కష్టాల కాలేజీ..!

ABN , First Publish Date - 2022-05-29T06:06:58+05:30 IST

కష్టాల కాలేజీ..!

కష్టాల కాలేజీ..!
ప్రభుత్వాసుపత్రిలోని బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల

అష్టకష్టాల్లో బందరులోని బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల

120 మంది విద్యార్థినులకు నాలుగే గదులు

ఒకే ఒక్క అధ్యాపకురాలు.. ప్రిన్సిపాల్‌ కూడా ఆమే..

నాల్గో సంవత్సరం విద్యార్థులే లెక్చరర్లు

కొంతమంది ప్రైవేట్‌ లెక్చరర్లతో పాఠాలు

సొంత డబ్బు చెల్లించుకుంటున్న విద్యార్థినులు

పట్టించుకోని పాలకులు, అధికారులు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :  జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని బీఎస్సీ నర్సింగ్‌ కళాశాల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా ఉంటుందని, నర్సింగ్‌ చదివే విద్యార్థినులకు ప్రాక్టీస్‌ కూడా జరుగుతుందని, రోగులకు సేవలు అందుతాయనే ఉద్దేశంతో పదేళ్ల క్రితం ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. కానీ, సౌకర్యాలు కల్పించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారు. ముగ్గురు లెక్చరర్లు, ఒక ప్రిన్సిపాల్‌తో ప్రారంభమైన కళాశాల ప్రస్తుతం ఒక లెక్చరర్‌కే పరిమితమైంది. ప్రిన్సిపాల్‌ బాధ్యత లు కూడా ఆ లెక్చరర్‌పైనే వేశారు. ఇది చాలదన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు 81 మందికి ఇన్‌ సర్వీస్‌ కోటాలో జీఎన్‌ఎం కోర్సు చదివేందుకు ఈ కళాశాలలోనే అవకాశం ఇచ్చారు.

120 మంది విద్యార్థినులు, 4 గదులు

ప్రభుత్వాసుపత్రిలోని ప్రసూతి ఆసుపత్రి పై అంతస్థులో ఉన్న ఆరు గదులను బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలకు కేటాయించారు. నాలుగు గదులుండగా, ఒక్కో దానిలో 30 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరంతా ఇరుకిరుకు గదుల్లో వేసవి తాపానికి మగ్గిపోతున్నారు.  మిగిలిన రెండు గదుల మధ్యలో నడిచేందుకు ఉన్న ప్రాంతాన్నీ తరగతి గదులుగా వినియోగించుకుంటున్నారు. ఈ హాల్‌కు గోడలు లేవు.నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినులకు ఇక్కడ తరగతులు జరుగుతున్నాయి. ఒక గదిలో కూర్చున్న విద్యార్థులకు పాఠాలు చెబుతుంటే, మరో తరగతికి వినిపించేంతలా గదులున్నాయి.

సీనియర్‌ విద్యార్థినులే లెక్చరర్లు

బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల కోర్సు. ఒక్కో సంవత్సరానికి 30 మంది విద్యార్థినుల చొప్పున 120 మంది ఇక్కడ చదువుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నర్సింగ్‌ విద్యార్థినులు ఇక్కడ అభ్యసిస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ మొదటి సంవత్సరంలో తొమ్మిది సబ్జెక్టులు ఉన్నాయి. ప్రిన్సిపాల్‌గా శ్రీదేవి ఒక్కరే ఉండటంతో ఆమె సాధ్యమైనంత వరకు తరగతులను బోధిస్తున్నారు. కళాశాల పరిపాలనా వ్యవహారాలు కూడా చూస్తున్నారు. కష్టమైన సబ్జెక్టులకు బయట నుంచి లెక్చరర్లను రప్పించి పాఠాలు చెప్పించుకుంటున్నారు. విద్యార్థినులే నెలకు ఇంతని డబ్బు వేసుకుని ఆ లెక్చరర్లకు ఇస్తున్నారు. ఒక్కో లెక్చరర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి పాఠాలు చెప్పించుకుంటున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినులు వారంలో కొన్ని రోజుల పాటు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రభుత్వాసుపత్రితో పాటు చుట్టుపక్కల ఉన్న పీహెచ్‌సీలకు వెళ్లి పనిచేయాల్సి ఉంది. గూడూరు, తాళ్లపాలెం, చిన్నాపురంలోని పీహెచ్‌సీలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. దీంతో బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.  

లెక్చరర్లు లేనిచోట జీఎన్‌ఎం కోర్సు..!

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు ఇన్‌ సర్వీసు కోటాలో జీఎన్‌ఎం కోర్సు చదివేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలోని 81 మందికి జీఎన్‌ఎం ఇన్‌ సర్వీసు కోర్సు చదివేందుకు అవకాశం ఇచ్చి బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలలోనే చేర్చారు. ఒకే ఒక ప్రిన్సిపాల్‌ ఉన్న ఈ కళాశాలలో 120 మంది రెగ్యులర్‌ విద్యార్థినులు, 81 మంది ఇన్‌ సర్వీస్‌ జీఎన్‌ఎంలకు పాఠ్యాంశాలు ఎవరు చెబుతారు? ఎక్కడ కూర్చుంటారని శుక్రవారం జరిగిన క్యాపింగ్‌ సెర్మనీ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జయకుమార్‌, ఆర్‌ఎంవో కృష్ణదొరను బీఎస్సీ న ర్సింగ్‌ విద్యార్థినులు ప్రశ్నించారు. పాఠాలు బోధించేందుకు లెక్చరర్లను నియమించాలన్నారు. తామే చేతి నగదు వేసుకుని బయటి లెక్చరర్లను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. కొత్తగా వచ్చిన జీఎన్‌ఎం విద్యార్థినులకు పాఠాలు ఎవరు చెబుతారని ప్రశ్నించారు. స్పందించిన పేర్ని నాని ఆసుపత్రిలో ఎంఎస్సీ నర్సింగ్‌ చదివినవారు ఎంతమంది ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆరుగురు ఉన్నారని చెప్పగా, లెక్చరర్ల నియామకం జరిగే వరకు వారితో పాఠాలు చెప్పించాలని సూచించారు. 

భోజనమూ అంతంతే..

ఈ కళాశాలకు మెస్‌ లేదు. దీంతో ఆసుపత్రిలో వైద్యం పొందేవారికి భోజనం వండిపెట్టే మెస్‌ ద్వారానే విద్యార్థినులకూ భోజనం పెడుతున్నారు. ఇందుకు నెలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 వేలు తీసుకుంటున్నారు. భోజనం బాగున్నా, బాగోకపోయినా సర్దుకుపోతున్నామని విద్యార్థినులు తెలిపారు. కలెక్టర్‌ అయినా స్పందించి అధ్యాపకులను నియమించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 




Updated Date - 2022-05-29T06:06:58+05:30 IST