టీకాలు లేని ‘టీకా ఉత్పవాలు’ : ప్రియాంక గాంధీ వాద్రా

ABN , First Publish Date - 2021-05-12T22:53:31+05:30 IST

టీకా ఉత్సవాలు జరిపారు కానీ, ప్రజలకు టీకాలు ఇవ్వడానికి

టీకాలు లేని ‘టీకా ఉత్పవాలు’ : ప్రియాంక గాంధీ వాద్రా

న్యూఢిల్లీ : టీకా ఉత్సవాలు జరిపారు కానీ, ప్రజలకు టీకాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయలేదని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దశలో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 


ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, వ్యాక్సిన్ల తయారీలో భారత దేశం అతి పెద్ద దేశమని పేర్కొన్నారు. ఏప్రిల్ 12న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం టీకా ఉత్సవాలను నిర్వహించిందన్నారు. అయితే వ్యాక్సిన్లను ప్రజలకు ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. 30 రోజుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 82 శాతం క్షీణించిందని తెలిపారు. ఏప్రిల్ 12న, మే 9న జరిగిన వ్యాక్సినేషన్‌ను సరిపోల్చుతూ గ్రాఫిక్స్‌ను షేర్ చేశారు. 


ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాల కన్నా మన దేశం చాలా వెనుకబడి ఉందని తెలిపే గ్రాఫ్‌ను కూడా ప్రియాంక షేర్ చేశారు. మోదీ వ్యాక్సిన్ ఫ్యాక్టరీలకు వెళ్ళి, ఫొటోలు తీయించుకున్నారని, ఆర్డర్లు మాత్రం 2021 జనవరిలో ఇచ్చారని దుయ్యబట్టారు. అమెరికా, తదితర దేశాలు భారత దేశంలోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు చాలా కాలం క్రితమే ఆర్డర్లు ఇచ్చాయని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి వ్యాక్సిన్ అందకపోతే కోవిడ్ మహమ్మారితో పోరాడటం సాధ్యం కాదన్నారు. 




Updated Date - 2021-05-12T22:53:31+05:30 IST