విదేశీ విద్యకు దీవెనేది?

ABN , First Publish Date - 2020-02-16T09:43:34+05:30 IST

గౌతమి విశాఖపట్నంలో బీటెక్‌ పూర్తిచేసింది. ఇప్పుడు ఆస్ర్టేలియాలోని మెల్‌బోర్న్‌లో ఎమ్‌ఎస్‌ కోర్సు చేస్తోంది. విదేశాలకు వెళ్లేంత స్తోమత గౌతమికి లేకపోయినా,

విదేశీ విద్యకు దీవెనేది?

9 నెలల్లో పైసా విడుదల కాలేదు

స్కీమ్‌కి స్వస్తి పలికేలా అడుగులు?

ఇప్పటికే విదేశాల్లో చదువుతున్న వారికి నిలిచిపోయిన రీయింబర్స్‌

పైగా కొత్తగా 800మంది ఎంపిక

ఆనక వారందరికీ మొండిచెయ్యి

బడ్జెట్‌లోనూ ఘనమైన ప్రకటన

ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఎక్కువ దెబ్బ

గతంలో ఏడాదిలో 2 విడతలుగా వారందరి ఖాతాల్లో రూ.15 లక్షలు

సెమిస్టర్‌ అయిపోతున్నా నిధులు అందక విద్యార్థుల నానా అవస్థలు

అప్పులుచేసి తల్లిదండ్రుల తిప్పలు


అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గౌతమి విశాఖపట్నంలో బీటెక్‌ పూర్తిచేసింది. ఇప్పుడు ఆస్ర్టేలియాలోని మెల్‌బోర్న్‌లో ఎమ్‌ఎస్‌ కోర్సు చేస్తోంది. విదేశాలకు వెళ్లేంత స్తోమత గౌతమికి లేకపోయినా, అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ‘ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ’ పథకం ఆమెకు ఆ అవకాశం కల్పించింది. ఈ పథకంలో రావాల్సిన రూ. ఐదు లక్షలు ఆమె అక్కడ ఫీజు కట్టి కోర్సులో చేరగానే ఖాతాలో పడిపోయాయి. తొలి సెమిస్టర్‌ నాటికి మరో ఐదు లక్షలు అందాలి. కానీ, ఎన్నికల కోడ్‌, ఆ తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వం నయాపైసా విడుదల చేయకపోవడంతో గౌతమి చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.


ఇప్పుడు గౌతమి మెల్‌బోర్న్‌లోనే ఓ పెట్రోల్‌బంక్‌లో పార్ట్‌టైమ్‌ చేస్తూ.. చదువుకోడానికి తంటాలు పడుతోంది. గౌతమి లాంటి సగటు అమ్మాయిలకు, వారి మధ్యతరగతి తల్లిదండ్రుల కలలకు మొలిచిన రెక్కలు ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరుతో అర్ధంతరంగా రాలిపోయే పరిస్థితి ఏర్పడింది! జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తొమ్మిది నెలల్లో విదేశీ విద్యాదీవెనకు కేటాయించిన బడ్జెట్‌లో ఒక్క రూపాయినీ విడుదల చేయలేదు. దీంతో ఈ పథకాన్ని కొనసాగించే ఆసక్తి ప్రభుత్వానికి లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 


జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అన్ని పథకాల్లాగే అప్పటికి ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణగా అమల్లో ఉన్న పథకం పేరును విదేశీ విద్యాదీవెనగా మార్చేశారు. తొలి బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులూ కేటాయించాయి. బడ్జెట్‌ కేటాయింపు ఉండటంతో అధికారులు ఈబీసీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరిపి ఈ పథకం కోసం ఎనిమిది వందల మందిని ఎంపిక చేశారు. వారంతా కళ్ల నిండా కలలు నింపుకొని విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ యూనివర్సిటీల్లో చేరి..ఫీజులు కట్టి రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూశారు. ఎన్ని రోజులైనా వారి అక్కౌంట్లలో నిధులు జమకాకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఇప్పటికే వెళ్లిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో ఇక్కడినుంచి తల్లిదండ్రులు వారి ఫీజుల కోసం అప్పులు చేస్తూ.. ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయారు. 



నాడు..

విదేశాల్లో చదవడమంటే ఒకప్పుడు సగటు విద్యార్థికి గగనమే. ఆ గగనాన్ని నేలకు దించే విదేశీ విద్యా పథకంగురించి నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించింది. అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో  సీటు సంపాదించడం ఒక ఎత్తయితే, దానికి అవసరమైన వీసా, యూనివర్సిటీల్లో ఫీజులు, నివాసానికి అవసరమైన ఖర్చులు భరించడం  సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు సాధ్యం కాని పని. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయితే అది నిజంగా కలే. కొంత మందికి సీట్లు వచ్చి విదేశీ యూనివర్సిటీలు స్కాలర్‌షిప్పులు ఇచ్చినా... వీసా ప్రాసెసింగ్‌ ఖర్చు కూడా భరించలేని స్థితి! దానికోసం అప్పట్లో ఆస్తులు అమ్మి చదివించేవారు.


పేద, బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు  ఒకప్పటి కలగా ఉన్న విదేశీ విద్యను అప్పటి ప్రభుత్వం సాకారం చేసింది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, రష్యా, ఫిలిఫ్పీన్స్‌, కజకిస్థాన్‌, చైనా దేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంఎస్‌, ఎంబీబీఎస్‌, ఇతర పీజీ కోర్సులతో పాటు కొన్ని పీజీ డిప్లమో కోర్సులు,  అన్నీ వృత్తివిద్యా కోర్సులు చదువుకునే అవకాశం కల్పించారు. ఏడాదిలో రెండుసార్లు విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఎస్సీ,ఎస్టీలకు తొలుత ఈ పథకం అందించారు. వారికోసం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పేరుతో  2014-15 నుంచి విదేశీ విద్యకు చంద్రబాబు ప్రభుత్వం చేయూత అందించడం ప్రారంభించింది. ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి 491 మందికి రూ.51 కోట్లు దాకా ఖర్చు  చేశారు.


2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. బీసీలకు విదేశీ విద్యాదరణ పేరుతో  2016-17 ఏడాది నుంచి ఒక్కో విద్యార్థికి విదేశీ విద్య కోసం రూ.10 లక్షలు అందించారు. గత మూడేళ్లలో 1707 మంది బీసీ విద్యార్థులకు రూ.104 కోట్లు ఖర్చు పెట్టారు. ఈబీసీ విద్యార్థుల కోసం 2017-18 నుంచి ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకం ప్రారంభించి 783 మందికి రూ.16 కోట్లు చెల్లించారు. కాపు విద్యార్థులు సుమారు 1500 మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందారు. ఈ వర్గాలతో పాటు మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా క్రిస్టియన్‌, ముస్లిం మైనారిటీలకు, కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపు విద్యార్థులకు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్య కోసం రూ.10 లక్షలు అందిస్తున్నారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఈ పథకం వరంగా మారింది. అంతేకాదు.. ఎన్టీఆర్‌  విదేశీ విద్యా పథకం అన్ని వర్గాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది.


ఇంగ్లీషు మాట్లాడగలిగి మెరిట్‌ కలిగిన విద్యార్థులు స్వయంగా ఆన్‌లైన్‌లో విదేశీ యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షల్లో నెగ్గి సీటు సంపాదించుకొనేలా ఈ పథకం ప్రోత్సహించింది. ఈ విద్యార్థులు విదేశాల్లో ఆయా విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ అయిన తర్వాత కూడా ఏడాది లోపు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం స్కాలర్‌షిప్పును అందించేది.  ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అంచలంచెలుగా అన్నీ ప్రక్రియలు వేగవంతంగా నిర్వహించేవారు. విద్యార్థికి ఎలాంటి ప్రాసెసింగ్‌ చార్జీ లేకుండా రూ.10 లక్షల స్కాలర్‌షిప్పు నేరుగా విద్యార్థుల అక్కౌంట్లలో జమ చేశారు. విదేశాల్లో కోర్సులో చేరి, ఫీజులు చెల్లించిన వెంటనే.. వాటి మాఫీకోసం రూ.5 లక్షలు మంజూరుచేశారు. మొదటి సెమిస్టర్‌ ఫలితాలు వచ్చిన తర్వాత మిగిలిన రూ.5 లక్షలు అక్కౌంట్‌కు బదిలీ చేశారు. అనంతర కాలంలో ఈ పథకం సైజును పెంచి.. ఒక్కో విద్యార్థికి రూ. 15 లక్షలు చేశారు. 


నేడు..

వేలాదిమంది ఈ పథకం కింద గత ఐదేళ్లలో ఇప్పటికే విదేశాల్లో చదువుకొంటున్నారు. ఏడాదికి రెండు విడతలుగా వారికి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందితేనే తమ ఉన్నత చదువులను పూర్తి చేసుకోగలరు. లేదంటే పరాయి దేశంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతారు. గత ప్రభుత్వం ఇస్తున్నట్టే రూ.15 లక్షలు చొప్పున విద్యార్థుల విదేశీ విద్యకు ఖర్చుపెడతామని ఇస్తామని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం పేరు మార్చినా లబ్ధి యథాతఽథంగా అందిస్తే చాలునని అందరూ అనుకొన్నారు. పైగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎక్కువగా ప్రయోజనం పొందే పథకం ఇది. దానివల్ల ఈ పథకాన్ని జగన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగానే అమలు చేస్తుందని ఆశించారు. కానీ, కానీ, ఆ ఛాయలు ఏ కోశానా కనిపించడంలేదని ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. దీంతో లబ్ధి సగంలోనే ఆగిపోతుందా అనే దిగులు విద్యార్థులను, తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే బెంగ తల్లిదండ్రులను పీడిస్తోంది. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం, వాటి సైజును పెంచుతున్నట్టు ఆర్భాటంగా ప్రకటించుకోవడంలోని శ్రద్ధ వాటిని ఆ పేరుతోనైనా కొనసాగించడంలో కొత్త సర్కారుకు కొరవడుతున్నదనే విమర్శ తొలినుంచీ ఉంది. ఆ విమర్శలో నిజమే ఎక్కువగా ఉన్నదనేందుకు విదేశీ విద్యాదీవెనకు పట్టించిన గతే నిదర్శమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


Updated Date - 2020-02-16T09:43:34+05:30 IST