యూపీ ఓటర్లకు ప్రియాంక గాంధీ భారీ హామీ

ABN , First Publish Date - 2021-10-25T21:04:49+05:30 IST

త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్

యూపీ ఓటర్లకు ప్రియాంక గాంధీ భారీ హామీ

న్యూఢిల్లీ : త్వరలో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని అందజేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఓ ట్వీట్‌ ద్వారా హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కోవిడ్ మహమ్మారి సమయంలో దయనీయంగా మారడం అందరూ చూశారన్నారు. 


కోవిడ్-19 మహమ్మారి, ప్రస్తుత జ్వరాల వ్యాప్తి సమయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉండటం ప్రతి ఒక్కరూ చూశారని ప్రియాంక పేర్కొన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమకు ఓట్లు వేసి, అధికారాన్ని అప్పగిస్తే, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


ప్రియాంక శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ నుంచి కాంగ్రెస్ ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించారు. రైతుల రుణాల రద్దు, 20 లక్షల మందికి ఉద్యోగాలు, శాసన సభ ఎన్నికల్లో 40 శాతం పార్టీ టిక్కెట్లు మహిళలకు కేటాయించడం వంటి హామీలను ఇచ్చారు. గోధుమలు, వరిలను క్వింటాలుకు రూ.2,500 చొప్పున,  ఒక క్వింటాలు చెరకును రూ.400 చొప్పున కొంటామన్నారు. అందరికీ విద్యుత్తు బిల్లులను సగానికి తగ్గిస్తామన్నారు. కోవిడ్ సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఒక్కొక్క కుటుంబానికి రూ.25,000 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ ఉత్తీర్ణులైన బాలికలకు ఈ-స్కూటర్లు ఇస్తామని తెలిపారు. 


Updated Date - 2021-10-25T21:04:49+05:30 IST