Agneepath row : తక్షణం అగ్నిపథ్‌ను ఉపసంహరించండి : ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2022-06-18T01:46:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు హింసాత్మకంగా

Agneepath row : తక్షణం అగ్నిపథ్‌ను ఉపసంహరించండి : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఈ పథకాన్ని పూర్తిగా ఉపసంహరించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ పథకాన్ని యువతపై ఆదరాబాదరాగా రుద్దిందని శుక్రవారం ఆమె ఇచ్చిన ట్వీట్‌లో విమర్శించారు. 


అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించి 24 గంటలు గడవక ముందే దాని నిబంధనలను బీజేపీ ప్రభుత్వం మార్చవలసి వచ్చిందన్నారు. దీనినిబట్టి ఈ పథకాన్ని యువత మీద ఆదరాబాదరాగా రుద్దుతున్నారని స్పష్టమవుతోందన్నారు. తక్షణమే ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. నిలిచిపోయిన వాయు సేన నియామకాల ఫలితాలను వెల్లడించి, నియామకాలు చేపట్టాలని కోరారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను గతంలో మాదిరిగానే వయోపరిమితిని సడలించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. 


యువత ఆగ్రహానికి దిగొచ్చిన కేంద్రం

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) గురువారం రాత్రి స్పందించింది. 2022 రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అగ్నివీరులుగా నియమితులయ్యేవారికి గరిష్ఠ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు పెంచింది. త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 


రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన పథకం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) గురువారం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంత్సరాల వయసు మధ్య ఉన్నవారు అగ్నివీరులుగా ఎంపికయ్యేందుకు అర్హులని తెలిపారు. అగ్నివీరులుగా నియమితులైనవారిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తామన్నారు. వీరిలో 25 శాతం మందిని తిరిగి రెగ్యులర్ సర్వీసుకు నియమిస్తామని తెలిపారు. 


Updated Date - 2022-06-18T01:46:33+05:30 IST