అమ్మో.. బస్టాండ్‌

ABN , First Publish Date - 2022-01-25T05:29:06+05:30 IST

సుదూర ప్రాంతాల నుంచి శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ అనేక అవస్థలకు గురి చేస్తోంది.

అమ్మో.. బస్టాండ్‌
ద్వారకాతిరుమల బస్టాండ్‌

నిత్యం రద్దీ.. ఆదాయం వృద్ధి.. సౌకర్యాలు నిల్‌

ద్వారకాతిరుమలలో ప్రయాణికుల పాట్లు


ద్వారకాతిరుమల, జనవరి 24: సుదూర ప్రాంతాల నుంచి శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్టీసీ అనేక అవస్థలకు గురి చేస్తోంది. ఆర్టీసీ అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ యాత్రికులు, ప్రయాణికులకు సౌకర్యా లు కల్పించడంపై లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ద్వారకాతిరుమల బస్టాండ్‌ సాధారణ ప్రయాణికులతో పాటు భక్తులతో నిత్యం రద్దీగా ఉం టుంది. తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కూర్చునేందుకు పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో బస్టాండ్‌ ఆవరణలో మెట్లు, నేలపై కూర్చోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రతతో నీరు తాగలేరు. మరుగుదొడ్ల నిర్వహణ పట్టించుకోవడం మానేశారు. దీనితో లోపలికి వెళ్లాలంటేనే భయ పడాల్సిందే. తీవ్ర దుర్వాసన కారణంగా ప్రయాణికులు వాటిని ఉపయోగిం చడానికి వెనకంజ వేస్తున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు చిట్టడ విని తలపిస్తున్నాయి. అక్కడక్కడా ఖాళీ మద్యం సీసాలు పడిఉండడం బస్టాండ్‌ నిర్వహణకు అద్దం పడుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం శుభ్ర చేసిన మంచినీటి ట్యాంకుల్లో నీటిని వినియోగించాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. దీపాలు వెలగకపోవడంతో రాత్రివేళల్లో బస్టాండ్‌ ప్రాంతం అంధకారంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. బస్టాండ్‌లో సమస్యల పరిష్కారానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని పలువురు భక్తులు వాపోతున్నారు. 

ద్వారకాతిరుమల బస్టాండ్‌ నుంచి భక్తులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. శని, ఆదివారాల్లో రద్దీ మరింత అధికం. ప్రతిరోజు ఏలూరు, తాడేపల్లిగూడెం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, భద్రాచలం, ఉయ్యూరు, భీమవరం, సత్తుపల్లి, నరసాపురం డిపోల బస్సులు రాకపోకలు సాగిస్తుంటా యి. ఏలూరు డిపో ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకూ నడుపుతుంది. శని, ఆదివారాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు నడిపి లక్షలాది రూపాయలు ఆర్టీసీ సొమ్ము చేసుకుంటుంది.

దశాబ్దంన్నర క్రితం నిర్మించిన బస్టాండ్‌ ఏలూరు డిపో పర్యవేక్షణలో కొనసాగుతుంది. నాటి నుంచి నేటి వరకూ భక్తుల రాకపోకలు పెరిగినా బస్టాండ్‌లో వసతులు కల్పించ లేదు. సరికదా ఉన్న వసతులు కూడా క్షీణి స్తున్నాయి. పాత బస్టాండ్‌ సెంటర్‌లో సైతం ప్రయాణికులకు బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో రోడ్డు మార్జిన్‌లో బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. ఎండ, వానలో రోడ్డున పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. పర్యాటక కేంద్రంగా ద్వారకాతిరుమలను తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్న ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ముందు కనీస సౌకర్యాలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.



Updated Date - 2022-01-25T05:29:06+05:30 IST