిఫారసు మేరకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. 


ఎన్నికలు అవసరమా?: డీకే అరుణ 

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాఽధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆరోపించారు. ఇంత జరుగుతున్న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష జరపకపోవడం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో విమర్శించారు. కరోనా ఉధృతమవుతున్న ఈ సమయంలో మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని సీఎంను ప్రశ్నించారు. కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-04-17T08:14:22+05:30 IST