ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్ష సభ్యుల డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఉభయసభల్లో రభస కొనసాగుతూనే ఉంది. సాగు చట్టాలపై చర్చ, రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో బుధవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లో తీవ్ర నిరసన తెలిపారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో మూడు సార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను కొనసాగనిచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ వెల్‌లోకి దూసుకెళ్లడంతో ప్రశ్నోత్తరాల సమయం 20 నిమిషాల పాటే సాగింది. వరసగా మూడో రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సభా కార్యక్రమాలు కొనసాగగా, టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్‌లో నిరసన కొనసాగించారు. రైతుల అంశంపై ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేశారు. మరోవైపు, రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రెండో రోజైన బుధవారం కూడా సభ్యుల నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తృణమూల్ ఎంపీలు సౌగతా రాయ్, మహుయా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా ప్రతిపక్ష నేతలు ప్రదర్శన నిర్వహించారు.
రైతుల మృతిపై సమాచారం లేదు: కేంద్రం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న రైతుల్లో 700 మందికిపైగా మరణించినట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తెలిపింది. కాబట్టి నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తే ఉండదని లోక్‌సభలో పేర్కొంది. కాగా, సాగు చట్టాలను ఉపసంహరించుకుంటూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాష్ట్రపతి కోవింద్ బుధవారం ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.