ప్రియాంక జవాల్కర్‌: కథ డిమాండ్‌ చేస్తే దేనికైనా రెడీ!

‘‘టాక్సీవాలా’ సక్సెస్‌ను వాడుకోలేకపోయాను చాలామంది అన్నారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధి రాతను ఎవరూ మార్చలేరు. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’, ‘తిమ్మరుసు’ ఇంత హిట్‌ అవుతాయని ఊహించలేదు. ‘గమనం’ కూడా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అని ప్రియాంక జవాల్కర్‌ అన్నారు. సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కానున్న ఈ చిత్రంలో శ్రియశరన్‌,  శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్‌, నిత్యా మీనన్‌ ప్రధాన పాత్రధారులు. రమేష్‌ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా ప్రియంక విలేకర్లతో మాట్లాడారు. 


ఇందులో నా పాత్ర పేరు ఝారా! ముస్లిం అమ్మాయి పాత్ర పోషించాను. నా పాత్రకు పెద్దగా డైలాగ్స్‌ ఉండవు. కేవలం కళ్లతోనే హావభావాలు పలికించాలి. అది కొంచెం కష్టంగా అనిపించింది. ఆ పాత్ర కోసం చాలా రిఫరెన్స్‌ తీసుకున్నా. నటనకు స్కోపున్న పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది. మామూలుగా నేను కమర్షియల్‌ సినిమాలకే పనికొస్తానని, తెల్లగా ఉంటానని విలేజ్‌ పాత్రలకు వద్దని అంటారు. ఇలాంటి పాత్ర చేస్తే భవిష్యత్తులో నటనకు ప్రాధాన్యమున్న అవకాశాలు వస్తాయని చేశా. ఈ కథ వినగానే ‘వేదం’ గుర్తొచింది. ఇక ఇళయరాజా గారు సంగీతం అనగానే ఇలాంటి అవకాశం రాదని ఓకే చెప్పేశా. చారుహాసన్‌ గారి నటన గురించి నేనేం చెప్పగలను. 


ఆ భయం ఉంది...

సెలెక్టెడ్‌ కథలతో సినిమాలు చేస్తే.. కెరీర్‌ స్లో అవుతుందనే భయం ఉంది. అలాగని వచ్చిన సినిమాలన్నీ చేసేసి అవి ఫ్లాపు అయితే నా పరిస్థితి ఏంటనే భయం కూడా ఉంటుంది. అందుకే నాకు కథ నచ్చితేనే ఒప్పుకుంటాను. అందరూ హీరోలతో చేయాలని ఉంది. హీరోతో సమానంగా పాత్రలు చేయాలని ఉంది. ఓ మంచి లవ్‌స్టోరీ కూడా. కథ డిమాండ్‌ చేేస్త ఎలాంటి పాత్ర చేయడానికైనా చేస్తాను. బోల్డ్‌ క్యారెక్టర్‌ చేయడానికైనా రెడీగా ఉన్నా. 



Advertisement