బంగాళ దుంపల చిప్స్‌ను ఎక్కువగా తింటున్నారా..

ABN , First Publish Date - 2020-03-20T18:18:28+05:30 IST

ఎవరైనా వంట చేసేటప్పుడు రుచిగా ఉండాలని భావిస్తారు. అయితే పొరపాటున చేసిన పనులే అద్భుత వంటకాలుగా ప్రపంచ ప్రసిద్ధి చెందాయంటే నమ్మక తప్పదు.

బంగాళ దుంపల చిప్స్‌ను ఎక్కువగా తింటున్నారా..

పొరపాట్లే అద్భుత రుచులు 


ఎవరైనా వంట చేసేటప్పుడు రుచిగా ఉండాలని భావిస్తారు. అయితే పొరపాటున చేసిన పనులే అద్భుత  వంటకాలుగా ప్రపంచ ప్రసిద్ధి చెందాయంటే నమ్మక తప్పదు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, కోట్లాది మంది జిహ్వను సంతృప్తి పరుస్తున్న ఆలూ చిప్స్‌, కోకాకోలా, కార్న్‌ ఫ్లేక్స్‌, షాంపైన్‌, ఐస్‌ క్రీం కోన్లు ఆ కోవకి చెందినవే. అలా పొరపాటున కనుగొన్న ప్రపంచంలోని ఆరు అద్భుత రుచుల గురించి తెలుసుకుందాం.


ఎవరైనా ఏదైనా వస్తువును కనుగొనేందుకు పరిశోధనల పేరుతో జీవితాలను అంకితం చేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు ఐన్‌స్టీన్‌, ఎడిసన్‌ వంటి వారు కనుగొన్న వాటికోసం ఏళ్ళ తరబడి పరిశోధనలు చేసి అనేక సార్లు విఫలమై చివరకు విజయం సాధించారు. అలాగే ఆహారాన్ని కనుగొనేందుకు కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఆ తర్వాత కూడా వాటి రుచికి మరింత ఘుమఘుమలు చేర్చేందుకు నిరంతరం ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. నిత్యం కొత్త పదార్థాలను, దినుసులను కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త రుచులకు రూపకల్పన చేసే ప్రక్రియలో ఆహార పరిశ్రమ ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తోంది. ఈ క్రమంలోనే ఖాతాదారులను సంతోషపెట్టాలనే తాపత్రయంలో కొందరు పాకశాస్త్ర నిపుణులు (చెఫ్‌లు) చేసిన పొరపాట్లు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రుచులుగా మారాయి. ఇప్పుడు  ఆ అద్భుత రుచులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కూడా కష్టమనిమిస్తుంది.

 

ఆలూ చిప్స్‌

బంగాళ దుంపల చిప్స్‌ను చిన్నాపెద్దా అందరూ ఇష్టపడతారనడం అతిశయోక్తి కానేకాదు. తొలుత వీటిని 1853లో  న్యూయార్క్‌ సారటొగా స్ప్రింగ్‌ ప్రాంతంలోని మూన్‌ లేక్‌ లాడ్జ్‌కి చెందిన ప్రధాన చెఫ్‌ జార్జి క్రమ్‌ కనుగొన్నాడు. వేపుళ్ళకు ప్రసిద్ధి చెందిన ఆ రెస్టారెంట్‌లో ఒక రోజు ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు. సర్వ్‌ చేసిన వేపుడు సైజు చాలా మందంగా ఉందనేది ఫిర్యాదు సారాంశం. దీంతో మన చెఫ్‌ జార్జి మరికొంత పల్చగా ముక్కలు చేసి వేపుడు అందించినా ఆ ఖాతాదారుడు సణుగుడు మానలేదు. దీంతో నిరాశ చెందిన జార్జి బంగాళ దుంపలను సాధ్యమైనంత పల్చగా తరిగి నూనెలో వేయించి ఉప్పు, మిరియాల పొడి చల్లి అందించాడు. అంతే వాటి రుచిని ఆస్వాదించిన ఆ కష్టమర్‌ వెంటనే జార్జిని ఆలింగనం చేసుకుని అభినందించాడు.  అలా ఆ ఖాతాదారుడే కాదు ప్రపంచమంతా ఇష్టపడే ఉత్తమ స్నాక్‌గా ఆలూ చిప్స్‌ ప్రసిద్ధిగాంచింది.


కొకాకోలా

మాదక ద్రవ్యం కొకైన్‌కు ప్రత్యామ్నాయం కోసం చేస్తున్న పరిశోధనల్లో భాగంగా జాన్‌ పెంబర్టన్‌ కొకాకోలాను కనుగొన్నాడు. ఫార్మాసిస్ట్‌, సైనికుడు అయిన జాన్‌ కొలంబస్‌ యుద్ధంలో పాల్గొని గాయపడ్డ తర్వాత మార్ఫిన్‌కు అలవాటు పడ్డాడు. దాని నుంచి బయటపడేందుకు తన సొంత ఫార్మసీలో అనేక పరిశోధనలు చేస్తూ స్వల్ప పరిమాణంలో కొకైన్‌తో పాటు కెఫిన్‌ సమృద్ధిగా ఉండే కోల గింజలతో ఒక టానిక్‌ను (పానీయాన్ని) రూపొందించాడు. దాని తయారీ లైసెన్సును ఆశా కేండ్లర్‌ అనే మరో  ఫార్మాసిస్ట్‌ 2,300 డాలర్లకు కొనుగోలు చేసి బుడగలు వచ్చేందుకు సోడా కలిపాడు. దీంతో 1890 నాటికి కొకాకోలా అమెరికాలో  అత్యంత ఇష్టపడే ఫౌంటేన్‌ డ్రింక్‌గా ప్రసిద్ధిగాంచింది.

 

పాప్సికల్స్‌ (పుల్ల ఐసు)

పాప్సికల్స్‌ పాప్‌ అనేది క్యాలిఫోర్నియాకు చెందిన పదొకొండేళ్ళ బాలుడి సృష్ఠి.  ఫ్రాంక్‌ ఎప్పర్‌సన్‌ 1905లో ఓ సాయంత్రం వేళ సోడా తయరీ పరికరాలతో వాకిటి గుమ్మం వద్ద మూడు రకాం పండ్ల రసాల మధ్య ఒక పుల్లను ఉంచి మర్చిపోయాడు. ఉదయం లేచి చూడగానే అది గడ్డకట్టి పుల్ల ఐస్‌ మాదిరిగా తయారైంది. దాని రుచి అద్భుతంగా ఉంది. దీంతో అదే మాదిరికగా పాప్సికల్స్‌ను తయారు చేసిచుట్టుపక్కల ఉండే స్నేహితులకు ఇచ్చాడు అందరూ మెచ్చుకోవడంతో ఫ్రాంక్‌ ఆనందం పట్టలేకపోయాడు. పదిహేడేళ్ళ తర్వాతా పాప్సికల్స్‌కు పేటెంట్‌ హక్కు తీసుకుని పెద్ద ఎత్తున తయారీ చేపట్టాడు. అలా అది ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడే ట్రీట్‌గా మారింది.


షాంపైన్‌

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన పానీయం షాంపైన్‌ సృష్టికర్త ఎవరనేది స్పష్టంగా తెలియకపోయినా, 1490లో దీనిని కనుగొన్నట్లు తెలిసింది. వైన్‌ను పులియబెట్టే క్రమంలో బుడగలు వచ్చాయి. ఇది ఆశించని సంకేతం. షాంపైన్‌ తయారీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. పులియబేట్టే ప్రక్రియ రెట్టింపై మరింత వేగంగా బుడగలు రావడం మొదలైంది. దీంతో బుడగలు పెరిగిపోయి సీసాల్లో ఉన్న షాంపైన్‌ కార్కులను (బిరడాలను) ఎగదోసి బయటకు చిమ్మింది. సిసాలు పగిలిపోయాయి. ఒక స్థాయిలో బుగడలను నియంత్రించిన తర్వాత ఆ ఉత్పత్తులు బయటకు వచ్చాయి. అలా అందరి ఆదరణ పొందిన షాంపైన్‌ ప్రసిద్ధిగాంచింది.


కార్న్‌ ఫ్లేక్స్‌

కెల్లోగ్‌ సోదరుల్లో ఒకడైన విల్‌ కెల్లోగ్‌ కార్న్‌ ఫ్లేక్స్‌ (మొక్కజొన్న రేకులు)ను కనుగొన్నాడు. రోగులకు 1900ల్లో ధాన్యంతో తయారు చేసే ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం విల్‌ కెల్లోగ్‌, హార్వీ కెల్లోగ్‌లు గోధుమ గింజలతో పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో విల్‌ కెల్లోక్‌ గోధుమలకు బదులు మొక్కజొన్న గింజలను గ్రైండ్‌ చేయడంతో అవి ఫ్లేక్స్‌ (రేకులు)గా మారాయి. విల్‌ వాటిని పాలలో చేర్చి రోగులకు ఆరోగ్యకరమైన అల్పాహారంగా అందించాడు. క్రమంగా ఆ కార్న్‌ ఫేక్స్‌ ఉత్తమ బ్రేక్‌ ఫాస్ట్‌ గా ప్రపంచానికి పరిచయం అయింది.


ఐస్‌క్రీం కోన్లు

తోటి వాడికి సహాయంగా చేసిన పనే ఐస్‌ క్రీం కోన్లు ప్రసిద్ధిగాంచాయి. సెయింట్‌ లూయీస్‌ వరల్డ్‌ ఫెయిర్‌లో ఎర్నెస్ట్‌  హామ్వి జలాబీస్‌ అనే పేస్ర్టీలను విక్రయిస్తున్నాడు. అతని పక్కన ఐస్‌ క్రీం విక్రయించే మిత్రుడి వద్ద ప్లేట్లు అయిపోయాయి. దీంతో ఎర్నెస్‌ తన వద్ద ఉన్న జలాబీలతో కోన్లను తయారు చేసి వాటిలో ఐస్‌ క్రీం పెట్టి ఇచ్చేలా చేశాడు. అంతే కోన్‌ ఐస్‌ క్రీం సూపర్‌ హిట్టయింది. ఇప్పుడు కోన్‌ లేకుండా ఐస్‌ క్రీం అంటే అసంపూర్తిగా తినడమనే భావన కలుగుతుంది..


– ఎన్‌. మృదులలిత



Updated Date - 2020-03-20T18:18:28+05:30 IST