కష్టాల శిఖరాన..!

ABN , First Publish Date - 2021-03-02T06:28:08+05:30 IST

దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. ఎక్కి దిగేవారికే గతుకులు తెలుస్తాయి.

కష్టాల శిఖరాన..!

బెజవాడ కొండలపై బతుకు ‘బితుకు’

వర్షాకాలంలో బండరాళ్లు

వేసవిలో విషసర్పాలు

అడుగడుగునా కష్టాలే

‘రక్షణ’ గోడ.. గోడే

‘ఘాట్‌ రోడ్డు’నూ మరిచారు


దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. ఎక్కి దిగేవారికే గతుకులు తెలుస్తాయి. కింద నుంచి చూస్తే పచ్చదనం పరుచుకున్న కొండ శిఖరం నయన మనోహరంగానే ఉంటుంది. పైనున్నవారికే ఆ పచ్చని పొదల మాటున ఏ విషసర్పం పొంచి ఉంటుందో.. శిఖరంపై నుంచి ఏ బండరాయి ఎప్పుడు దొర్లుతుందోనని భయం. తలదాచుకునేందుకు జానెడు జాగా దొరికిందన్న సంతోషమే కొండ ప్రాంత ప్రజలు అన్ని భయాలనూ జయించేలా చేస్తోంది. వీరి సమస్యలకు పరిష్కారం ఉన్నా, పాలకుల వాగ్దానాలకే పరిమితం. ఎందరు పాలకులు మారినా మారనిదొక్కటే.. అది విజయవాడ కొండప్రాంత ప్రజల జీవనమే. నగరానికి అందాలను సంతరింపజేసే కొండలపై బండబారిపోతున్న బతుకుల్లోకి ‘ఆంధ్రజ్యోతి’ తొంగిచూసింది. వారి జీవనచిత్రమే ఈ ప్రత్యేక కథనం.


ఆంధ్రజ్యోతి - విజయవాడ : విజయవాడ నగరంలో మొత్తం డివిజన్లు 64. వాటిలో 29 డివిజన్లు మిగిలిన వాటికంటే ప్రత్యేకం. ఇక్కడి ప్రజలు ఉదయం గడప దాటితే సాయంత్రానికే మళ్లీ గూటికి చేరేది. వేసవి వస్తే చుట్టుముట్టే తాగునీటి కష్టాలు.. చుట్టూ పొంచి ఉండే విషసర్పాలు.. వర్షాకాలంలో ఏ బండ రాయి వచ్చి మీద పడుతుందోనని భయం. అక్కడి ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు రాలతాయి. 


సమస్యలతో సహజీవనం

నగరంలో చిట్టినగర్‌, మిల్క్‌ప్రాజెక్టు, చెరువుగట్టు సెంటర్‌, మల్లికార్జునపేట, గుణదల, మాచవరం, మొగల్రాజపురం ప్రాంతాల పేర్లు చెప్తే గుర్తుకువచ్చేది కొండప్రాంతాలే. ఈ కొండలపై కొందరు శాశ్వత నివాసాలను ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. ఇంకొందరు పేదలు, ప్రైవేటు ఉద్యోగులు ఇక్కడ అద్దెలు తక్కువగా ఉండడంతో అద్దెలకు నివాసం ఉంటున్నారు. ఈప్రాంత ప్రజల జీవనం కొండలంత కఠినంగా ఉంటుంది. అవసరం చిన్నదైనా, పెద్దదైనా అందరూ కొండ దిగి ఎక్కాల్సిందే. 


ఈశాన్యం’లా ఆలోచిస్తే...

దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో విజయవాడ ఒకటి. నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు. జనాభా 12లక్షలు. నగరానికి ఒక వైపున రైల్వేస్టేషన్‌, మరోవైపున కృష్ణానది, ఇంకోవైపున కొండ ప్రాంతం. ఈ మూడింటి మధ్యనే జనాభా మొత్తం ఇరుక్కుపోయింది. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు విస్తరించే అవకాశం లేదు. విజయవాడలో కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మాణానికి పునాదులు పడినప్పుడే కొండ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మొదల య్యాయి. ఇక్కడ పనులకు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కూలీలు పాతబస్తీ కొండ ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఉపాధి కోసం వస్తున్న వారంతా ఈ ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించుకుంటూ వచ్చారు. దీంతో ఈ ప్రాంతాల్లో జనావాసాలు పెరిగిపోయాయి. ఈశాన్య రాష్ట్రాల్లో నివాసాలన్నీ కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ మౌలికవసతుల కల్పనకు ప్యాకేజీని కేటాయిస్తారు. ఇక్కడ కూడా అలాగే మౌలిక వసతులను కల్పిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.


వేసవిలో పాములు.. వానల్లో బండలు..  

కొండ ప్రాంతాల్లో కింది నుంచి పైవరకు ఇళ్లు పేర్చినట్టు కనిపిస్తాయి. పైభాగం అంతటా చెట్లు, పొదలు. వర్షాకాలంలో విరామం లేకుండా వర్షాలు కురిస్తే, కొండలపై ఉండే మట్టి కిందికి కొట్టుకుని వచ్చేస్తుంది. బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఇళ్లపై పడతాయి. ఏ బండరాయి ఎప్పుడు ఎటువంటి ప్రమాదాన్ని మోసుకొస్తుందో ఊహించలేం. కొన్ని కుటుంబాలకు కుటుంబాలు ఆ బండరాళ్ల కింద సమాధైన దుర్ఘటనలెన్నో. అందుకే వర్షాకాలంలో కొండప్రాంతవాసులు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని గడుపుతారు. ఇక వేసవి వస్తే విషసర్పాల భయం వెంటాడుతుంది. వర్షాకాలంలో ఏపుగా ఎదిగిన మొక్కలు, పొదలు వేసవిలో ఎండిపోతాయి. కొండరాళ్లు వేడెక్కుతాయి. దీంతో పైన ఉండే విషసర్పాలు దిగువ ఉన్న ఇళ్లలోకి వచ్చేస్తాయి. 


సైడైపోయిన ‘రిటైనింగ్‌’

బండరాళ్లు జారిపడకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలని ఒకనాడు నిర్ణయించారు. ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. ఇందుకు రూ.15-30 లక్షల వ్యయం అవుతుందని అంచనా. అంచనాలు పెరుగుతున్నాయి. ప్రాజెక్టును పూర్తి చేయడం తమ వల్ల కాదని అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రత్యామ్నాయంగా ప్రమాద ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలి స్తామన్నారు. దీనికి ఆ ఇళ్ల యజమానులు అంగీకరించడం లేదు. 


వేసవిలో నీటి కష్టాలు

కొండ ప్రాంత వాసులను వేసవిలో తీవ్రంగా వేధించే సమస్య తాగునీరు. తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో మేజర్‌ వాటర్‌ ట్యాంక్‌లు ఉన్నాయి. పశ్చిమంలో ఆ సౌకర్యం లేదు. వేసవిలో పైపులైన్ల నుంచి నీరు పైకి ఎక్కదు. బ్లూస్టర్లను ఉపయోగించినా, ఒక్కోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఆ సమయంలో పైనుంచి మహిళలు బిందెలతో కిందికి దిగివచ్చి వచ్చి, నీళ్లు పట్టుకువెళ్లాల్సి ఉంటుంది. అటువంటప్పుడు వాళ్లకు ప్రత్యక్ష నరకమే కనిపిస్తుంది.


కనీస అవసరాలకు దూరం

కొండప్రాంతంలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ లేవు. ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే, వారిని కొండ కిందకు మోసుకురావలసిందే. మినీ సూపర్‌మార్కెట్లు, పాలు, కూరగాయలు సైతం ఇక్కడ కనిపించవు. 


ఘాట్‌ రోడ్డు ఏమైపోయింది

కొండ ప్రాంత ప్రజల ఇబ్బందులను కొంత వరకు తగ్గించడానికి ఒక ఘాట్‌ రోడ్డును నిర్మించాలని గతంలో ఒక ప్రతిపాదన చేశారు. ఆ తరువాత దానినీ మరచిపోయారు. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుకు అనుబంధంగా వన్‌టౌన్‌లోని మల్లికార్జునపేట నుంచి చిట్టినగర్‌ కొండను చేరుకునేలా ఒక ఘాట్‌ రోడ్డును నిర్మించాలన్నది ఆ ప్రతిపాదన. ఈ రహదారి అందుబాటులోకి వస్తే భారీ వాహనాలు సైతం కొండలపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. 


‘ఈశాన్యం’లా ఆలోచిస్తే...

దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో విజయవాడ ఒకటి. నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు. జనాభా 12లక్షలు. నగరానికి ఒక వైపున రైల్వేస్టేషన్‌, మరోవైపున కృష్ణానది, ఇంకోవైపున కొండ ప్రాంతం. ఈ మూడింటి మధ్యనే జనాభా మొత్తం ఇరుక్కుపోయింది. భవిష్యత్తు అవసరాలకు తగినట్టు విస్తరించే అవకాశం లేదు. విజయవాడలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి పునాదులు పడినప్పుడే కొండ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. బ్యారేజీ పనులు చేసేందుకు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కూలీలు పాతబస్తీలో కొండ ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్న వారంతా కొండ ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించుకుంటూ వచ్చారు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో జనావాసాలు పెరిగిపోయాయి. దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో నివాసాలన్నీ దాదాపు కొండ ప్రాంతాల్లోనే ఉంటాయి. అక్కడ మౌలికవసతుల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తారు. అదే విధంగా విజయవాడ కొండ ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 


పరిష్కారం ఏదీ? 

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మా వద్దకు వచ్చి ఓట్లు అడుగుతారు. గెలిస్తే అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీలిస్తారు. గెలిచాక అన్నీ మరచిపోతారు. వర్షాకాలంలో కూలీకి వెళ్లినా, ఇంటి గురించే భయం. వేసవిలో పాముల భయం. జబ్చు చేస్తే పట్టించుకునే వాళ్లు ఉండరు. కొండ ప్రాంత ప్రజలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారు. - నగరికంటి శ్యామ్‌


అంతా మారింది.. మా ప్రాంతం తప్ప 

నేను 50 ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నాను. ఇన్నేళ్లలో విజయవాడ ఎంతో మారింది. మా కొండ ప్రాంతంలో మాత్రం మార్పు కనిపించలేదు. నాయకులు మారినా, మా సమస్యలు పరిష్కారం కాలేదు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు వినీవినీ విసిగెత్తిపోయాం. - డి.రమణమ్మ


విధానపరమైన అధ్యయనం జరగాలి 

కొండప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించడానికి విధానపరమైన అధ్యయనం అవసరం. ఇప్పటివరకు అలాంటి పని జరగకపోవడం దురదృష్టకరం. రిటైనింగ్‌ వాల్‌ లేకపోవడం వల్ల కొండ చరియలు విరిగిపడి  20 ఏళ్లలో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. విధానపరమైన అధ్యయనం చేసి, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను రూపొందించాలి. -  సీహెచ్‌ బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు



Updated Date - 2021-03-02T06:28:08+05:30 IST