1852 గ్రామాలు, వార్డుల్లో విద్యుత్‌ సమస్య

ABN , First Publish Date - 2020-11-29T05:05:14+05:30 IST

తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 33 కేవీ సబ్‌స్టేషన్లు 122 దాకా దెబ్బ తిన్నాయి

1852 గ్రామాలు, వార్డుల్లో విద్యుత్‌ సమస్య
తిరుపతి వరదరాజనగర్‌లో విద్యుత్‌ స్తంభంపై పడ్డ వృక్షం

తిరుపతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 33 కేవీ   సబ్‌స్టేషన్లు 122 దాకా దెబ్బ తిన్నాయి. 33 కేవీ విద్యుత్‌ స్తంభాలు 75 కూలిపోగా, 11 కేవీ స్తంభాలు 930 దెబ్బతిన్నాయి. ఇక ట్రాన్స్‌ఫార్మర్లయితే 298 ధ్వంసమయ్యాయి. ఫలితంగా 25 మండలాలకు చెందిన 1852 గ్రామాల్లో, వార్డుల్లో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. గురు,శుక్రవారాల్లో ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిరవధికంగా 24 గంటల నుంచీ 48 గంటల పాటు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఛార్జబుల్‌ పరికరాలు కూడా పనికిరాకుండా పోయాయి. మొబైల్‌ లేందే ఏమీ తోచని జనానికి చివరికి వాటిని ఛార్జి చేసుకునే వీలు కూడా లేకపోయింది. దీంతో సమస్య గురించి అధికారులకు సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.రాష్ట్రంలోని ఏకైక వేసవి విడిదైన హార్సిలీహిల్స్‌లో 26వ తేదీ నుంచీ విద్యుత్‌ లేదు. శనివారం ట్రాన్స్‌కో అధికారులు కూలిపోయిన విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరించే పనులు మొదలు పెట్టారు. సాయంత్రానికి ఓ వరుసలోని టూరిజం కాటేజీలకు మాత్రం సరఫరా పునరుద్ధరించారు. హిల్స్‌పై 80 శాతం ఇంకా అంధకారంలోనే వుంది. ఆదివారం సాయంత్రానికి మొత్తం పునరుద్ధరించే అవకాశముంది.ప్రభావిత ప్రాంతాల్లో గ్రామాలే కాకుండా తిరుపతి నగరం సహా పలు పట్టణ ప్రాంతాలు కూడా వుండడం తుఫాను తీవ్రతకు అద్దం పడుతోంది. శనివారం సాయంత్రానికి కూలిన 33 కేవీ స్తంభాలు 75లో 40  పునరుద్ధరించగలిగారు. అలాగే 11 కేవీ స్తంభాలు 930 కూలిపోగా వాటిలో 300 మాత్రమే తిరిగి ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు 298 ధ్వంసం కాగా 143 పునరుద్ధరించారు.122 సబ్‌ స్టేషన్ల పరిధిలో సరఫరా ఆగిపోగా 121 చోట్ల బాగు చేశామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. మొత్తం ప్రభావిత 1852 గ్రామాల్లో 1639 చోట్ల విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని, ఇంకా 213 చోట్ల పనులు జరుగుతున్నాయంటున్నారు. ఈ 213 గ్రామాల్లో కూడా తాగునీటి పథకాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే భిన్నంగా వుంది. 33 కేవీ లైన్‌ స్తంభాలు 35, 155 ట్రాన్స్‌ఫార్మర్లు ,11 కేవీ స్తంభాలు 630 పునరుద్ధరణకు నోచుకోక పెండింగ్‌లో వుంటే అన్ని సబ్‌ స్టేషన్ల పరిధిలో సరఫరా ఎలా పునరుద్ధరించారన్న ప్రశ్నకు సమాధానం లేదు.

 కలకడ మండలంలో 70 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. శనివారం సాయంత్రానికి 67 గ్రామాలకు సరఫరా ఇవ్వగా ఇంకా మూడు గ్రామాలు చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాయి.


కంభంవారిపల్లె మండలం నూతనకాల్వ, గుట్టలపై, జిల్లేళ్ళమంద పంచాయతీల్లో విద్యుత్‌ సరఫరా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. గ్రామాలన్నీ అంధకారంలో వున్నాయి.


 పులిచెర్ల మండలం యావత్తూ గురువారం ఉదయం నుంచీ శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఒకటిన్నర రోజు పాటు విద్యుత్‌ సరఫరా లేదు.


 పాకాల మండలంలో 26వ తేదీ నుంచీ మండల కేంద్రం సహా పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. శనివారం నాటికి 70 శాతం గ్రామాలకు పునరుద్ధరించగా ఇంకా 30 శాతం గ్రామాలు చీకట్లోనే వున్నాయి.


ఐరాల మండలంలో 26వ తేదీ 28 పంచాయతీల పరిధిలో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. శనివారం నాటికి 75 శాతం గ్రామాలకు పునరుద్ధరించగా మిగిలిన గ్రామాలకు ఆదివారం సరఫరా ఇవ్వనున్నారు.


సోమల మండలం అంతటా 26వ తేదీన విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా శుక్రవారం మధ్యాహ్నం పునరుద్ధరించారు. 


రామసముద్రం మండలంలో 40 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా శనివారం రాత్రికి 39 గ్రామాలకు పునరుద్ధరించారు. ఊలపాడు పంచాయతీ గాంధీనగర్‌ ఇంకా అఽంధకారంలోనే వుంది.


 దెబ్బతిన్న తాగునీటి పథకాలు


 తుఫాను ప్రభావంతో పలుచోట్ల తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి 8 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా వుంది. మొత్తం 43 చోట్ల తాగునీటి బోర్లు, మోటర్లు, పైపు లైన్లు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు రూ. 1.02 కోట్లు అవసరమవుతుందని సంబంధిత శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. బోర్లు, మోటర్లు నీటమునిగిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగా మిగిలిన చోట్ల దెబ్బతిన్న పైపులైన్లు పునరుద్ధరిస్తున్నారు.  

పాకాల మండలం సూరినేనిపల్లె, గుట్టకింద ఇండ్లు, బిల్లయ్యపల్లె, చిన్న గోర్పాడు, గుమ్మడివారి ఇండ్లు, పచ్చిపాలపల్లె, మల్లెల చెరువు, నన్నూరివారిపల్లె, పోలవరపు ఇండ్లు, అబ్బానాయుడు ఇండ్లు, ఊట్లవారిపల్లె తదితర గ్రామాల్లో త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా లేక బోర్ల మోటర్లు పనిచేయడం లేదు. తాగునీటికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


సోమల మండలం చిన్నసోమల, ఎర్రనాగులవారిల్లె గ్రామాల్లో తాగునీటి బోర్లు దెబ్బతిని తాగునీటికి సమస్య తలెత్తింది.


చౌడేపల్లె మండల కేంద్రంతో పాటు కురప్పల్లె పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది నెలకొంది.


పుంగనూరు మండలంలోని 9 గ్రామాల్లో తాగునీటి పథకాలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లు ఏర్పాటు చేశారు.


పలు మార్గాల్లో రాకపోకలు బంద్‌


తుఫాను కారణంగా జిల్లాలో పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల నీటి ప్రవాహ ఉధృతికి రోడ్లు దెబ్బతినడం, కాజ్‌వేలు కొట్టుకుపోవడం వంటి కారణాలతో రాకపోకలు స్తంభించాయి. వీటిలో చిన్న పాటి మరమ్మతులు అవసరమైన చోట్ల, నీటి ప్రవాహ ఉధృతి తగ్గిన చోట్ల రాకపోకలు పునరుద్ధరణ జరగ్గా మిగిలిన చోట్ల పరిస్థితి అలానే వుంది.


సదుం మెయిన్‌ రోడ్డులో గార్గేయ నదిపై బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.


పాకాల మండలంలో పెద్ద వంక ఉధృతితో మూడు రోజులుగా పాకాల నుంచీ దామలచెరువు, పుంగనూరు, గానుగపెంట, మద్దినాయనపల్లె మార్గాల్లో రాకపోకలు ఆగిపోయాయి.


పీలేరు మండలంలో పీలేరు-సదుం మార్గంలోని బాలంవారిపల్లె వద్ద గార్గేయ నది ఉధృతికి మూడు రోజులుగా వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.


సోమల మండలంలో సోమల-కలికిరి, సోమల-నంజంపేట, పెద్దఉప్పరపల్లె మార్గాల్లో 20 గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గార్గేయ నది ప్రవాహంలో మరో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

పలమనేరు వద్ద కౌండిన్య నదిపై కాజ్‌వే కొట్టుకుపోవడంతో పలు మార్గాలకు పట్టణంతో రాకపోకలు ఆగిపోయాయి.


పలమనేరు మండలం కన్నమాకులపల్లె-చిన్నపేట కురవపల్లె మధ్య వంతెన పూర్తిగా దెబ్బతినడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - 2020-11-29T05:05:14+05:30 IST