40 శాతం రిజర్వేషన్‌తో ప్రియాంక మహిళా మేనిఫెస్టో

ABN , First Publish Date - 2021-12-08T22:37:43+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో..

40 శాతం రిజర్వేషన్‌తో ప్రియాంక మహిళా మేనిఫెస్టో

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉద్యోగాల్లో 40 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రియాంక గాంధీ బుధవారంనాడు విడుదల చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఈ మేనిఫెస్టో ఒక రోడ్‌మ్యాప్‌ వంటిదని అన్నారు. మహిళల సాధికారతపై ఎన్నికల డాక్యుమెంట్ ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మహిళలకు పెద్దపీట వేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఛాంపియన్‌గానే నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియాకు తొలి మహిళా ప్రధానిని (దేశ మూడవ ప్రధాని ఇందిరాగాంధీ) అందిస్తే, అమెరికా ఇటీవలే తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుందని పేర్కొన్నారు.


ఇటు రాజకీయాల్లోనూ, అటు సమాజంలోనూ మహిళలను చురుకుగా పాల్గొనేలా చేయడం ద్వారా మహిళా వివక్షను తొలగించి, సాధికారత కల్పించాలనే ఉద్దేశంతోనే మహిళా మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25 సిటీల్లో హాస్టళ్లు నిర్మిస్తుందని, బాలికల కోసం ఈవెనింగ్ స్కూల్స్ తెరుస్తామని చెప్పారు. 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే ప్రభుత్వమే 'ఫిక్స్‌డ్ డిపాజిట్' అకౌంట్ తెరుస్తుందన్నారు. ఎంఎన్‌ఈఆర్‌జీఏలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని, సబ్సిడీలపై రుణాలివ్వడంతో పాటు 50 శాతం పీడీఎస్‌లు మహిళలకు కేటాయిస్తామని చెప్పారు.

Updated Date - 2021-12-08T22:37:43+05:30 IST