Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్య తీర్చని ‘సప్లయ్‌’ విధానం

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో భారత్ అగ్రగామిగా ఉంది. అయితే దేశీయ డిమాండ్ బలహీనంగా ఉందని ఆర్బీఐ ఇటీవల వెల్లడించింది. దేశీయ వినియోగాన్ని పెంపొందించవలసిన అవసరముందని పంజాబ్, హర్యానా, ఢిల్లీ చాంబర్ ఆఫ్ కామర్స్ నొక్కి చెప్పింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఉత్పత్తి 6.2 శాతం పడిపోగా దేశీయ వినియోగం 7.2 శాతం తగ్గిపోయిందని సిఎంఐఇ తెలిపింది. భారత్ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుదల ప్రధానంగా ప్రభుత్వ పాలనాయంత్రాంగం, రక్షణ రంగం నుంచి మాత్రమే సంభవిస్తుందని ఆసియన్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ వెల్లడించింది. మరింత స్పష్టంగా చెప్పాంటే ప్రజల నుంచి వినియోగ డిమాండ్ బలహీనంగా ఉంది. వ్యవసాయ దిగుబడులు పెరిగినా, వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం పెరగడం లేదు. చక్కెరను భారీ పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నాం. అయితే ఆ చక్కెరను చాలవరకు ఎగుమతి చేస్తున్నాం. దేశీయ చక్కెర వినియోగం పెరగకపోవడం వల్లే ఆ సరుకును అనివార్యంగా ఎగుమతి చేస్తున్నాం. అలాగే వస్తుసేవల పన్నుల వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే ఆ వసూళ్లను ఉత్పత్తి, వినియోగం పెరుగుదల ఫలితంగా అర్థం చేసుకోనవసరం లేదు. దేశీయ వినియోగం పెరగకపోవడమనేది ఒక తీవ్ర సమస్య. వృద్ధిరేటును పెంపొందించుకునేందుకు వినియోగం పెరగడం తప్పనిసరి అనేది మనం విస్మరించకూడదు.


దేశీయ వినియోగాన్ని ఉద్దీపింప చేసేందుకు ప్రభుత్వం రెండు విధానాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఒకటి- సప్లయ్ (సరఫరా) ఆధారిత విధానం; రెండు డిమాండ్ ఆధారిత విధానం. సప్లయ్ విధానం ప్రకారం మార్కెట్‌లో డిమాండ్ పెంచేందుకు సరుకులు సేవల ధరను ప్రభుత్వం తగ్గిస్తుంది. మార్కెట్‌లో బంగాళాదుంపల సరఫరా తగ్గిపోయిందనుకోండి. వినియోగదారులు బంగాళాదుంపలను ఎక్కువగాను, ఇతర కూరగాయలను తక్కువగాను కొనుగోలు చేస్తారు. దీనివల్ల వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన సరఫరాలతో డిమాండ్ కూడా పెరుగుతుంది. ధర తక్కువ స్థాయికి చేరినప్పుడు మాత్రమే సప్లయ్, డిమాండ్ మధ్య సమతుల్యత నెలకొంటుంది. డిమాండ్ ఆధారిత విధానం ప్రకారం మార్కెట్‌లో సరుకులకు డిమాండ్ పెంచడానికి ప్రయత్నించడం ద్వారా ప్రభుత్వం డిమాండ్‌ను నేరుగా ఉద్దీపింప చేస్తుంది.


ప్రభుత్వం సప్లయ్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తోంది. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ చాలా తక్కువ వడ్డీరేట్లకు భారీ రుణాలు సమకూరుస్తోంది. వాణిజ్య బ్యాంకులు తిరిగి వినియోగదారులకు తక్కువ వడ్డీరేట్లకు రుణాలు మంజూరు చేస్తాయి. స్వల్ప వడ్డీరేట్లు ఉత్పత్తి వ్యయాల తగ్గుదలకు, వినియోగం పెరుగుదలకు దారితీస్తాయనేది విధాన నిర్ణేతల ఆలోచనగా ఉంది. ‘ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్సెంటివ్ స్కీమ్’ (ప్లిస్)ను ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీని ప్రకారం ఉత్పత్తిని పెంచేందుకు పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలను సమకూరుస్తున్నారు. అధికోత్పత్తి, ఉత్పత్తి వ్యయాల తగ్గుదలకు దారితీసి డిమాండ్‌ను ఉద్దీపింప చేస్తుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. సప్లయ్ ఆధారిత విధానంలో సమస్యేమిటంటే డిమాండ్ వాస్తవంగా పెరగకపోవచ్చు. ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్‌లో పాలంపూర్ ప్రాంత రైతులు తాము ఉత్పత్తి చేసిన బంగాళాదుంపలను రోడ్ల పైన కుమ్మరించారు. కిలో రూ. 3 కొనుగోలు చేసేందుకు సైతం ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే రైతులు తమ ఫలసాయాన్ని అలా వదిలేసుకున్నారు. ఒక ఉత్పత్తికి తక్కువ ధర ఉన్నంత మాత్రాన అందుకు అనుగుణంగా ఆ సరుకుకు డిమాండ్ పెరుగుతుందనే హమీ లేదు. డిమాండ్ ఆధారిత విధానం విశ్వసనీయమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఉదాహరణకు కొవిడ్ ఉపద్రవంతో మాస్క్‌లకు గిరాకీ బాగా పెరిగిపోయింది. స్వల్ప వడ్డీరేట్లు, ప్లిస్ ప్రోత్సాహకాలు లేకపోయినప్పటికీ ఇది సంభవించిందనేది గమనార్హం. ఒక సరుకుకు డిమాండ్ ఉన్నప్పుడు ఉత్పత్తిదారులు ఏదో ఒక విధంగా ఆ సరుకును మరింత ఎక్కువగా తప్పక ఉత్పత్తి చేస్తారు. ‘సప్లయ్’, ‘డిమాండ్’ ఆధారిత విధానాల మధ్య తేడా ఏమిటంటే మొదటిది అనిశ్చిత ఫలితాలను మాత్రమే ఇస్తుంది. డిమాండ్‌ను పెంచవచ్చు లేదా పెంచకపోవచ్చు. అయితే రెండో విధానం తప్పక డిమాండ్‌ను పెంచుతుంది. ఆర్థికవ్యవస్థలో డిమాండ్‌ను రెండు రీతుల్లో పెంపొందించవచ్చు. ఒకటి- సంక్షేమ ఉద్యోగ గణం ఇప్పుడు ప్రభుత్వం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల మధ్య ఒక దళారీగా వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాల అమలు వ్యవస్థ నుంచి ఈ దళారులు లేదా మధ్యవర్తులను పూర్తిగా తొలగించాలి. ప్రజలకు నేరుగా డబ్బును సమకూర్చాలి. వ్యవసాయ మార్కెట్లలో దళారులకు ఎలాంటి స్థానం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎలా పూనుకుందో సంక్షేమ ఉద్యోగ గణాన్ని అలానే పూర్తిగా తొలగించి తీరాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా తమకు సమకూరిన డబ్బుతో ప్రజలు తమకు అవసరమైన సరుకులు, సేవలు కొనుగోలు చేసుకుంటారు. దీనివల్ల మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. రెండో విధానం- మన సొంత పెట్టుబడి విదేశాలకు తరలిపోవడాన్ని నిరోధించడం. కుబేర సమానులైన సంపన్నులు చాలామంది విదేశాలకు వలసపోతున్నారని మీడియా కోడై కూస్తోంది. పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు తమ ఫ్యాక్టరీలను వియత్నాం, ఇతర దేశాలలో ఏర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తి చేసిన సరుకులను భారత్‌లోకి దిగుమతి చేస్తున్నారు. కారణమేమిటి? భారత్‌లో మదుపు చేసేందుకు దేశీయ పారిశ్రామికవేత్తలే భయపడుతున్నారు! మన పెట్టుబడులు విదేశాలకు తరలిపోవడానికి కారణాలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి. మన సమాజంలో నెలకొన్న సామాజిక ఉద్రిక్తతలే అందుకు కారణమని నేను అభిప్రాయపడుతున్నాను. దేశంలోనే మదుపు చేసేందుకు సానుకూల పరిస్థితులను సంపూర్ణంగా నెలకొల్పేందుకు ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...