Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుండెకు గండం

ఆంధ్రజ్యోతి(05-01-2020)

కొవిడ్‌ ప్రభావం గుండె మీద ఎక్కువే!

కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా  

ఆ మహమ్మారి గుండె ఆరోగ్యాన్ని ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంది.

కాబట్టి గుండె ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి!


సాధారణ వైరల్‌ ఫీవర్‌ వచ్చినా, అది తగ్గిన తర్వాత కూడా కొంత కాలం పాటు అలసట, బలహీనతలు కొనసాగుతాయి. కరోనా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అయితే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించుకుని పూర్తి శక్తి పుంజుకునేందుకు పడుతున్న సమయాన్ని మనందరం ‘లాంగ్‌ కొవిడ్‌’ అంటున్నాం. అయితే కొవిడ్‌ విషయంలో.... వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత నీరసం, ఒళ్లునొప్పులు, జలుబు, దగ్గు లాంటి స్వల్ప ఇబ్బందులతోపాటు గుండె ఆరోగ్యం కూడా ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్వపు గుండె సమస్యలు తీవ్రమవడం లేదా కొత్తగా గుండె సమస్యలు తలెత్తడం లాంటివీ జరుగుతాయి. కాబట్టి గుండె ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచి, గుండెను పదిలంగా ఉంచే చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి. 


కొవిడ్‌ - గుండె సమస్యలు

‘లాంగ్‌ కొవిడ్‌’లో ప్రత్యేకంగా గుండెకు సంబంధించి కొన్ని పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అవేమిటంటే....


ఎటువంటి గుండె సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండెపోటుకు గురవడం

పూర్వం ఎటువంటి గుండె సమస్యలు లేనివాళ్లకు గుండె సమస్యలు తలెత్తడం

యుక్తవయసులోనే గుండెపోటు రావడం

పూర్వం స్థిరంగా ఉన్న గుండె సమస్యలు ‘లాంగ్‌ కొవిడ్‌’ కాలంలో తీవ్రమవడం

సమస్య ఉన్నప్పటికీ పూర్వం సక్రమంగానే ఉన్న గుండె పనితీరు ‘లాంగ్‌ కొవిడ్‌’లో సన్నగిల్లడం

గుండె రక్తనాళాల్లో అడ్డంకుల శాతం పెరగడం

పూర్వం రక్తనాళాల్లో అడ్డంకులు లేనివాళ్లకు కొత్తగా అడ్డంకులు ఏర్పడడం

గుండెకు రక్త సరఫరా బలహీనత కలిగి ఉన్న వాళ్లలో ఆ సమస్య మరింత తీవ్రమవడం


జాగ్రత్తలు ఇవే!

కొవిడ్‌ సోకినా, సోకకపోయినా గుండె నిక్షేపంగా ఉండాలంటే, కొవిడ్‌ సోకే అవకాశాలను పెంచే వీలున్న రుగ్మతలను అదుపులో ఉంచుకోవాలి. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌లను సమంగా ఉంచుకోవాలి. అందుకు వాడే మందులను, చేయించుకోవలసిన పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా కొవిడ్‌ సోకుతుందనే భయంతో సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని వాయిదా వేయకూడదు. కొవిడ్‌ పాండమిక్‌లో గుండెజబ్బుల మరణాలు పెరగడానికి కారణం సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోకపోవడమే! ఆస్పత్రికి వచ్చినంత మాత్రాన కొవిడ్‌ సోకదు. ఇన్‌ఫెక్షన్‌ను అడ్డుకునే జాగ్రత్తలు పాటించకపోవడం (మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరం పాటించడం) వల్లనే కొవిడ్‌ సోకుతుందనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే....


వైద్యులు సూచించే మందులు క్రమం తప్పక వాడాలి.

గుండె జబ్బులు ఉన్నవాళ్లు హృద్రోగ నిపుణులను సంప్రతిస్తూ, వారి సూచన ప్రకారం నడుచుకోవాలి.

ఏ కొత్త లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు‘లాంగ్‌ కొవిడ్‌’ సమయంలో ఏ చిన్న లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు...


ఆయాసం

గుండె నొప్పి

గుండె దడ

కళ్లు తిరగడం

బరువు తగ్గడం లేదా పెరగడం


శరీరం శక్తిమంతం

కరోనా వైరస్‌తో పోరాడి అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పూర్తిగా పుంజుకునేం దుకు సమయం ఇవ్వాలి. అందుకోసం కంటి నిండా నిద్ర, సమతులాహారం, మానసిక ప్రశాంతత అవసరం. 


ఆహారం: ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవాలి. పాలిష్‌ పట్టని పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు తినాలి. ఆహారంలో చక్కెర తగ్గించాలి. జంక్‌ఫుడ్‌ మానేయాలి. పాలిష్‌ పట్టిన బియ్యం బదులు, జొన్నలు, సజ్జలు లాంటి కాంప్లెక్స్‌డ్‌ కార్బొహైడ్రేట్లు ఉండే పదార్థాలు ఎంచుకోవాలి. 


నిద్ర: రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.


ఒత్తిడి: ఒత్తిడితో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది. ఫలితంగా కొవిడ్‌ నుంచి కోలుకునే వేగం తగ్గుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం లేదా యోగా చేయడం, పుస్తకాలు చదవడం, కుటుంబసభ్యులతో సరదాగా గడపడం లాంటి పనులు ఎంచుకోవచ్చు. యోగాతో కొవిడ్‌ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు.


దురలవాట్లు: ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.


మద్యంతో చేటే

పరిమిత ఆల్కహాల్‌ గుండెకు మేలు చేస్తుందనేది అపోహ మాత్రమే! మరీ ముఖ్యంగా భారతీయుల విషయంలో మద్యపానం గుండెకు చేటు చేస్తుందని అధ్యయనాల్లో సైతం రుజువైంది. 


తేలికైన వ్యాయామం

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత, త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులం అయిపోవాలనే ఆలోచనతో విపరీతంగా వ్యాయామం చేయడం సరికాదు. శరీరం వ్యాధి ప్రభావం నుంచి కోలుకునే సమయాన్ని తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టాలి. ప్రారంభంలో రోజుకు 30 నిమిషాల నడక సరిపోతుంది. క్రమేపీ వ్యాయామ సమయాన్ని పెంచుకోవచ్చు. అలాగనీ శక్తికి మించి వ్యాయామం చేయకూడదు.


గుండె బలంగా ఉండాలంటే...


జన్యుపరంగా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోవకు చెందినవారు రెట్టింపు అప్రమత్తంగా ఉండాలి.


25 ఏళ్ల వయసు నుంచీ ఏడాదికోసారి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.


మధుమేహం, రక్తపోటు, కొలెస్ర్టాల్‌లు రాకుండా చూసుకోవాలి. వాటిని అదుపులో ఉంచుకోవాలి.


ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి.


దురలవాట్లకు దూరంగా ఉండాలి. 


క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌

ఒక వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత కొనసాగే శరీర బలహీనతను ‘క్రానిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌’గా పరిగణిస్తూ ఉంటాం. సాధారణ ఇన్‌ఫ్లూయొంజా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినా, వైరల్‌ ఫీవర్‌ వచ్చినా, అవి తగ్గిన తర్వాత కూడా కొంతకాలం పాటు పోస్ట్‌ వైరల్‌ సిండ్రోమ్‌ కొనసాగుతుంది. కండరాల నొప్పులు, నీరసం, అలసట, పూర్వం సునాయాసంగా చేయగలిగిన చిన్న పనులు కూడా చేయలేకపోవడం లాంటి ఇబ్బందులు కొంతకాలం పాటు వేధిస్తాయి. ఇదే పరిస్థితి కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా కనిపించవచ్చు. దీన్నే పోస్ట్‌ కొవిడ్‌, లాంగ్‌ కొవిడ్‌, డిలేయ్‌డ్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ కొవిడ్‌ అనే పేర్లతో పిలుస్తున్నాం.


ఎత్తు, నడుము చుట్టుకొలత

శరీర బరువు మీదే కాదు, ఆకారం మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా నడుము చుట్టు కొలత శరీర ఎత్తులో సగం కంటే తక్కువ ఉండాలి. ఎత్తు 162 సెంటీమీటర్లు ఉంటే, నడుము చుట్టకొలత 80 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఐదు సెంటీమీటర్లు పెరిగినా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.


డాక్టర్‌ వరద రాజశేఖర్‌

సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎలకో్ట్రఫిజియాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌.


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...